సూర్యాపేట, వెలుగు : ఉండ్రుగొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంతోపాటు పర్యాటక అభివృద్ధికి రూ.2.5 కోట్లు నిధులు మంజూరైనట్లు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉండ్రుగొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, పురాతన కట్టడాలను ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా పటేల్ రమేశ్ రెడ్డి మాట్లాడుతూ ఉండ్రుగొండ గుట్టను తెలంగాణలోనే నంబర్ వన్ టూరిజం స్పాట్ గా మారుస్తామన్నారు. ఉండ్రుగొండ సందర్శనకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఉండ్రుగొండ అభివృద్ధి కార్యక్రమానికి త్వరలోనే శ్రీకారం చుడతామని తెలిపారు. ఆయన వెంట అధికారులు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.