పరకాల, వెలుగు : పదేళ్లలో అభివృద్ధి చేసిన తర్వాతే ప్రజల ముందుకొచ్చా.. దిక్కూమొక్కూ లేని వాళ్లు పరకాలలో అడుగుపెట్టి ఆగం చేద్దామని చూస్తున్రు.. కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తది’ అని బీఆర్‌ఎస్ పరకాల క్యాండిడేట్ చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా నడికుడ మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ ఈ ఐదు రోజులు తన కోసం పనిచేస్తే.. వచ్చే ఐదేళ్లు ప్రజల కోసం తాను పనిచేస్తానని చెప్పారు.
తెలంగాణ వచ్చిన తర్వాతే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిందని, రైతులు బాగుంటే కాంగ్రెస్ కు కండ్లు మండుతున్నాయన్నారు. రైతుబీమాతో ధీమా కల్పించింది సీఎంకేసీఆరే అన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణను కాంగ్రెస్ వాళ్ల చేతిలో పెట్టి ఆగం చేసుకోవద్దని సూచించారు. కాంగ్రెస్ , బీజేపీకి ఓటు వేస్తే మన జీవితాలు ఢిల్లీ లీడర్ల చేతుల్లో ఉంటాయన్నారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం ముందుకుసాగాలంటే బీఆర్ ఎస్ ప్రభుత్వమే కొనసాగాలన్నారు.