- తండాల్లో ఇప్పటికీ ఇందిరమ్మ ఇండ్లే
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి
పాలమూరు, వెలుగు: దేశంలో గిరిజనులు, ఆదివాసీల సంక్షేమానికి పాటుపడింది కాంగ్రెస్ ప్రభుత్వామేనని ఆ పార్టీ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ లో ఆదివారం జిల్లా కాంగ్రెస్ ఆదివాసీ విభాగం అధ్యక్షుడు లింగంనాయక్ ఆధ్వర్యంలో బంజారా, ఆదివాసీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా వంశీచంద్పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమాన్ని పూర్తి విస్మరించిందన్నారు. తాను తండాల్లో పర్యటించినప్పుడు ఇప్పటికీ ఇందిరమ్మ ఇండ్లే కనిపిస్తున్నాయన్నారు. పదేళ్లలో బీజేపీ చేసిన పనులేంటని ప్రశ్నించారు. అభివృద్ధి చెప్పకుండా దేవుళ్ల పేరుమీద ఓట్లు అడుగుతోందని విమర్శించారు. కార్యక్రమంలో టీపీసీసీ ఆదివాసీ విభాగం చైర్మన్ బెల్లయ్య నాయక్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ, ఫైనాన్స్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ లు ఒబేదుల్లా కొత్వాల్, శ్రీకాంత్ గౌడ్, నాయకులు రఘునాయక్, శేఖర్ నాయక్, తులసిరాం, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ వస్తే ఉపాధి కూలీ రూ.400
బాలానగర్: ప్రభుత్వ రంగాలను ప్రైవేటు పరం చేస్తూ యువత జీవితాలతో ప్రధాని మోదీ ఆడుకుంటున్నారని వంశీచంద్ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని మోతి ఘణపురం, మేడిగడ్డ, కుర్వగడ్డ, గంగాధర్ పల్లి, సురారం, ఈదమ్మ గడ్డ తండాలతో పాటు రాజాపూర్ మండల కేంద్రంలో ఆయన ప్రచారం నిర్వహించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన బీజేపీకి కేంద్రంలో అధికారంలో కొనసాగే అర్హత లేదన్నారు. పాలమూరు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచి తనను ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
అనంతరం బాలానగర్లో మహిళల ఆత్మీయ సమ్మేళనంలో వంశీచంద్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉపాధి హామీ పథకం ద్వారా 150 రోజులు పని కల్పించి రోజుకి రూ.400 ఇస్తామన్నారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శవసేనారెడ్డి, బాలానగర్, రాజాపూర్ మండల అధ్యక్షులు శంకర్ నాయక్, కృష్ణయ్య యాదవ్, నాయకులు నందిశ్వర్, ప్రదీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.