ఐలమ్మ స్ఫూర్తితో.. హక్కుల కోసం కొట్లాడుదాం

అయ్యా.. నీ బాంచన్ కాల్మొక్కుత అంటూ.. వెట్టి చేసిన బతుకుల విముక్తి కోసం తిరగబడ్డ తెగువ ఆమెది. దొర వస్తుండంటేనే నెత్తిన రుమాలు, కాళ్ల చెప్పులు చేతుల్లోకి తీసుకొని వంగి దండాలు పెట్టే భయంకరమైన ఆ రోజుల్లో.. దొరనే ఎదురించిన ధీర వనిత ఐలమ్మ. పండించిన పంట గుంజుకునేందుకు వచ్చిన దొర గూండాలపై తిరుగుబాటు చేసింది. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఆనాడు ఐలమ్మ లాంటి వీరులు చేసిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని నేడు విద్య , వైద్యం కోసం, ఉపాధి, ఉద్యోగాల కోసం ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉంది. పాలకులు ఊదరగొడుతున్న బంగారు తెలంగాణ భ్రమల్లో బతికినంతకాలం బానిసత్వం పెరుగుతుందే తప్ప... ఎటువంటి ప్రయోజనం ఉండదు. పాలితులుగా ఉన్నంత కాలం దోపిడీ నుంచి విముక్తి సాధ్యం కాదనే వాస్తవాన్ని ప్రజలకు బోధించి, పీడిత వర్గాలను పాలకులుగా మార్చే పోరాటం చేయాల్సిన సందర్భమిదే.

నిజాం సంస్థానంలో తెలంగాణ భాగం అనే విషయం తెలిసిందే. 1940 లలో దొరలు, దేశ్ ముఖ్ లు, దేశ్ పాండేలు, భూస్వాములు, పెత్తందార్లు, నిజాం రాజుకు కప్పం కడుతూ గ్రామాలపై అధికారం చలాయించేవారు. ప్రజలను వివిధ రకాల పన్నుల పేరుతో పీడించడమే గాకుండా వారితో నిర్బంధ వెట్టి చేయించుకునేవారు. చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, చేనేత, నీరటికాడు, మాదిగ తదితర వృత్తి కులాల బతుకులు వెట్టిలోనే తెల్లారేవి. వంతుల వారీగా పొద్దు పొడవక ముందే దొర గడీల్లో  ప్రత్యక్షమై సకులం పనులు సగవెట్టేవారు. నాట్ల అయినా, కోతలైనా.. దొరల భూముల్లో పూర్తయిన తర్వాతే మిగతా వారు చేసుకోవాలనే నియంతృత్వం సాగేది. దొర ముందుకు వెళ్లాలంటే నెత్తిన రుమాలు, కాళ్ల చెప్పులు చేతుల్లోకి తీసుకొని వంగి నడవాల్సిన భయంకరమైన రోజులవి. మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. భూస్వాములు, దొరలు, పెత్తందారులు ఆడిందే ఆట.. పాడిందే పాట. దేవదాసి, దాసీల వ్యవస్థతో మహిళలపై జరిగిన అఘాయిత్యాలు, వారు పడిన బాధలు వర్ణనాతీతం. పంటలు చేతికందిన నాడు వెట్టి చాకిరి చేసిన కుల వృత్తుల వారికి భిక్షమేసినట్లు వారికి తోచినంత ధాన్యం పెట్టేది. మాదిగలనైతే కళ్లం అడుగులు ఊడ్చుకోమనే దౌర్భాగ్య పరిస్థితులు ఆనాటివి. దేశ చరిత్రలో నే1940 నాటి తెలంగాణ ప్రజా పోరాటం విశిష్టమైనది. ఆ నాటి తెలంగాణ ఉద్యమం దొరలు, రజాకార్లు చేసిన ఎన్నో పోరాట గాథలను గుర్తుకు తెస్తాయి. తెలంగాణ సాయుధ పోరాటం కేవలం భూమి కోసం, భుక్తి కోసమో సాగింది కాదు దోపిడీకి, అణచివేతకు వ్యతిరేకంగా, వెట్టి చాకిరి విముక్తికి, స్వాభిమాన జీవితానికి ప్రతీకగా, గడీల పాలన స్థానంలో ప్రజా పాలన స్థాపించేందుకు సాగిన సంగ్రామం. అప్పటి నల్లగొండ, వరంగల్ జిల్లాల్లోని దేశ్ ముఖ్ లలో విసునూరు రాంచంద్రారెడ్డి ఒకరు. అతనికొక్కడికే జనగామ తాలూకాలో 40 గ్రామాల్లో సుమారు 40 వేల ఎకరాల భూమి ఉండేది. రాంచంద్రారెడ్డి సమీప గ్రామం పాలకుర్తిలో సామాన్యులు తలెత్తుకు తిరగాలంటే వణుకు. అంతటి నరరూప రాక్షసుడతడు. అలాంటి దొరపై తిరుగుబాటు చేసిన వీర వనిత ఐలమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. వెట్టిని ఎదిరించిన ధీరురాలు ఐలమ్మ. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచి దొరల రాజ్యాన్ని కూల్చడంలో కీలకపాత్ర పోషించారు. తను చాకిరి చేస్తూనే ఊర్లో అడుక్కొచ్చిన బువ్వ అప్పటి కమ్యూనిస్టు 
నాయకులకు పెట్టి నిత్య నిర్బంధంలో కమ్యూనిస్టులకు ఆశ్రయం కల్పించడమే గాకుండా తాను ఉద్యమంలో పాల్గొన్నది.

దొర గూండాలను ఎదిరించి..

ఐలమ్మ తనకున్న రెండెకరాల భూమిలో వ్యవసాయం చేస్తే ఆరుగురు సంతానం గల తన కుటుంబం గడవడం కష్టమనుకుంది. ఆ పక్కనే కొండలరావు దొర భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసింది. వెట్టి చాకిరి పక్కకు బెట్టి వ్యవసాయం చేయడమే గాకుండా ఆనాటి సాయుధ పోరాటంలో భాగమవుతున్న ఐలమ్మను దొర ఎన్నో విధాలుగా అణచివేయాలని చూశాడు. ఐలమ్మ పండించిన పంటను బలవంతంగా తీసుకెళ్లాలనుకున్న విసునూరు దొర లక్ష్యం నెరవేరలేదు. పంటను ఎత్తుకెళ్లడానికి వచ్చిన దొర గూండాలను ఐలమ్మ ఎదురించింది. ఆమె సాహసం, తెగువ వీర తెలంగాణ రైతాంగ విప్లవోద్యమానికి ఎంతో బలమిచ్చింది. ఐలమ్మ తిరుగుబాటును గమనించిన ఆనాటి కమ్యూనిస్టు నాయకులు ఆరుట్ల రామచంద్రారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, రావి నారాయణరెడ్డి, భీంరెడ్డి నర్సింహారెడ్డి, కట్కూరి రామచంద్రారెడ్డి, ధర్మభిక్షం, చకిలం యాదగిరి లాంటి వాళ్లు పాలకుర్తిని కేంద్రంగా చేసుకుని ఉద్యమాన్ని కొనసాగించారు. ఐలమ్మ దంపతుల నాయకత్వంలో ఏర్పాటు చేసిన గుతుపల సంఘాన్ని అణచివేయాలని చూసిన గూండాలను, పోలీసులను తిప్పికొట్టారు. భర్తను, కొడుకులను, జైల్లో నిర్బంధించినా ఐలమ్మ పోరాటంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ఉద్యమంలో ఐలమ్మ కుమారులు సోమయ్య, లచ్చయ్య, భర్త నర్సయ్య కార్యకర్తల స్థాయి నుంచి దళ కమాండర్లుగా ఎదిగారు. ఐలమ్మ కుమార్తె సోమ నర్సమ్మ ఉద్యమంలో కొరియర్ గా పని చేసింది. రెండు సార్లు పాలకుర్తిని సందర్శించిన కమ్యూనిస్టు దిగ్గజం పుచ్చలపల్లి సుందరయ్య ఐలమ్మ ఇంటిపై అరుణ పతాకం ఎగురవేశారు. " తెలంగాణ రైతు బిడ్డ జరిపిన తొలిదశ పోరాటానికి ఆమె చిహ్నం" అని ఐలమ్మ గురించి సుందరయ్య అభివర్ణించారు. ఊరందరినీ ఏకం చేసి తిరగబడేలా చేస్తున్న ఐలమ్మను విసునూరు దొర పిలిచి నిలదీశాడు. కాలుస్తానని తుపాకి పెట్టి మరీ బెదిరించాడు. తనను కాల్చినా ఏమీ కాదని తనకు రెండు ఎకరాల భూముందని, ఐదుగురు కొడుకులున్నారని తెలిపింది. కానీ నీకు ఒక్కడే కొడుకు.. వేల ఎకరాల భూమి ఉందని, ఇంకా ఇతరుల భూమి ఎందుకు గుంజుకుంటున్నావని ఎదిరించి మాట్లాడింది. నన్ను చంపితే జనం తిరగబడతారని, భూములు పంచి గడీని కూలుస్తారని హెచ్చరించింది. ఐలమ్మ మాటలు నిజమయ్యాయి. దొర అధికారం పోవడమే కాకుండా గడీల పాలన అంతమైంది. దొర కొడుకు దిక్కులేని చావు చచ్చాడు. ఆ తర్వాత దొర కూడా అంతమయ్యాడు.

ఐలమ్మ పోరాట స్ఫూర్తితో..

భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఆనాడు జరిగిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని నేడు విద్య, వైద్యం కోసం, ఉపాధి, ఉద్యోగాల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అప్పట్లో పాలకుల దోపిడీ ప్రత్యక్షంగా ఉండేది.  ప్రపంచీకరణ, ప్రైవేటీకరణతో వ్యవస్థీకృతమైన నేటి పాలకుల దోపిడీని పసిగట్టి నూతన ఉద్యమాలు నిర్మించాల్సిన సందర్భమొచ్చింది. ప్రలోభ రాజకీయాల పట్ల ప్రజలను చైతన్యం చేసే ఉద్యమాలు రావాలి. పాలితులుగా ఉన్నంతకాలం దోపిడీ పీడనల నుంచి విముక్తి సాధ్యం కాదనే వాస్తవాన్ని ప్రజలకు బోధించి పీడిత వర్గాల ప్రజలను పాలకులుగా మార్చే పోరాటం చేయాలి. ఆనాడు నిజాంను దించిన ఐలమ్మ లాంటి వాళ్ల పోరాట స్ఫూర్తితో నేడు దొర పాలనకు స్వస్తి పలికే ఉద్యమాలకు ప్రజలను సిద్ధం చేయాలి. వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామం ఓరుగంటి మల్లమ్మ సాయిలు దంపతులకు 1919లో సద్దుల బతుకమ్మ నాడు జన్మించి, 1985 సెప్టెంబర్ 10 న తుదిశ్వాస వదిలిన ఐలమ్మ మహిళా లోకానికే గాకుండా నేటి తరం ఉద్యమాలకు స్ఫూర్తి, ధైర్యానికి ప్రతీక, సాయుధ పోరాటంలో వేగుచుక్క. ఐలమ్మ పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని దోపిడీ పాలనను అంతం చేసేందుకు ఉద్యమం నిర్మించడమే ఐలమ్మకు మనం అర్పించే నిజమైన నివాళి. 

గొర్రెలు, బర్రెలిచ్చి... వెట్టిని ఆధునికీకరిస్తున్నరు

ఐలమ్మ ఉద్యమ కాలంలో ఆదివాసీ ప్రాంతంలో కొమురం భీం, జనగామ ప్రాంతంలో దొడ్డి కొమురయ్య లాంటి వాళ్ల వీరోచిత పోరాటాలతో ప్రభుత్వాలు మారాయి. పాలకులు మారారు. కానీ ప్రజల జీవన స్థితిగతులేమీ మెరుగుపడకపోగా మరింత బానిసత్వంలోకి వెళ్లాయి. సాయుధ పోరాటంతో గ్రామాలు విడిచి వెళ్లిన దొరలు, దేశ్ ముఖ్ లు పోలీసు యాక్షన్ తర్వాత మళ్లీ గ్రామాలకు వచ్చి పెత్తనం చెలాయిస్తూ.. దోపిడీ, అణచివేత కొనసాగించారు. వృత్తి కులాల వారు వృత్తులు కోల్పోయి అవమానం, ఆకలి, ఆత్మహత్యలు, అనారోగ్యంతో మరణిస్తున్నారు. నక్సలైట్లుగా మారి తిరుగుబాటు చేస్తున్నారు. కింది కులాలను, ఉత్పత్తి కులాలను ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నిర్మాణంలో భాగస్వాములను చేయాల్సిన పాలకులు వారిని ఓటు బ్యాంకులుగా మాత్రమే వాడుకుంటున్నారు. పాలకులు ఊదరగొడుతున్న బంగారు తెలంగాణ భ్రమల్లో బతికినంతకాలం మరింత బానిసత్వం పెరుగుతుందే తప్ప తిరుగుబాటు చేయలేరు. పాలనలో భాగస్వాములు కావాలనే భావన కింది, ఉత్పత్తి కులాలకు రావడం లేదు. పేదరికంతో ఎన్నో తరాలుగా అవస్థలు పడుతున్న ప్రజలు భ్రమల్లో నుంచి, పాలకుల ప్రలోభాల నుంచి బయటపడాలి. బర్రెలు, గొర్రెలు, ఇస్త్రీ పెట్టెలు, చేపలు ఇచ్చి17 కులాలను బీసీ జాబితాలో చేరుస్తూ.. పాలకులు వెట్టిని ఆధునికీకరిస్తుంటే ప్రజలు అదే భ్రమలో, బానిసత్వంలో బతికితే విముక్తి సాధ్యం కాదు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసే బానిస భావనను, గులాంగిరిని వీడి ఐలమ్మ స్ఫూర్తితో పాలకులుగా మారాల్సిన అవసరముంది. సంపద సృష్టిస్తున్న వాళ్లు, ఉత్పత్తి చేస్తున్న వాళ్లు రాజ్యమేలాలి.

- సాయిని నరేందర్, సోషల్​ అనలిటిస్ట్​