మళ్లీ కుంగిన చాక్నవాడి నాలా .. మూడేండ్లలో ఇది ఆరోసారి

మళ్లీ కుంగిన చాక్నవాడి నాలా .. మూడేండ్లలో ఇది ఆరోసారి
  • నాలా మొత్తం పునఃనిర్మించాలని స్థానికుల డిమాండ్

బషీర్​బాగ్, వెలుగు: గోషామహల్​లో చాక్నవాడి నాలా మరోసారి కుప్పకూలింది. గత మూడేండ్లలో నాలా పైకప్పు కుంగడం ఇది ఆరోసారి. ఒకవైపు నాలా పైకప్పు నిర్మాణం పనులు కొనసాగుతున్న సమయంలోనే రోడ్డు పొడవునా ఉన్న నాలా పైకప్పులు ఒక్కొక్కటిగా కూలిపోతుండటం గమనార్హం. శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో నాలా పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. దారుస్సలాం నుంచి గోషామహల్ వైపు వెళ్లే ప్రధాన రోడ్డుపై చాక్నవాడి మలుపు వద్ద ఇప్పటికే నాలా పైకప్పు నిర్మాణం పనులు జరుగుతున్నాయి. నిర్మాణం పనుల్లో పాల్గొన్న కార్మికులు సాయంత్రం ఆరున్నర గంటలకు పని ముగించుకొని వెళ్లిపోగా.. అర గంట వ్యవధిలోనే ప్రధాన రోడ్డు వైపు ఉన్న నాలా పైకప్పు కుప్పకూలింది. 

ఈ ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. విషయం తెలియగానే గోషామహల్ కార్పొరేటర్ లాల్ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకొని జీహెచ్ఎంసీ కమిషనర్ , మేయర్ ఇతర అధికారులతో ఫోన్​లో మాట్లాడారు. చాక్నవాడి నాలా నిజాం కాలంలో నిర్మించినందున తరచుగా కుప్పకూలుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దారుస్సలాం కూడలి నుంచి గోషామహల్ చాక్నవాడి మీదుగా పోలీసు స్టేడియం తోప్ ఖానా మసీదు వరకు నాలా మొత్తం పునఃనిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు స్థానిక వ్యాపారులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. నాలాను పూర్తి స్థాయిలో నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేశారు.