కేంద్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే..పాలమూరుకు జాతీయ హోదా : చల్లా వంశీచంద్​రెడ్డి

కేంద్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే..పాలమూరుకు జాతీయ హోదా : చల్లా వంశీచంద్​రెడ్డి
  •     నా ‘స్థానికత’పై కొందరు తెలివి లేకుండా మాట్లాడుతున్నారు: చల్లా వంశీచంద్​రెడ్డి
  •     నేను నాన్​లోకల్ అయితే.. డీకే అరుణ, కేసీఆర్​ లోకలా?
  •     కాంగ్రెస్​లో చిన్న పదవి నుంచి పెద్ద పదవుల దాకా చేపట్టా
  •     డీకే అరుణకు అవకాశం వచ్చినా మహబూబ్​నగర్​ను పట్టించుకోలే 
  •     'పాలమూరు' స్కీం గురించి కేసీఆర్​ చెప్పేవన్నీ అబద్ధాలే 
  •     పదేండ్లు బీజేపీ, బీఆర్ఎస్​ రూలింగ్ లో ఉన్నా కాలేజీలు కట్టియ్యలే
  •     లోక్​సభ ఎన్నికల్లో రెండు లక్షల ఓట్ల భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా
  •     ‘వెలుగు’తో మహబూబ్​నగర్ పార్లమెంట్​ కాంగ్రెస్​ క్యాండిడేట్ ఇంటర్వ్యూ 


మహబూబ్​నగర్, వెలుగు : కేంద్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి  రాగానే 'పాలమూరు– రంగారెడ్డి’  ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు, మహబూబ్​నగర్​పార్లమెంట్​ కాంగ్రెస్​ క్యాండిడేట్​ చల్లా వంశీచంద్​రెడ్డి అన్నారు. కేంద్రంలో పదేండ్లు బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నా , ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణ 'పాలమూరు' ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు సాధించలేకపోయారో చెప్పాలని డిమాండ్​ చేశారు. పాలమూరు ప్రాజెక్టుపై బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​చెప్పినవన్నీ అబద్ధాలేనని, ఆయన చెప్తున్నట్టు 80 శాతం పనులు ఎక్కడా పూర్తికాలేదన్నారు. 

లోక్​సభ ఎన్నికల్లో తాను రెండు లక్షల ఓట్ల భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీగా గెలిచిన వెంటనే ఫస్ట్​ప్రయారిటీ కింద ప్రాజెక్టులు పూర్తిచేసి, పాలమూరు వలసలకు అడ్డుకట్ట వేస్తానని ప్రకటించారు. మంగళవారం ఆయన 'వెలుగు'కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన రాజకీయ ప్రస్థానం మొదలుకొని పలు విషయాలపై వంశీచంద్​మాట్లాడారు. 

ఎంబీబీఎస్​ చదువుతూ రాజకీయాల్లోకి.. 

గాంధీ మెడికల్​కాలేజ్​లో ఎంబీబీఎస్​ చదువుతున్నప్పుడు నా రాజకీయ ప్రస్థానం మొదలైంది. జూనియర్​డాక్టర్ట్​గా స్టూడెంట్​ఉద్యమాల్లో యాక్టివ్​గా ఉండేవాడిని. ఆ సమయంలోనే కాంగ్రెస్​కు సంబంధించిన ఎన్​ఎస్​యూఐ విభాగంలో చేరిన. గాంధీలో ఎన్ఎస్​యూఐ యూనిట్​ను స్థాపించి ప్రెసిడెంట్​గా ఎన్నికైన. తర్వాత రాష్ట్రంలోని వర్సిటీల ఎన్ఎస్​యూఐ ఇన్​చార్జిగా వ్యవహరించా. అక్కడి నుంచి స్టేట్​ జనరల్​ సెక్రటరీగా, 2006లో ఎన్ఎస్​యూఐ స్టేట్​ ప్రెసిడెంట్, 2012లో యూత్​ కాంగ్రెస్​ ప్రెసిడెంట్​అయ్యా. 2014లో కల్వకుర్తి అసెంబ్లీ నుంచి కాంగ్రెస్​ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందా. 2018లో ఏఐసీసీ సెక్రటరీగా, మహారాష్ట్ర ఇన్​చార్జిగా వ్యవహరించా. ప్రస్తుతం సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా కొనసాగుతున్నా. 

నేను నాన్​లోకల్​ అయితే కేసీఆర్​, డీకే అరుణ లోకలా?

స్థానికత అంటే ఏంటి? బీఆర్ఎస్​ వాళ్లు తెలివి లేకుండా మాట్లాడుతున్నరు. కేసీఆర్​2009లో మహబూబ్​నగర్ లోక్​సభ నుంచి పోటీ చేశారు. అప్పుడాయన లోకల్ ఎలా అవుతారు? డీకే అరుణది ఏ ఊరు? గద్వాలలో పోటీ చేస్తే అక్కడే లోకల్​ అంటారు. పాలమూరులో పోటీ చేస్తే ఇక్కడా లోకల్​ అంటారు. ఇది డబుల్​యాక్షన్​ గేమ్ ఆ? పాన్​గల్​ జడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు ఏమైంది?.. వంశీచంద్​ మీద ఒక్క విమర్శ చేయలేరు. 

నా వ్యక్తిత్వం, పనితనం, చిత్తశుద్ధి, పార్టీ పట్ల నాకున్న అంకితభావం, కమిట్​మెంట్​ను విమర్శించలేరు. నాది కల్వకుర్తి దగ్గర అప్పారెడ్డిపల్లి. యస్​.. నేను పాలమూరు బిడ్డనే. అక్కడి పార్లమెంట్​ నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్​ అయ్యింది. అందుకే నా పార్టీ పాలమూరు నుంచి పోటీకి అవకాశం ఇచ్చింది. నా ఓటు ఇక్కడే ఉంది. నేను నాన్​ లోకల్​ ఎలా అవుతాను? వాళ్లకు ఏం మాట్లాడాలో తెలియక స్థానికత అంశాన్ని తీసుకొచ్చి కోతి చేతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు నాపై విమర్శలు చేస్తున్నరు.

డీకే అరుణకు పదవులే ముఖ్యం

డీకే అరుణకు అభివృద్ధి చేసే అవకాశం వచ్చినా, పాలమూరును పట్టించుకోలేదు. మంత్రిగా, ఎమ్మెల్యేగా పని చేశారు. కేంద్రంలో పదేండ్లు బీజేపీ ప్రభుత్వమే ఉంది. మరి 'పాలమూరు' ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు సాధించలేదు? పాలమూరుకు అదనంగా ఒక్క పైసా తీసుకురాలేదు. ఒక్క ప్రాజెక్టు మంజూరు చేయించలేదు. ఒక్క ఇన్​స్టిట్యూట్​​ ఏర్పాటు చేయలేదు. 

నారాయణపేటకు మంజూరైన సైనిక్​ స్కూల్ ఇతర ప్రాంతానికి తరలిస్తే ఆమె నోరు మెదపలేదు. తెలంగాణ రాష్ట్ర నీటి వాటాను తేల్చాలని కేంద్రంతో మాట్లాడలేదు. కర్నాటకలో అప్పర్​ భద్రకు జాతీయ హోదా ఇస్తే మనకు నీళ్లు రావట్లేదని, దాని గురించి కేంద్రంతో మాట్లాడలేదు. డీకే అరుణకు కేవలం పదవి కావాలి. మంత్రి, ఎంపీ కావాలి, మహారాణిలా ఉండాలనుకుంటోంది. ఆమె తమ్ముడు, అల్లుడు ఎమ్మెల్యేలను చేయాలనుకుంటోంది. ఇన్నేండ్లు ప్రజలకు ఏం చేయని వాళ్లు ఇప్పుడేం చేస్తారు?

ముదిరాజ్​ల నియోజకవర్గం పాలమూరు

ముదిరాజ్​లు ఎక్కువగా ఉండే నియోజకవర్గం పాలమూరు. రాష్ట్రంలో ఈ సామాజిక వర్గాన్ని బీసీ ‘-డీ’ నుంచి బీసీ- ‘ఏ’ లోకి మార్చాలని 2016  మార్చి 17న మొదటి సారి శాసన సభలో నేనే ప్రస్తావించిన. ఈ విషయంపై పూర్తి చిత్తశుద్ధితో ఉన్నా. వీరిని బీసీ- ‘ఏ’లోకి మార్చడమే నా ఫస్ట్​ ప్రయారిటి. అర్హులైన గొల్ల కుర్మలకు కేంద్ర స్కీమ్​లు వర్తింపజేస్తాం. షీప్​ బ్రీడ్​ సెంటర్లను ఓపెన్​ చేస్తాం. అవసరం ఉన్న వారికి గొర్లను అందజేస్తాం.

చదువుకోవడానికి కాలేజీలే లెవ్వు

పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్​, బీజేపీ పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి.  అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేశాయి. విద్యా సౌకర్యాలు మెరుగు పర్చలేదు. మండల కేంద్రాల్లో ఇంటర్ కాలేజీలు​, నియోజకవర్గాల్లో డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయలేదు. ధన్వాడ, దామరగిద్దలో ఇప్పటి వరకు ఇంటర్​ కాలేజీలు లేవు. మేం అధికారంలోకి రాగానే ఎడ్యుకేషన్​ అండ్​ హెల్త్​కు ప్రయారిటీ ఇస్తాం. ఇన్​స్టిట్యూట్స్​ ఏర్పాటు చేస్తాం. గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ సిస్టం, బీటీ రోడ్లు వేయిస్తాం.

పాలమూరును అద్భుతంగా డెవలప్​ చెయ్యొచ్చు

ఈ పార్లమెంట్ పరిధిలో​ మూడు నేషనల్​ హైవేలు ఉన్నాయి. పాలమూరును అద్భుతంగా డెవలప్​ చేయొచ్చు. షాద్​నగర్​ నుంచి కొత్తకోట వరకు ఇండస్ర్టియల్​ కారిడార్​ ఏర్పాటు చెయ్యొచ్చు. నారాయణపేటలో టెక్స్​టైల్​పార్క్​, మరికల్​లో కాటన్​ మార్కెట్​, మక్తల్లో​ స్కిల్​ డెవలప్​మెంట్​ సెంటర్ ఏర్పాటు చేస్తాం. పాలమూరును ఎడ్యుకేషన్​ హబ్, జడ్చర్లను ఇండస్ట్రియల్​ హబ్​, షాద్​నగర్​ ను లాజిస్టికల్ హబ్​గా తీర్చిదిద్దుతాం. 

కాంగ్రెస్​ పార్టీ గొప్పది

కాంగ్రెస్​ పార్టీ గొప్పది. రాష్ర్టంలో ప్రజా పాలన సాగిస్తోంది. అన్ని పార్టీల లీడర్లు ప్రజా పాలనలోకి రావాలని అనుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు అందించడంలో తాము కూడా భాగస్వామ్యం అవుతామని చాలా మంది ముందుకొస్తున్నారు. గ్రామీణ స్థాయిలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. అవి ఎప్పటికప్పుడు సద్దుమణుగుతున్నాయి.

రెండు లక్షల మెజార్టీతో గెలుస్తా

నాకు ప్రత్యర్థి ఎవరూ లేరు. ప్రజల్లో కాంగ్రెస్​ పట్ల స్పందన బాగుంది. సీఎం రేవంత్​ రెడ్డికి పాలమూరు ప్రజలు అండగా నిలువాలని చూస్తున్నరు. ఎక్కడికి వెళ్లినా సానుకూలంగా స్పందిస్తున్నరు.  రెండో స్థానానికే డీకే అరుణ, మన్నె శ్రీనివాస్​ రెడ్డి పోటీ పడుతున్నరు. నేను రెండు లక్షల భారీ మెజార్టీతో పాలమూరు ఎంపీగా గెలువబోతున్నా.

'పాలమూరు' పేరుతో  కేసీఆర్​ నిధులు మేసిండు

కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే. పాలమూరు 80 శాతం పూర్తయ్యిందంటే అర్థం 80 శాతం నిధులు బుక్కారని. 80 శాతం పనులు మాత్రం ఎక్కడా కాలేదు. ఈ ప్రాజెక్టు పేరుతో 80 శాతం నిధులు డ్రా చేసుకున్నరు. ఉద్దండాపూర్, కరివెన ప్రాజెక్టులు 30 శాతం కూడా పూర్తికాలే. లక్ష్మీదేవిపల్లికి ల్యాండ్ అక్విజేషన్​ కూడా పూర్తి చేయలే. అలాంటప్పుడు 80 శాతం పనులు ఎట్లయితై? జలయజ్ఞం కింద 2004లో అప్పటి సీఎం వైఎస్సార్ ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడానికి కోయిల్​సాగర్, నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి స్కీములను తెచ్చిండు. 

2014 నాటికి ఇవి దాదాపు పూర్తయ్యాయి. మిగిలిన పనులు చేయడానికి కేసీఆర్​కు మనసు రాలేదు. కాంగ్రెస్​కు పేరొస్తుందని ఈ స్కీములను పట్టించుకోలేదు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలుస్తుందని తెలిసి ప్రజలను మాయ చేసేందుకు 'పాలమూరు' స్కీమ్​కు డ్రై రన్​ చేసిండు. ఉమ్మడి జిల్లాకు వస్తున్న సాగునీరంతా కాంగ్రెస్​ ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులతోనే వస్తున్నయ్​.

సీఎం సహకారంతో వలసలు నివారిస్తాం

సీఎం రేవంత్​ రెడ్డి సహకారంతో పాలమూరు వలసల నివారణకు చర్యలు తీసుకుంటాం. ఇక్కడి ప్రతి ఎకరాకు సాగునీటిని అందిస్తాం. రెండేండ్లలో మక్తల్​-నారాయణపేట–-కొడంగల్ స్కీమ్​ను పూర్తి చేసి 1.30 లక్షల ఎకరాలకు నీళ్లిస్తాం. పెండింగ్​ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి, రన్నింగ్​లోకి తీసుకొస్తాం. నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో భారీ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.

పాలమూరు ప్రజల గొంతునవుతా 

ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తా. ఎంపీననే భావన రాకుండా ప్రతి ఓటరుకు ఆత్మీయుడిగా, కుటుంబ సభ్యుడిగా, ఇంటి మనిషిననే విశ్వాసం ప్రజలకు కలిగిస్తా. పాలమూరు ప్రజల గొంతును పార్లమెంట్​లో వినిపిస్తా. పాలమూరు ప్రజలు చిరకాలం గుర్తుంచుకునేలా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా.