రాముని గుట్ట మీద చక్రవ్యూహం.. 4 వేల సంవత్సరాల క్రితం నాటిదా..?

చక్రవ్యూహం... ఈ పదాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా..? పోనీ దాని అర్థం ఏంటో తెలుసా..? చాలామందికి చక్రవ్యూహం అంటే ఏంటో తెలియదు. చివరకు పద్మవ్యూహం అంటే కూడా నేటి తరానికి తెలియదు. దాని గురించి తెలుసుకోవాలంటే తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు వెళ్లాల్సిందే.. చక్రవ్యూహం విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా 4 వేల సంవత్సరాల క్రితం నాటి చక్రవ్యూహాన్ని(లాబ్రింత్‌) కనుగొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలోని మాచన్‌పల్లి రామునిగుట్ట మీద రాముడు, శివాలయాలకు తూర్పున ఉన్న నీటి చెరువు ఒడ్డున గీసిన చిట్టెలుకను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది.

కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు మహమ్మద్‌ నసీర్‌, అన్వర్‌, అహోబిలం కరుణాకర్‌, కొరవి గోపాల్‌లు గుర్తించారు. విషయం తెలియగానే బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌, కో కన్వీనర్లు బీవీ భద్రగిరీష్‌, జమ్మనపల్లి రమేష్‌లు ఆ ప్రదేశాన్ని సందర్శించారు. 

ఈ లాబ్రింత్‌లను 17వ శతాబ్దం నుంచి తాంత్రిక గ్రంథాల్లో చక్రవ్యూహాలుగా పరిగణించారు. ఇది చక్రవ్యూహం లేదా పద్మవ్యూహంగా పిలిచే పౌరాణిక యుద్దవ్యూహాన్ని పోలినట్లుగా ఉంది. 

రాతిపై చెక్కిన అడుగు వైశాల్యమున్న చక్రవ్యూహం బొమ్మలో ఒకే ప్రవేశ ద్వారం ఉంది. లాబ్రింత్‌ చెక్కిన పరిసరాల్లో రాతి బొద్దులు, కొత్త రాతియుగపు నూరుడు గుంటలు ఉన్నాయి. మన దేశంలో కొంకణతీరం ఉస్థలిమోల్‌, మహారాష్ట్ర గోల్కామాన్‌లోని పెద్ద లాబ్రింత్‌లకు తీసిపోని విధంగా కచ్చితమైన గీతలతో ఇది ఉందని బృందం సభ్యులు తెలిపారు.

ఇక్కడి గుట్టలు, రాళ్లపై ప్రాచీనుల నాగరికతకు సంబంధించిన ఏదో ఒకటి వెలుగులోకి వస్తూనే ఉంటుందని చెప్పారు. ఇటీవల తెలంగాణలోనే తొలిసారిగా మూడుచింతలపల్లిలో సర్క్యులర్ జియోగ్లిఫ్‌ను గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు.