చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ సాధించాం: పోచారం శ్రీనివాస్​రెడ్డి

కోటగిరి, వెలుగు: తొలి దశ తెలంగాణ ఉద్యమంలో వీర వనిత చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే మలిదశ ఉద్యమం వచ్చిందని, చివరగా అనేకమంది ప్రాణత్యాగాలతో  ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందని స్పీకర్ పోచారం శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కోటగిరిలో కొత్తగా ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పీకర్​ మాట్లాడుతూ.. రజాకార్లు, భూస్వాములు, దొరల ఆగడాలను ఎదురొడ్డి నిలిచిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. 

మహిళలు ఇంటి నుంచి బయటకు రావడానికే ఆలోచించే రోజుల్లో సమాజంలో జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు పోరాటం చేశారన్నారు. ఐలమ్మ సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఆమె జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. రజకుల అభివృద్ధికి 250 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, బీసీ బంధు కింద రూ. లక్ష సాయం చేస్తున్నామన్నారు. రజకుల జీవనోపాధి కోసం అన్ని గ్రామాల్లో దోబీ ఘాట్లు నిర్మిస్తున్నామని, మున్సిపాలిటీల్లో మోడ్రన్ దోబీ ఘాట్లు నిర్మించేందుకు రూ.2 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. 

ALSO  READ :-  మైనంపల్లి ఎంట్రీతో కాంగ్రెస్​లో ఉత్కంఠ

అనంతరం కోటగిరికి చెందిన పలువురికి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పత్తి లక్ష్మణ్, నియోజకర్గ బీఆర్‌‌ఎస్ ఇన్​చార్జ్​పోచారం సురేందర్ రెడ్డి, జడ్పీటీసీ శంకర్ పటేల్, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్: కామారెడ్డి జిల్లా కేంద్రంలో  మంగళవారం చాకలి ఐలమ్మ  జయంతి వేడుకలు నిర్వహించారు. అడిషనల్​కలెక్టర్​ చంద్రమోహన్, టీఎన్జీవో, రజక సంఘం, బీసీ కులాల సంఘం ప్రతినిధులు ఐలమ్మ ఫొటోకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జిల్లా లైబ్రరీలో చైర్మన్​పున్న రాజేశ్వర్, జిల్లా పోలీసు ఆఫీసులో ఎస్పీ శ్రీనివాస్​రెడ్డి నివాళి అర్పించారు.

ఎల్లారెడ్డి: మున్సిపల్ కేంద్రంలో చిట్యాల చాకలి ఐలమ్మ 128 వ జయంతి వేడుకలు రజక సంఘం ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఐలమ్మ ఆశయాలను నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. రజక సంఘం మండలాధ్యక్షుడు సాయి ప్రసాద్, దాకాయి పర్వయ్య, సంగమేశ్వర్, సాయిలు, అన్నసాగర్ వేణు, శ్యామ్, బాలరాజు పాల్గొన్నారు. 

నందిపేట: మండల కేంద్రంలో కాంగ్రెస్​పార్టీ ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. పాత ఎమ్మార్వో ఆఫీస్​వద్ద ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.మండలాధ్యక్షుడు మహిపాల్, ప్రశాంత్, నాగరాజు పాల్గొన్నారు.