కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని కోరుతూ రేపు మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నట్లు చైర్ పర్సన్ జాహ్నవి చెప్పారు. గత 45 రోజులుగా కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని విలీన గ్రామాల రైతులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి.. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని కోరుతూ తీర్మానం చేస్తామని చెప్పారు. రైతులకు వ్యతిరేకంగా తాము ఎలాంటి చర్యలు తీసుకోమని స్పష్టం చేశారు.
డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు స్వీకరించేందుకు 60 రోజుల సమయం ఇచ్చారని చైర్ పర్సన్ జాహ్నవి చెప్పారు. ఈ 60 రోజుల్లో దాదాపు 2,396 అభ్యంతరాలు వచ్చాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రైతుల పక్షానే ఉంటుందని, వారికి అన్యాయం జరిగే పని చేయదని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రైతులకు సంబంధించిన ఒక్క ఎకరం భూమి కూడా తీసుకోరని ప్రభుత్వ విప్, కామారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్థన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారని తెలిపారు.
ఎమ్మెల్యే గంప గోవర్థన్ ఇల్లు ముట్టడి కార్యక్రమం వాయిదా
రేపు కామారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్థన్ ఇంటి ముట్టడికి ఇచ్చిన పిలుపును వాయిదా వేస్తున్నట్లు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రకటించింది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని కోరుతూ శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే గంప గోవర్థన్ ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పేర్కొంది. మరోవైపు శుక్రవారం (ఈనెల 20న) ఉదయం 10 గంటలకు అడ్లూర్ గ్రామంలోని కృష్ణ మందిరం వద్ద రైతులందరూ సమావేశం కావాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నిర్ణయించింది.