ఎల్బీనగర్, వెలుగు: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ మిషనరీ ప్రదర్శన శుక్రవారం జరిగింది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమానికి ఆ జిల్లా చైర్ పర్సన్ అనితా రెడ్డి చీఫ్‌గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. కారం, పసుపు, మసాలా వంటి తదితర వంట వస్తువులను తయారు చేసి మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగవచ్చన్నారు.
మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన కోసం ప్రభుత్వాలు వివిధ పథకాల కింద అందిస్తున్న తోడ్పాటుతో ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా సమాఖ్య గ్రూపులకు రూ.10 లక్షల వరకు రుణం అందజేస్తోందని గుర్తుచేశారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా పరిశ్రమల అధికారి రాజేశ్వర్ రెడ్డి పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిశ్రమల మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిశ్రమల మేనేజర్ వినయ్ కుమార్, హైదరాబాద్ జిల్లా పరిశ్రమల మేనేజర్ పవన్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ప్రభాకర్ పాల్గొన్నారు.