ఏప్రిల్​ 2 నుంచి రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర : చల్లా వంశీచంద్ రెడ్డి

ఏప్రిల్​ 2 నుంచి రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర : చల్లా వంశీచంద్ రెడ్డి

పాలమూరు, వెలుగు: ఏఐసీసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపడుతున్నట్లు సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్​ 2 నుంచి రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు. మహబూబ్​నగర్​ కాంగ్రెస్​ ఆఫీసులో ఆదివారం మీడియాతో మాట్లాడారు. జై బావు, జై భీమ్, జై సంవిదాన్ అభియాన్  రాష్ట్ర స్థాయి సన్నాహక సమావేశాలు పూర్తయ్యాయని, జిల్లా సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయని, ఈ నెల 28 లోపు మండల స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలను నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందని చెప్పారు. మహాత్మా గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికై వందేళ్లు పూర్తయిందని, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏండ్లు అవుతోందన్నారు. 

అంబేద్కర్​ను పార్లమెంట్​లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అవమానించారని, ఆయన రాజీనామా చేయాలని కాంగ్రెస్​తోపాటు దేశ ప్రజలంతా డిమాండ్  చేసినా పట్టించుకోలేదన్నారు. మహాత్మా గాంధీ. అంబేద్కర్ సిద్ధాంతాలు, రాజ్యాంగ విలువలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. ఏడాది పాటు ప్రతి గ్రామాన్ని సందర్శించేలా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు.

 ప్రతి రోజు ఉదయం రెండు గ్రామాలు, సాయంత్రం రెండు గ్రామాలు పాదయాత్ర చేపట్టి మహాత్మాగాంధీ, అంబేడ్కర్  సిద్ధాంతాలు, రాజ్యాంగ విలువలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్​ రెడ్డి, జి.మధుసూదన్​ రెడ్డి, మైనారిటీ ఫైనాన్స్​ కార్పొరేషన్​ చైర్మన్​ ఒబేదుల్లా కొత్వాల్, జై బాపు, జై భీమ్, జై సంవిదాన్  రాష్ట్ర కో ఆర్డినేటర్  సతీశ్, ఏఎంసీ చైర్​పర్సన్  బెక్కరి అనిత, మాజీ మున్సిపల్ చైర్మన్  ఆనంద్ కుమార్ గౌడ్, మీడియా సెల్  కన్వీనర్  సీజే బెనహార్  పాల్గొన్నారు.