చాకలి ఐలమ్మ మనుమడు రామచంద్రం మృతి

చాకలి ఐలమ్మ మనుమడు రామచంద్రం మృతి
  • మహబూబాబాద్ జిల్లా పాలకుర్తిలో ముగిసిన అంత్యక్రియలు

పాలకుర్తి, వెలుగు: తెలంగాణ రైతాంగ సాయుధ  పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ (చాకలి ఐలమ్మ) మనుమడు చిట్యాల రామచంద్రం(75) గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఐలమ్మ ఐదుగురు కొడుకుల్లో పెద్ద కొడుకు సోమయ్య మూడో సంతానంగా రామచంద్రం జన్మించారు. నానమ్మ పోరాట వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న ఆయన1975లో సీపీఐ చేరి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం సీపీఎంలో చేరారు. 1981లో పాలకుర్తి సర్పంచ్​గా ఎన్నికై.. 2001 వరకు  కొనసాగారు. రైతులు, కూలీలు, కార్మికుల కోసం పోరాటాలు చేసి  జైలుకు వెళ్లారు.  

ప్రత్యేక తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో ఆయన కీలకంగా పనిచేశారు. పార్టీ విశాలాంధ్ర నినాదాన్ని కూడా వ్యతిరేకించారు. రామచంద్రం మరణం పట్ల పలువురు నేతలు సంతాపం తెలుపుతూ ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, కాంగ్రెస్​ఇన్ చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, సీనియర్​జర్నలిస్ట్​పాశం యాదగిరి, సీపీఎం, ప్రజా సంఘాల నేతలు నివాళులు అర్పించారు. శుక్రవారం ఆయన అంత్యక్రియలను కుటుంబసభ్యులు పూర్తి చేశారు.