రాష్ట్రంలో కొత్తగా డిసెంబర్ 7వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. పదేళ్ల తెలంగాణ రాష్ట్రం, కె.చంద్రశేఖరరావు ప్రభుత్వం పరిపాలన తరువాత మొదటి సారి ఇతర పార్టీ అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయం, నిధులు, నియామకాలు, నీళ్ల కేటాయింపులో వివక్ష, స్వపరిపాలన, ఆత్మగౌరవం అనే అంశాలతో ప్రత్యేక రాష్ట్ర పోరాటం జరిగింది.
సబ్బండ వర్గాల పోరాటాలు, త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. కాని అధికారంలో వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఆరంభంలో కొంత ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించినా, కాల క్రమేణా నియంత పోకడలు, రెండవ దఫా అధికారంలోకి వచ్చాక నిరంకుశ పరిపాలనను తెలంగాణ చవి చూసింది. దానిపైనే ప్రజలు ప్రజాస్వామిక తెలంగాణను కాంక్షిస్తూ కాంగ్రెస్ ను గెలిపించి, బీఆర్‌ఎస్‌ను ఓడించారు . కొత్త ప్రభుత్వానికి అనేక సవాళ్లు, సమస్యలు ఎదురవుతున్నాయి. వెయ్యి ఆశలతో మార్పు కోసం ఎదురు చూస్తున్న ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నడుంబిగించాలి.
అటకెక్కిన ఉద్యమ ఆకాంక్షలు
కేసీఆర్ ప్రభుత్వం గోదావరి నీళ్లను వినియోగించడంలో కొద్దిగా ప్రయత్నం సాగించినా, కృష్ణానది నీళ్లను ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయారు. నియామకాల విషయంలో విఫలమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూములు నైజాం పరిపాలన 90 సంవత్సరాల క్రితం సర్వే చేయబడ్డాయి. ఆనాడు జరిగిన సర్వే తప్పుల తడకలుగా ఉన్నాయని తెలుస్తున్నది. భూస్వాముల చేతిలో భూములు ఉండడం వల్ల కౌలుదార్ల హక్కు చట్టాలు వచ్చాయి. అనేక భూ రక్షణ చట్టాలు, అసైన్డ్ భూముల చట్టాలు వచ్చాయి.
ఉమ్మడి రాష్ట్రంలో భూ రికార్డులను సరి చేసినా, అది పూర్తిస్థాయిలో సాధ్యం కాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సర్వే నెంబర్ల వారీగా భూములను సర్వే చేయాలని ఎన్నిసార్లు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు విన్నవించినా, పెడచెవిన పెట్టారు. కొత్త రెవెన్యూ చట్టాలు తెస్తానని, భూములకు చట్టబద్ధత కల్పిస్తామని, సన్న, చిన్నకారు రైతులను ఆదుకుంటామని అనేక వాగ్దానాలు చేశారు. అవి ఏవి కూడా అమలు కాలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి, టిఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల్లోకి భూములు ఎక్కడికక్కడ వెళ్లిపోయాయి. చివరకు చెరువు శిఖాలు, ప్రభుత్వ భూములలో సుందరమైన భవనాలు వెలిసాయి. ఇవన్నీ చూస్తే కేసీఆర్ ఆత్మగౌర వ పరిపాలనకు గుండుసున్న పెట్టాడు.
ప్రాతినిధ్యం లేదు, ఉద్యమం లేదు
ఒక రాజు లాగా ఎవరిని కలవనని, ప్రజల సమస్యలు విననని చెప్పకనే చెప్పాడు. ఆయన ఆడింది ఆటగా, పాడిందే పాటగా పరిపాలన సాగించాడు. ప్రజల సమస్యలు పేరుకుపోయాయి. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లు నిర్వీర్యమైపోయాయి. సంక్షేమ పథకాలు టీఆర్‌ఎస్ నాయకుల చెప్పుచేతుల్లోనే అమలయ్యే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడి ఉండింది. మంత్రులకు, ఎమ్మెల్యేలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో పారదర్శకత లోపించడం వల్ల పేద ప్రజలకు అన్యాయం జరిగింది. నాణానికి బొమ్మ బురుసులాగా ప్రాతినిధ్యం, ఉద్యమం ఉండేది.
కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాతినిధ్యం లేదు, ఉద్యమం అసలే లేదు. ప్రజాసమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురాకుండా ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో ధర్నాలు చేయకుండా ఎత్తివేశాడు. సీపీఐ, వామపక్షాలు, తెలంగాణ జేఏసీ కలిసి ఇందిరాపార్క్ ధర్నా చౌక్ సాధన సమితిని ఏర్పాటు చేసింది. చలో అసెంబ్లీకి పిలుపు ఇవ్వవలసి వచ్చింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలపడం, ధర్నా చౌక్ సాధించడం జరిగింది. ఆ సమయంలో కూడా ఆనాటి ప్రభుత్వం కేసులు పెట్టింది. ప్రగతి భవన్‌కు కంచెవేసి ఏకపక్ష నియంతృత్వ పరిపాలన సాగించాడు.
ప్రతిపక్షమే లేకుండా చేసే కుట్ర
అసలు తెలంగాణలో ప్రతిపక్షమే లేకుండా చేసేందుకు టీఆర్‌ఎస్ కుట్ర చేసింది. మొదటిసారి అధికారంలోకి వచ్చీ రాగానే కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని చీల్చారు. తరువాత టీడీపీని నామరూపాలు లేకుండా చేశారు. చివరకు తెలంగాణ ఉద్యమంలో అండదండగా ఉంటూ ప్రత్యక్ష పోరాటం చేసిన సీపీఐ శాసనసభ్యున్ని సైతం నిర్దాక్షిణ్యంగా కేసీఆర్ తన వైపు తిప్పుకున్నాడు.
రెండవసారి అధికారంలోకి వచ్చాక శాసనసభలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఎంఎల్ఏలను పార్టీ ఫిరాయించేలా చేసి, ప్రతిపక్ష హోదాను కూడా ఊడబెరికారు. చివరకు తానొక రాజువలే వ్యవహరించి, ప్రతిపక్షమే లేకుండా చేయాలని తలపోశారు. చివరకు ఇప్పుడు అదే టీఆర్‌ఎస్ ప్రతిపక్షంలోకి రాగా, స్వయంగా కేసీఆరే శాసనసభ ప్రతిపక్ష నాయకుడుగా రావడం కాల మహిమ. గతంలో ప్రతిపక్షాలను చీల్చి, ఎంమ్మెల్యేలను లాగేసుకున్న టీఆర్‌ఎస్ ఇప్పుడు మేము 39 సభ్యులమని, మాకు అసెంబ్లీలో సమయం ఎక్కువ ఇవ్వాలనడం వినేవారికి నవ్వు తెప్పిస్తోంది.
‘కంచెలు’ తొలిగిపోయాయి .. సమస్యలు ఎదురుచూస్తున్నాయి
2023 డిసెంబర్ 7న ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ చుట్టూ కంచెలను తొలగించారు. ఈ విషయంపై ప్రజలు, మేధావులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ప్రభుత్వ పాలన సాగుతున్నదని కనిపించింది. అయితే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. బడుగు బలహీన వర్గాలకు ఇప్పటికీ పక్కా ఇండ్లు లేవు.
డబుల్ బెడ్ రూమ్స్ కట్టించినా తూతూ మంత్రంగానే సాగింది. పెన్షన్లు అర్హులైన భార్యాభర్తలకు ఇవ్వకుండా ఇంట్లో ఒక్కరికి మాత్రమే వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం జరిగింది. గ్రామసభల ద్వారా అందించే స్కీములను అందించకుండా దానికి భిన్నంగా ఎస్సీ బంధు, బీసీ బందు పెట్టి అధికార పార్టీకి చెందిన నాయకుల అనుచరగణానికి మాత్రమే అందే విధంగా చేశారు. చెట్టు, గుట్ట, పుట్ట అన్న తేడా లేకుండా ఎన్ని ఎకరాలకు పడితే అన్ని ఎకరాలకు రైతుబంధు ఖాతాలలో వేసింది. రియల్ ఎస్టేట్ భూములకు కూడా రైతుబంధు వేశారంటే అంతకన్నా దారుణమైన పరిస్థితి మరొకటి ఉండదు.
నూతన ప్రభుత్వానికి సవాళ్లు
తెలంగాణ దాదాపు 6 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో కూరుకుపోయిందని చెప్తున్నారు. కొత్త ప్రభుత్వం కూడా అనేక హామీలను ఇచ్చింది. అందులో భాగంగా రెండు హామీలను ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చింది. ఇది మంచి పరిణామమే. ఆర్థిక నిపుణులతో చర్చించి తెలంగాణ ఆర్థిక ముఖచిత్రాన్ని రూపొందించాలి. ఆదాయ మార్గాలను అన్వేషించాలి. గత ప్రభుత్వం మద్యం షాపులు, బెల్ట్ షాపులతో ఆదాయాన్ని పెంచుకున్నది.
ఖర్చులను వీలైనంతవరకు పొదుపు చేసుకుంటూనే సంక్షేమ పథకాలను అమలు చేయాలి. దారిద్ర్యరేఖకు దిగువనున్న బడుగు బలహీన వర్గాలకు ఇందిరమ్మ రాజ్యం తెస్తామని ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది. పేదలకు న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. 2004లో బడ్జెట్ 30, 40 వేల కోట్లు మాత్రమే ఉండేది. నేడు ఆదాయం పెరిగింది. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆదాయ మార్గాలు కూడా పెంచుకోవాల్సి ఉన్నది.
భూ అక్రమాలపై అఖిలపక్షం వేయాలె
భూ అక్రమార్కులను అరికట్టాలి. భూ సమగ్ర సర్వే చేపట్టి ధరణిలో నెలకొన్న లొసుగులను, అవకతవకలను సవరించి వాటిని మార్పు చేయాలి. భూ సమస్యపై ఒక ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి సరిచేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. నైజాం కాలంలో గుట్టలకు పట్టాలు చేయలేదు. గుట్టలు, నాళాలు, చెరువు శిఖా భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకొని పేద ప్రజలకు అందవలసిన భూములను లాక్కున్నారు. రియల్‌ఎస్టేట్ కన్ను పడ్డ తర్వాత భూమి లాభదాయకర వస్తువుగా మారిపోయిందని సామాన్యుడికి అందనంత దూరంలో ఉందని అర్థమవుతుంది.
నిరుద్యోగులకు భరోసా ఇవ్వాలె
2004 నుండి 2009 వరకు వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం హయాం నుంచి కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్తా ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కనీస వేతనాలు లేవు, సమాన పనికి సమాన వేతనాలు అసలే లేవు. ఇలాంటి సమస్యలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గ్రామస్థాయిలోనే కాకుండా నగర, మున్సిపాలిటీల పరిధిలో కూడా ఉపాధి హామీ పనులను చేపట్టే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలి.
చాడ వెంకటరెడ్డి,సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు