ఫీజు బకాయిల కోసం 3న చలో కలెక్టరేట్: బీసీ విద్యార్థి సంఘం పిలుపు

ఫీజు బకాయిల కోసం 3న చలో కలెక్టరేట్: బీసీ విద్యార్థి సంఘం పిలుపు

బషీర్ బాగ్, వెలుగు: ఫీజు బకాయిలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం స్టూడెంట్ల జీవితాలతో చెలగాటం ఆడుతోందని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. మూడేండ్లుగా ఫీజులు పెండింగ్​ పెట్టారని, కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇంతవరకు ఒక్క రూపాయి చెల్లించలేదని విమర్శించారు. 

ప్రభుత్వ వైఖరితో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఉన్నత చదువులకు దూరమవుతున్నారని చెప్పారు. పెండింగ్ ​ఫీజులు రిలీజ్​చేయాలని, స్కాలర్ షిప్ లను రూ.5,500 నుంచి రూ.20 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం జనవరి 3న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది.

బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో గురువారం చలో కలెక్టరేట్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్.కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. ఫీజులు చెల్లించడంలో సీఎం రేవంత్​రెడ్డి సానుకూలంగానే ఉన్నారని, అధికారులే జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. రూ.వేల కోట్ల ఫీజులు పెండింగ్​ పెడుతుండడంతో యాజమాన్యాలు కాలేజీలను మూసివేస్తున్నాయన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో ఉన్న శ్రద్ధ స్టూడెంట్ల భవిష్యత్తుపై లేకపోవడం బాధాకరమన్నారు. 

సీఎం జోక్యం చేసుకొని 16 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బీసీ సంఘం నాయకులు నీల వెంకటేశ్, జిల్లపల్లి అంజి, రఘుపతి, చంద్రశేఖర్, బి.రాజేందర్, రామకోటి, రాందేవ్, వీరన్న, ఉమేశ్, రమేశ్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.