దన్వాడ, వెలుగు: ప్రజలు పడుతున్న ఇబ్బందులకు బీజేపీ, బీఆర్ఎస్లే కారణమని పాలమూరు కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. సోమవారం ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డితో కలిసి మండలంలోని హనుమాన్ పల్లి, కొండాపూర్, కిష్టాపూర్, రాంకిష్టయ్య పల్లి గ్రామాల్లో పర్యటించారు. ఆంజనేయస్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించడంతో పాటు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ప్రాంతం వలసతో అల్లాడుతున్న సమయంలో జిల్లా పేరు చెప్పి రాజకీయ పబ్బం గడిపుకొని గద్దెనెక్కిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మాయమాటలు చెబుతూ మళ్లీ ఓట్లడగడం సిగ్గుచేటన్నారు. ఆనాడు పాలమూరు జిల్లా సమగ్రాభివృద్ధి కోసం వైఎస్సార్ జలయజ్ఞం పేరుతో కేఎల్ఐ, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను నిర్మించి సాగునీరు అందించారని గుర్తు చేశారు. పదేండ్ల బీజేపీ, బీఆర్ఎస్ పాలనలో పాలమూరు జిల్లా కరువుతో అల్లాడిపోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులకే నిధులు పెంచి దోచుకున్నారే తప్ప, ఏ ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు అందించలేదని ఆరోపించారు.
దేశంలో, రాష్ట్రంలో దోపిడీ దొంగల ముఠాగా ఏర్పడి ప్రజల సంపదను దండుకుని అదానీ, అంబానీలకు మోదీ అప్పజెప్తుంటే, కేసీఆర్ ఫ్యామిలీ ప్రభుత్వ పథకాల పేరుతో ఆర్థిక దోపిడీకి పాల్పడ్డారన్నారు. బీజేపీ అగ్ర నేతలను ఎందుకు నిలదీయలేదో డీకే అరుణ ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఎంపీగా తనను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని, సాగునీటిని అందించేందుకు నిధులు కేటాయించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలచి ఎంపీగా వంశీచంద్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.