- 13న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహణ
హైదరాబాద్, వెలుగు : ఈ నెల13న జరిగే అలయ్ బలయ్ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించినట్టు అలయ్ బలయ్ కమిటీ చైర్ పర్సన్ బండారు విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్నారని చెప్పారు. బుధవారం హైదరాబాద్ లో మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, బీజేపీ అంబర్పేట్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావుతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆదివారం ఉదయం 11గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు.
ఇది వివిధ రాజకీయ పార్టీలను కలిపే వేదిక అని తెలిపారు. గత 18 ఏండ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇది 19వ ఏడాదని తెలిపారు. ఈసారి కూడా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా అలయ్ బలయ్ కార్యక్రమం చేపట్టనున్నట్టు వెల్లడించారు. తెలంగాణ సంస్కృతిపై ఎగ్జిబిషన్ గ్రౌండ్లో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని, మిల్లెట్స్ వంటకాలు ఉంటాయని చెప్పారు. రెండు రాష్ట్రాల సీఎంల షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉందని చెప్పారు. వారితో పాటే తెలంగాణ, ఏపీకి చెందిన అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులను సైతం ఆహ్వానించినట్టు తెలిపారు. అయితే, ఈసారి సినీ ప్రముఖులను ఈ కార్యక్రమానికి పిలవలేదని విజయలక్ష్మి వెల్లడించారు.