మన విద్యావిధానం ఎంతో ప్రాచీనమైనది. క్రీస్తు పూర్వమే నలంద, తక్షశిల, విక్రమశీల విశ్వవిద్యాలయాలు ప్రపంచ స్థాయి విద్యా కేంద్రాలుగా విలసిల్లాయి. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో అనేక ఆటుపోట్లకు గురై ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొంది. అందుకు ఉదాహరణ దక్కన్ ప్రాంతాన్ని పాలించిన నిజాం నవాబు పాఠశాలలో నిర్బంధంగా ఉర్దూ బోధించాలని హుకుం జారీ చేయటం వంటివి దేశవ్యాప్తంగా అనేకం జరిగినవి.
దేశాన్ని బ్రిటిష్ వారు హస్త గతం చేసుకున్నాక, 1834లో ‘లార్డు మెకాలే’ మన దేశంలో పర్యటించి ఇక్కడ అమలు జరుగుతున్న విద్యా విధానాన్ని పరిశీలించి 1835 ఫిబ్రవరి రెండో తారీఖున ‘మెకాలే మినిట్స్’ అనే ప్రతిపాదన పత్రాన్ని సమర్పించాడు. తద్వారా దేశంలో ‘ఆంగ్ల విద్యా విధానం’ ప్రవేశపెట్టబడింది. అలానే ‘ఉడ్స్ నివేదిక’ ప్రకారం మద్రాసు, కలకత్తా, బొంబాయి వంటి నగరాలలో 1857లో తొలిసారిగా విశ్వవిద్యాలయాలు నెలకొల్పబడినవి. పాశ్చాత్య విద్యా విధానాన్ని చదువుతూనే పరాయి పాలనకు వ్యతిరేకంగా మనదేశపు మేధావి వర్గం సమాంతరంగా ఉద్యమం నడిపిన విషయం తెలిసిందే. అనంతరం దేశానికి స్వాతంత్ర్యం రావటం మొదటి విద్యా శాఖమంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ మార్గ దర్శకత్వంలో UGC స్థాపన, AICTE, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి, వొకేషనల్ ఎడ్యుకేషన్ మొదలైన సంస్థలకు అప్పుడే అంకురార్పణ జరిగింది.
జాతీయ విద్యావిధానాల క్రమం..
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన ఏడు దశాబ్దాల కాలంలో పిల్లల భవిష్యత్తుకు, అలాగే దేశానికి ఉపయోగపడే విధంగా డజనుకు పైగా విద్యా కమిటీలు, కమిషన్లు ఏర్పాటు చేసుకొని వాటి సిపార్సులకు అనుగుణంగా విద్యా వ్యవస్థను దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మార్చుకున్నాం. చివరిగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో ఏర్పాటు చేసిన ‘జాతీయ విద్యా విధానం’ (NEP 1986) ఫలితంగా కొత్త విద్యా విధానం రూపుదిద్దుకోబడింది. దీని ద్వారా దేశంలో చాలా వరకు విద్యా విప్లవం వచ్చిందనే చెప్పాలి.
దేశవ్యాప్తంగా ఆపరేషన్ బ్లాక్ బోర్డు, కార్యక్రమాలు, రాత్రి పాఠశాలలు జాతీయ సాక్షరతా కార్యక్రమాలు గ్రామ గ్రామాన పెద్దఎత్తున జరిగినవి. దీనికన్న ముందుగా ఏర్పాటు చేసిన కొఠారి కమిషన్ (1964-66) ఒకే విధమైన పాఠశాల వ్యవస్థను అలానే, ‘త్రిభాషా సూత్రం’ , 10+2+3 విధానాన్ని అమలు చేయమని సూచిస్తూనే, ‘దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది’ అని ప్రస్తావించింది. తిరిగి ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత డాక్టర్ కృష్ణ స్వామి కస్తూరి రంగన్ సిఫార్సుల మేరకు (NPE 2020) నూతన జాతీయ విద్యా విధానంలోకి (5+3+3+4) అడుగులు వేయబోతున్నాం.
మన విద్యా విలువలు సనాతనమైనవి
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చెప్పిన వాక్యాలు ప్రస్తావనార్హం. ‘జీవితంలో విలువలను నేర్పించేదే నిజమైన విద్య’ అని. మరి ఇంత సుదీర్ఘమైన ప్రయాణంలో ఎటువంటి విలువలతో కూడిన విద్యను మనం అభ్యసించామనేది మనకు మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుంచి నేటి వరకు స్వయం సమృద్ధిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని చాలావరకు అందిపుచ్చుకున్నాం. బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం ప్రపంచంలో ఐదవ ఆర్ధిక వ్యవస్థగా ఈ మధ్యనే అవతరించాం.
కాని సాంకేతికత పెరిగిన కొద్ది సంకుచితపు భావజాలాన్ని మనుషుల మెదళ్ళ నుంచి, మారుతున్న విద్యా దృక్పథాలు ఎందుకు మార్చలేకపోతున్నాయ్ అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మన దేశపు విద్యా విలువలు సనాతనమైనవి. భిన్నత్వంలో ఏకత్వం అనే గొడుగు కింద వసుధైక కుటుంబం వలే లౌకికమైన వ్యవస్థను, బలమైన ప్రజాస్వామిక సూత్రాలను ఏర్పాటు చేసుకొని మనుగడ కొనసాగిస్తున్నాం. కానీ, అక్షరాస్యతా శాతం పెరిగిన కొద్ది కులం/మతం, లేదా హింస, అవినీతి, వ్యక్తిగత స్వార్ధం, సామాజిక అసమానతలు, స్త్రీ/పురుష వివక్ష ఇంకా కొనసాగటం పాలకుల వైఫల్యమా? విద్యా విధానాల వైపల్యమా? ఒక్కసారి పునరాలోచించుకోవాలి.
ఎన్ని నూతన విద్యా విధానాలు వచ్చినా..
వ్యవస్థలు మారినా, వ్యక్తులు మారినా, పాలకులు మారినా విద్య ద్వారా మనిషి విశాలమైన విశ్వజనీనమైన ఆలోచనా దృక్పథం అలవాటు చేసుకోలేనప్పుడు ఎన్ని ‘నూతన విద్య విధానాలు’ వచ్చినా అవి నీటి మూటలుగానే మిగిలిపోతాయ్ . దేశ రక్షణకు లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించి విద్యకు మాత్రం పది శాతం లోపు కేటాయించటం బాధ కల్గించే విషయం. తరగతి గదిలో సృజనాత్మకంగా చదువుకున్న విద్యార్దే దేశ రక్షణకు కావలసిన ఆధునిక యంత్ర పరికరాలను తయారు చేయగలడన్న సత్యాన్ని పాలకులు గమనించాలి. అందుకే విద్యకు అధిక ప్రాధాన్యతను ఇచ్చి పరిశోధన, సృజనాత్మక ఆలోచనలు పెంపొందించే ప్రయత్నం చేయాలి. విద్యా హక్కు చట్టం (2009) ఎందుకు బాల కార్మికులను తరగతి గది వైపు మళ్ళించలేకపోయిందన్నది కూడా సమీక్ష చేయాలి.
అక్షరాస్యత పెరిగినా.. అవినీతి పెరుగుతూనే ఉంది
2011 జనాభా లెక్కల ప్రకారం మన అక్షరాస్యత శాతం 74.04. ప్రస్తుత గణాంకాల ప్రకారం సుమారు 85% పైన ఉండవచ్చనేది పరిశోధకుల అభిప్రాయం. అవినీతి నిరోధక సూచిలో 2022 ప్రకారం మన దేశపు ర్యాంక్ 86. అక్షరాస్యత శాతం పెరుగుతున్న కొద్దీ అవినీతి తగ్గాలి, నేరాల సంఖ్య కూడా తగ్గాలి. కానీ దేశంలో దీనికి విరుద్ధంగా రోజురోజుకూ ఈ అంకెలు పెరగటం ఆందోళన కల్గించే అంశం.లోపం ఎక్కడ ఉందనేది మనకు మనం తర్కించుకోవాలి.
ప్రపంచ పోటీకి తగిన విద్యావిధానమూ అవసరమే
ప్రపంచీకరణ ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న తరుణంలో మన విద్యా విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. దానితో పాటుగా వ్యక్తులుగా మనం కూడా సంకుచితపు భావజాలం మధ్య కొట్టుమిట్టాడకుండా విశాలమైన దృక్పథంతో మానవతా విలువల్ని, సార్వజనీనమైన సూత్రాలను పాటించాలి. అప్పుడే మన విద్యా విధానం ప్రపంచ దేశాలకు మార్గదర్శకం కాగలదు.
- డా.మహ్మద్ హసన్,సహాయ ఆచార్యుడు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, నల్లగొండ