- ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ సుజాత
సంగారెడ్డి టౌన్, వెలుగు: ఆర్యవైశ్యుల ఆర్థిక పురోభివృద్ధికి ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కాల్వ సుజాత అన్నారు. ఆదివారం సంగారెడ్డిలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో దశాబ్ద కాలంపాటు పోరాటం చేసినప్పటికీ కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదన్నారు.
ఈ నెల 8న కార్పొరేషన్ చైర్మన్ గా తాను ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా సికింద్రాబాద్ నుంచి ఆర్యభవన్ వరకు నిర్వహించే ర్యాలీకి ఆర్యవైశ్యులు ఎక్కువ సంఖ్యలో హాజరుకావాలని కోరారు. సంఖ్యాబలం చూపితేనే ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయిస్తుందన్నారు. ఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులకు తాను ఎప్పటికీ అండగా ఉంటానన్నారు.
ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనంత కిషన్ మాట్లాడుతూ.. దేశంలో అతిపెద్ద గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పడం గర్వకారణమన్నారు. అనంతరం కొత్త అధ్యక్షుడిగా కొంపల్లి విద్యాసాగర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాధంశెట్టి పూర్ణచందర్, కార్యదర్శిగా నామ భాస్కర్, కోశాధికారిగా ఆమెటి భాస్కర్, ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సమావేశంలో ఆర్యవైశ్య పెద్దలు గంప శ్రీనివాస్, జూలకంటి లక్ష్మణ్, మణిగాల మాణిక్ ప్రభు, బొమ్మ చంద్రశేఖర్, బండారి యాదగిరి, బుచ్చిలింగం, తేజవతి, పురం రజిని, హరీశ్ పాల్గొన్నారు.