
- జంతర్ మంతర్ వేదికగా రేపు (ఏప్రిల్ 02) ‘పోరు గర్జన’ మహాధర్నా
- ఢిల్లీకి ప్రత్యేక రైల్లో తరలిన 1,500 మంది ప్రతినిధులు
- బీసీ బిల్లులను పార్లమెంట్లో ఆమోదించి.. 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్
- పాల్గొననున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు
- కేంద్రం ఆమోదించకుంటే ఉద్యమం తప్పదు: జాజుల శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, వెలుగు: బీసీలకు 42 శాతం కోటా కోసం బీసీ సంఘాల నేతలు, మేధావులు ఢిల్లీ బాట పట్టారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రెడీ అయ్యారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలతోపాటు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే రెండు బిల్లులను ఇటీవల అసెంబ్లీ, కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించాయి. వీటిని పార్లమెంట్లో ఆమోదించి, తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర సర్కార్‌తోపాటు బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్‌తో బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర 12 బీసీ సంఘాలు ‘బీసీల పోరు గర్జన’ పేరిట మహాధర్నా నిర్వహించనున్నాయి. ధర్నాలో పాల్గొనేందుకు బీసీ సంఘాలకు చెందిన సుమారు 1,500 మంది ప్రతినిధులు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలులో సోమవారం బయలుదేరారు. వీరికి సంఘీభావంగా ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి మరో 15వందల మంది హాజరు కానున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ బిల్లులను ఆమోదించాలని కేంద్రాన్ని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బుధవారం జరిగే ధర్నాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎంపీలు, బీసీ ఎమ్మెల్యేలు, పలు పార్టీల సీనియర్ లీడర్లు పాల్గొనే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్, బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్లు మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు.
బీసీ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్నది. ఇప్పటికే ఈ బిల్లులను అసెంబ్లీ, శాసనమండలిలో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించుకున్నది. పార్లమెంట్లో ఆమోదించి, తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏప్రిల్ నెలంతా ఢిల్లీ కేంద్రంగా పోరాటం చేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ నిర్ణయించారు. ఈ క్రమంలో త్వరలోనే రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలిసివచ్చే పార్టీల నేతలతో అఖిలపక్షంగా వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు కేంద్రమంత్రులను, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలిసి విజ్ఞప్తి చేయాలని భావిస్తున్నారు.
ఇందుకోసం ప్రధానమంత్రి, రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌కూడా సీఎం కోరినట్లు కాంగ్రెస్‌పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం కన్నా ముందే రాష్ట్రంలోని సుమారు 12 బీసీ సంఘాలు బుధవారం జంతర్మంతర్దగ్గర మహాధర్నాకు సిద్ధమయ్యాయి. ఈ ధర్నాకు ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఆహ్వానించిన బీసీ సంఘాల నేతలు మంగళవారం మరోసారి ఆయనను కలువనున్నారు.
రాహుల్‌తో పాటు పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీల అధ్యక్షులు, ఎంపీలను ఈ ధర్నాకు బీసీ సంఘాల నేతలు ఆహ్వానించారు. సోమవారం ఢిల్లీకి తరలివెళ్లినవారిలో బీసీ సంక్షేమ సంఘం, బీసీ యూనివర్సిటీ విద్యార్థుల సంఘం, బీసీ మహిళా సంఘం, బీసీ ఉద్యోగుల సంఘం, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ కుల సంఘాల జేఏసీ, బీసీ విద్యార్థి సంఘం, బీసీ యువజన సంఘం, బీసీ జనసైన్యం, బీసీ రిజర్వేషన్ పోరాట సమితి, బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ కమిటీ , కాకతీయ యూనివర్సిటీ బీసీ రీసెర్చ్ స్కాలర్స్ ఫోరం నుంచి సుమారు 1,500 మంది ఉన్నారు.
ఇవాళ (ఏప్రిల్ 1) ఢిల్లీకి కాంగ్రెస్ టీమ్
బుధవారం జంతర్ మంతర్ దగ్గర జరగనున్న మహాధర్నాలో పాల్గొనేందుకు మంగళవారం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, విప్ ఆది శ్రీనివాస్, బీసీ ఎమ్మెల్యేలు వాకాటి శ్రీహరి ముదిరాజ్, బీర్ల ఐలయ్య, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, వీర్లపల్లి శంకర్ , పలువురు కార్పొరేషన్ చైర్పర్సన్లు, కాంగ్రెస్ అనుబంధ బీసీ సెల్ నేతలు తరలివెళ్లనున్నారు. ఈ నెల 2,3 తేదీల్లో ఢిల్లీలోనే ఉండనున్న మంత్రులు, ఎమ్మెల్యలేంతా అక్కడే ఉన్న కాంగ్రెస్ఎంపీలతో కలిసి ఒక బృందంగా కేంద్ర మంత్రులను , వివిధ పార్టీల అధినేతలను కలిసి పార్లమెంట్లో బీసీ బిల్లుల ఆమోదానికి సహకరించాలని విజ్ఞప్తిచేయనున్నారు.