కోఠి మహిళా యూనివర్సిటీకి వీరనారి ఐలమ్మ పేరు

కోఠి మహిళా యూనివర్సిటీకి వీరనారి ఐలమ్మ పేరు

తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్త రాష్ట్రంలో చాలా మార్పులు జరిగాయి. అందులో కొన్ని భౌగోళిక, రాజకీయ, ఆర్థికమార్పులు కాగా,  మరికొన్ని సాంస్కృతిక మార్పులు జరిగాయి. కానీ, అవి తెలంగాణ కోసం పోరాడిన యువతను, మేధావులు, విద్యార్థులను అంతగా సంతోషపెట్టలేకపోయాయి. అయితే, రాష్ట్రం వచ్చిన పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విద్యావంతుల ఆకాంక్షలను నెరవేర్చే కృషి ప్రారంభించింది. అందులో భాగంగానే దొరల గడీలా తీర్చిదిద్దబడిన  ప్రగతి భవన్​ను  మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్​గా మార్చారు.  

ప్రజా సాహిత్యమే ప్రధానం. కనుక ఈ నేల మీద తెలంగాణ ప్రజా సాహిత్యాన్నే సినీ సాహిత్యంగా మలచాలి అని మార్గదర్శకం చేసినట్టు నంది అవార్డుకు గద్దర్ అవార్డుగా పేరు పెట్టారు.  తాజాగా హైదరాబాద్ నడిబొడ్డులోని కోఠి ఉమెన్స్ యూనివర్సిటీకి వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పేరు పెడుతున్నట్టు  ప్రకటించారు. నిజంగా ఇలా ఐలమ్మ పేరు పెట్టడం హర్షణీయం.  సెప్టెంబర్ 10న రాష్ట్ర సాంస్కృతిక కేంద్రమైన రవీంద్రభారతిలో జరిగిన చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సభా వేదిక మీది నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేయడం గొప్ప విషయం. ఈ రోజు (సెప్టెంబర్​ 26) ఐలమ్మ జయంతి.

యూనివర్సిటీకి వీరనారి పేరు స్ఫూర్తిదాయకం

సమాజంలో అత్యంత వెనుకబడిన బీసీల జాబితాలో చాకలి కులం ఉన్నది.  ఇప్పటికీ గ్రామాల్లో బట్టలుతకడం, చావు, దినం కార్యాలతో పాటు, పెండ్లి తదితర శుభకార్యాల పనులు చేస్తున్నారు. అంతేగాకుండా పండుగలు, జాతర్లు జరిగినప్పుడు అన్ని ఊళ్లలో  దేవుని గుడులకీ సున్నం వేయడం, శుభ్రపరచడం లాంటి అనేక కార్యాలు చాకలి కులమే చేస్తుంది.  ఇదంతా తమ కులవృత్తిలో భాగంగా చేస్తున్నారు తప్ప ఎంత సంపాదన వస్తుంది అనేదానితో సంబంధం లేదు.  దీంతో ఆర్థిక ఇబ్బందులు ఆ కులాన్ని వెంటాడుతున్నాయి. దానికి తోడు పని అవసరాలు, అవమానాలతో చాకలి కులంలో పిల్లలు బడికిపోవడం, చదువుకోవడం చాలా తక్కువగా ఉంటుంది. ఆ తక్కువలో కూడా డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉంటాయి.

 యూనివర్సిటీ స్థాయి వరకు వచ్చి చదువుకోవడం చాలా అరుదైన విషయం. కాబట్టే ఇప్పటిదాకా విద్యా, ఉద్యోగ రంగాల్లో చాకలి కులం వారు మిగతా వారితో పోల్చితే చాలా వెనకబడి ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో చాకలివారికి సీఎం రేవంత్​ చేసిన ఈ ప్రకటన ఒక సమున్నతమైన గౌరవాన్ని, చక్కటి ఆత్మ విశ్వాసాన్ని ఇచ్చింది. ఇది చాకలి కుటుంబాలు తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించడానికి ప్రేరణగా తోడ్పడుతుంది. ముఖ్యంగా అమ్మాయిల ఎడ్యుకేషన్ పర్సంటేజీ పెరుగుతుంది. ఒక యూనివర్సిటీకి తమ వీరనారి పేరు పెట్టారంటే మనం అక్కడి వరకు వెళ్ళి చదవాల్సిన అవసరం ఉందనే పట్టుదల కలుగుతుంది.  స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇంతటి గొప్ప ముందడుగుకి కారణం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగల రేవంత్ రెడ్డి సీఎం కావడమే అని చెప్పకతప్పదు.

ఉద్యమ వీరులకు తగిన గుర్తింపు

ఐలమ్మ యూనివర్సిటీ అనే ఈ నిర్ణయంతో దేశ చరిత్రలోనే రేవంత్ రెడ్డి ఓ కొత్త అధ్యాయం లిఖించాడు.  ప్రజా సాంస్కృతిక, సామాజిక మార్పుకు మార్గం వేశాడు. దీన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్టాల ముఖ్యమంత్రులు అనుసరించాల్సిన అవసరం ఉన్నది. దేశమంతటా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వీరయోధులకు ఇలాంటి గుర్తింపు, గౌరవం దక్కాల్సిన ప్రాధాన్యతను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరపైకి తెచ్చాడు.  ఫ్రీడమ్ ఫైటర్స్, ఉద్యమ వీరులకు తగిన గుర్తింపు, మర్యాద, ప్రాధాన్యత కల్పించడంలో రేవంత్ రెడ్డి అందరికి ఆదర్శంగా నిలిచాడు. ఆ క్రమంలోనే ఈ నిర్ణయానికి కొనసాగింపుగా మరికొన్ని పనులు చేయాలని తెలంగాణ రజక సమాజం కోరుకుంటున్నది. దొరల గడీల్లో గడ్డి మొలవాలని కోరుకున్న ఐలమ్మ పోరాట క్షేత్రమైన జనగామ జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టడం,  ట్యాంక్​బండ్ మీద ఐలమ్మ విగ్రహం పెట్టడం సముచితంగా ఉంటుంది. 

అదేవిధంగా తెలంగాణాలో పదిహేను లక్షల పైగా జనాభా ఉన్న రజకులకు కార్పొరేషన్,  పాలక మండలిని ఏర్పాటుచేసి, రజకుల అభివృద్ధికి రూ. 500 కోట్లు కేటాయించాలి. ప్రభుత్వ హాస్పిటల్స్, జైళ్లు, మెడికల్ కాలేజీల్లో దోభీ పనులు కాంట్రాక్టర్లకు కాకుండా రజకులకే అప్పగించాలి. రజకులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి. రజక విద్యార్థులకు ప్రత్యేకంగా విదేశీ విద్యానిధి పథకం ప్రవేశ పెట్టాలి. తెలంగాణలోని యావత్ రజక సమాజం అంతా అప్పుడే  రేవంత్​కి మద్దతుగా నిలబడగలదు. 

1924లో కోఠి ఉమెన్స్ కాలేజీ ఏర్పాటు

మొట్టమొదటి ఉమెన్స్ కాలేజీగా 1924 సంవత్సరంలో కోఠి ఉమెన్స్ కాలేజీ ఏర్పాటు అయింది. నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ పిలుపుమేరకు, హైదరాబాద్ రాజ్యంలో మహిళలకు విద్యతో సాధికారత కల్పించాలనే లక్ష్యంతో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ కాలేజీని 1924వ సంవత్సరంలో స్థాపించారు. అప్పుడు కేవలం ఏడుగురు ఇంటర్మీడియట్ ఆర్ట్స్ కోర్సులో ప్రవేశం పొందడంతో  గోల్డెన్ థ్రెషోల్డ్ లోని  నాంపల్లి బాలికల పాఠశాలలో ఇది మొదలైంది.  నైజాం పాలనలో  బ్రిటిష్  రెసిడెంట్ బిల్డింగ్​గా ఉన్న ప్రస్తుత ప్రదేశంలోకి 1949 సంవత్సరంలో మార్చారు. అప్పటి నుంచి అక్కడే సుమారు నలభై ఎకరాల విస్తీర్ణంలో కొనసాగుతున్నది. 

2022 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణ మహిళా యూనివర్సిటీగా అప్ గ్రేడ్ చేశారు. కానీ, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ యూనివర్సిటీకి ఐలమ్మ పేరు పెట్టి  రజకుల ఉన్నత చదువులకు జీవం పోశారు. ముఖ్యంగా అత్యంత వెనుకబడిన  చాకలి కులస్థుల ఆత్మగౌరవాన్ని పెంపొందించారు. ఇందుకు యావత్ రజక జాతి ముఖ్యమంత్రిని నెత్తికెత్తుకుంటున్నారు. దొరల సంస్కృతిని పక్కనపెట్టి రేవంత్ రెడ్డిని గుండెల్లో పెట్టుకుంటున్నారు.  సరిగ్గా వందేండ్ల కింద హైదరాబాద్ లో మహిళా కాలేజీ ఏర్పాటు చేయమని నిజాంకి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టే, ఇప్పుడు ఐలమ్మ పేరు ఆ యూనివర్సిటీకి పెట్టమని ముఖ్యమంత్రికి సూచించినందుకు ప్రొఫెసర్ కంచ ఐలయ్య సదా అభినందనీయుడు.

– కలుకూరి రాజు