- మహబూబ్‌నగర్ పార్లమెంట్ బరిలో చల్లా వంశీచంద్ రెడ్డి, డీకే అరుణ, మన్నె శ్రీనివాస్ రెడ్డి
- పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్, బీజేపీలకు పెరిగిన ఓటింగ్ పర్సంటేజీ
- ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం
మహబూబ్‌నగర్, వెలుగు : మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి మళ్లీ పాత కాపులే పోటీకి రెడీ అయ్యారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి చల్లా వంశీచంద్ రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ, బీఆర్ఎస్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి తలపడగా శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు. ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో ఆయా పార్టీల హైకమాండ్లు మళ్లీ వీరికే పోటీ చేసే అవకాశాలు కల్పించాయి. అయితే రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి పాలమూరు ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తిగా మారింది.
అన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..
2019 లోక్‌సభ ఎన్నికల్లో వంశీచంద్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగగా, ఈసారి కూడా అతడినే మళ్లీ క్యాండిడేట్‌గా ప్రకటించింది. గత ఎన్నికల్లో ఈ పార్లమెంట్ పరిధిలో 9,84,767 ఓట్లు పోల్ కాగా, 65.39 శాతం పోలింగ్ నమోదైంది.ఇందులో వంశీచంద్ రెడ్డికి 19.67 శాతంతో 1,93,631 ఓట్లు పడ్డాయి. అయితే, అప్పట్లో ఈ పార్లమెంట్ పరిధిలోని మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, షాద్‌నగర్, కొడంగల్, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండడంతో కాంగ్రెస్‌కు ఓటింగ్ పర్సంటేజీ తగ్గింది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఏడు అసెంబ్లీ స్థానాలు హస్తగతమయ్యాయి. దీనికితోడు 2018లో పోల్చితే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటింగ్ శాతం పెరిగింది. 2018 ఎన్నికల్లో నారాయణపేట అసెంబ్లీలో కాంగ్రెస్‌కు కేవలం 3.92 శాతం ఓట్లు పోల్ కాగా, ఈ సారి రికార్డు స్థాయిలో 46.31 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. మహబూబ్‌నగర్‌లో 48.08 శాతం ఓట్లు పడ్డాయి. జడ్చర్లలో 30.85 శాతం నుంచి 50.03 శాతానికి
దేవరకద్రలో 34.91 నుంచి 45.31 శాతానికి పెరిగింది. అలాగే మక్తల్‌లో 39.88 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. ఈ లెక్కల ప్రకారం పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడం వంశీచంద్‌రెడ్డికి కలిసొచ్చే అంశంగా పేర్కొంటున్నారు.
డీకే అరుణను ఢీ కొట్టడం సవాలే!
2019 ఎన్నికల్లో డీకే అరుణ బీజేపీ క్యాండిడేట్‌గా పోటీ చేసి సెకండ్ ప్లేస్‌లో నిలిచారు. ఆమెకు 33.88 శాతంతో 3,33,573 పడ్డాయి. ఈ ఎన్నికల్లో కూడా ఆమెనే ఆ పార్టీ క్యాండిడేట్‌గా బరిలో దించింది. అయితే ఈ ఎన్నికలు ఆమెకు కలిసొస్తాయని అంటున్నారు. ఈ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం పెరగడమే కారణమని అంటున్నారు.
మహబూబ్‌నగర్ అసెంబ్లీలో 2018 ఎన్నికల్లో ఈ పార్టీకి 3,72 శాతం ఓట్లు పోల్ అవగా, ఈసారి 10.97 శాతానికి పెరిగింది. జడ్చర్లలో 2.24 శాతం నుంచి 4.05 శాతానికి, దేవకరద్రలో 2.97 శాతం నుంచి 6.74 శాతానికి మక్తల్‌లో 12.24 శాతం నుంచి 24.01 శాతానికి ఓట్ల పర్సంటేజీ పెరిగింది. పెరిగిన ఓటింగ్ శాతం, ఈ ఎన్నికల్లో మోదీ చరిష్మా పని చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో డీకే అరుణను ఢీ కొట్టడం ప్రధాన పార్టీలకు సవాల్‌గా మారనుందని అంటున్నారు.
సొంత ఇమేజ్‌పైనే ఆశలు..
గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మన్నె శ్రీనివాస్ రెడ్డి మహబూబ్‌నగర్ ఎంపీగా గెలిచారు. ఆయనకు 41.78 శాతంతో 4,11,402 ఓట్లు పోలయ్యాయి. 77,829 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఆయన సిట్టింగ్ ఎంపీగా బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగనున్నారు. అయితే అప్పట్లో ఈ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండడం, తెలంగాణ సెంటిమెంట్‌తో గెలుపు ఈజీ అయ్యింది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. దీనికితోడు ఈ పార్లమెంట్లో పార్టీ ఒక్క అసెంబ్లీని కూడా దక్కించుకోలేదు.
గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటింగ్ పర్సంటేజీ కూడా తగ్గిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణపేటలో 42.25 శాతం నుంచి 40.97 శాతానికి, మహబూబ్‌నగర్‌లో 54.16 శాతం నుంచి 37.72 శాతానికి, జడ్చర్లలో 58.95 శాతం నుంచి 41.9 శాతానికి, దేవరకద్రలో 55.12 శాతం నుంచి 44.6 శాతానికి, మక్తల్‌లో 47.77 శాతం నుంచి 30.55 శాతానికి ఓట్ల పర్సంటేజీ పడిపోయింది. దీంతో సిట్టింగ్ ఎంపీ తన సొంత ఇమేజీపైనే ఆధారపడాల్సి వస్తుందని అంటున్నారు.