మునుగోడు బరిలో తప్పనిసరిగా ఉంటా :  చలమల్ల కృష్ణారెడ్డి

మునుగోడు ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై చలమల్ల కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి టార్గెట్ గా ఘాటు వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దామెరలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చలమల్ల కృష్ణారెడ్డి మాట్లాడారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ మాదిరిగా పట్టి పీడిస్తున్నారని చలమల్ల కృష్ణారెడ్డి ఆరోపించారు. మునుగోడులో పోటీ చేసే విషయంపై తమ కార్యకర్తలతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు. అయితే.. ఎన్నిక బరిలో మాత్రం తప్పనిసరిగా ఉంటానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో లీడర్ గా కొనసాగాలంటే మూడు లక్షణాలు ఉండాలన్నారు. లీడర్లకు సలాం కొట్టాలని, గాంధీభవన్ లో ప్రెస్ మీట్లు పెట్టాలని, ఢిల్లీలో పైరవీలు చేయాలని చెప్పారు.

ఫస్ట్ లిస్టులో ఉన్న తన పేరును కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుట్రపూరితంగా మార్పించి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరును చేర్చారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం వచ్చిందని అనుకున్నాం గానీ.. ముసలోళ్ల రాజ్యమే ఇంకా నడుస్తోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు తమ కుటుంబ సభ్యుల సీట్ల కోసం మిగతా లీడర్లను బలి చేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అందరి లీడర్ల దగ్గర డబ్బులు వసూళ్లు చేస్తూ.. వారిని జలగల మాదిరిగా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పీల్చుకుతింటున్నారని ఆరోపించారు. సేవ్ మునుగోడు నినాదంతో ప్రజల్లోకి వెళ్తానని చెప్పారు.