- 2 వేల మందితో బ్యారేజీ పైకి వచ్చి హంగామా
- అంతమంది ఒకేసారి వెళ్లడం కుదరదన్న పోలీసులు
- అరగంటసేపు తోపులాట, తోసుకుని ముందుకెళ్లిన లీడర్లు
- పోలీసులు, బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలకు గాయాలు
- కుంగిన పిల్లర్లను చూడకుండానే 5 నిమిషాల్లో వెనుదిరిగిన కేటీఆర్
- అన్నారం బ్యారేజీని కూడా పరిశీలించకుండానే రిటర్న్
- ఒక్క గేట్ వద్ద సమస్య ఏర్పడితే లక్ష కోట్ల అవినీతి అంటరా?: కేటీఆర్
- అఖిలపక్షం పెడ్తే.. సలహాలు ఇస్తం: హరీశ్ రావు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో చేపట్టిన ‘చలో మేడిగడ్డ’ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. వివిధ ప్రాంతాల నుంచి నాలుగు బస్సులు, వందలాది కార్లలో తరలివచ్చిన దాదాపు 2 వేల మందికి పైగా పార్టీ నేతలు, కార్యకర్తలు శుక్రవారం సాయంత్రం మేడిగడ్డ బ్యారేజీపై హంగామా చేశారు.
మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అండతో పోలీసులపై జులుం చూపించారు. బ్యారేజీ కుంగినందున ఒకేసారి 2 వేల మందిని పంపడం సాధ్యం కాదని, విడతలవారీగా అందరినీ పంపిస్తామని బందోబస్తులోని పోలీసులు చెప్పినా వినకుండా దూసుకెళ్లారు. ‘మమ్మల్నే ఆపుతారా’ అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వాళ్లను పక్కకు నెట్టి, బ్యారేజీ గేట్లను తోసుకుంటూ ముందుకు ఉరికారు. దీంతో పలువురు పోలీసులు, బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు కిందపడటంతో దెబ్బలు తగిలాయి.
కేటీఆర్ కొద్దిసేపు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీసులో రెస్ట్ తీసుకుని సాయంత్రం 4గంటలకు బ్యారేజీ వద్దకు వచ్చారు. అయితే అప్పటికే వందలాది కార్లలో 2 వేల మంది బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని హంగా మా చేశారు. పోలీసులను నెట్టేసి బ్యారేజీ పైకి దూసుకెళ్లారు. ఆ తర్వాత కాన్వాయ్ లో కేటీఆర్ వెళ్లారు. బ్యారేజీ కిందికి వెళ్లిన ఆయన.. కేవలం 5 నిమిషాల్లోనే ఒడ్డుకు వచ్చేశారు. కుంగిన పిల్లర్లను కనీసం చూడలేదు.
మాజీ మంత్రి మల్లారెడ్డి ఒక్కరే పిల్లర్‌కు పగుళ్లు వచ్చిన చోట పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, ఆరూరి రమేశ్ అక్కడ ఫొటోలు తీసుకుంటుండగా మాజీ మంత్రి హరీశ్ రావు వారించారు. బ్యారేజీ పైకి వచ్చిన బీఆర్‌ఎస్ లీడర్లు, కార్యకర్తలు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు సెల్ఫీలు తీసుకుంటూ హంగామా చేశారు. మేడిగడ్డ సందర్శన అంటూ అందరినీ ఎగేసుకొచ్చిన కేటీఆర్మాత్రం కేవలం 5 నిమిషాల్లోనే పర్యటన ముగించుకుని వెళ్లిపోయారు.
అన్నారం బ్యారేజీని కూడా పరిశీలించలేదు..
మేడిగడ్డ నుంచి కాన్వాయ్‌లో అన్నారం బ్యారేజీకి చేరుకున్న కేటీఆర్.. అక్కడ నేరుగా పార్టీ ఏర్పాటు చేసిన స్టేజీ పైకి ఎక్కారు. కనీసం అన్నారం బ్యారేజీలో బుంగలు పడిన ప్రాంతాన్ని కూడా పరిశీలించలేదు. ఇరిగేషన్ ఇంజినీర్లతోనూ ఏమీ మాట్లాడలేదు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ‘కాళేశ్వరంపై కాంగ్రెస్ విషప్రచారం.. బీఆర్‌ఎస్ వాస్తవాలు’ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత మాజీ మంత్రి హరీశ్ రావు, సాగునీటి పారుదల నిపుణులు ప్రశాక్, జేఏసీ నేత ఒకరు మాట్లాడారు. కేటీఆర్ స్పీచ్ పెద్దగా లేకుండానే ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమం ముగిసింది.
వానాకాలంలోపు రిపేర్లు చేయాలి: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: రాకీయంగా తమపై కోపం ఉంటే తీర్చుకోవాలని.. రైతులపై, రాష్ట్రంపై పగ పట్టొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని విచారణలో తేలితే చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. వచ్చే వర్షాకాలం నాటికి మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం చలో మేడిగడ్డ కార్యక్రమం సందర్భంగా అన్నారం బ్యారేజీ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ1.6 కి.మీ. విస్తీర్ణం ఉంటే అందులో కేవలం 50 మీటర్ల పరిధిలో మూడు పిల్లర్ల వద్దే సమస్య వచ్చిందన్నారు. మొత్తం 85 గేట్లు ఉంటే.. ఒక గేట్ దగ్గరే సమస్య ఏర్పడిందన్నారు. దీనికే కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తోందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై గోబెల్స్ ప్రచారాన్ని ప్రజలకు వివరించేందుకే చలో మేడిగడ్డ కార్యక్రమం చేపట్టామన్నారు. కాళేశ్వరంలోని ఇతర ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కెనాల్స్, టన్నెల్స్, కాలువల ప్రాంతాల్లోనూ పర్యటించి ప్రజలకు వాస్తవాలను చెప్తామన్నారు. ఇప్పటికే నీళ్లు లేక కరీంనగర్, ఇతర జిల్లాల్లో పంటలు ఎండుతున్నాయని, వెంటనే ప్రాజెక్టుకు రిపేర్లు చేయాలన్నారు.
అఖిలపక్షం పెడ్తే.. సలహాలు ఇస్తం: హరీశ్
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీఆర్ఎస్ మేడిగడ్డ టూర్‌తో కాంగ్రెస్ సర్కారుపై ఒత్తిడి పెరిగిందన్నారు. అందుకే మేడిగడ్డకు రిపేర్చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. శుక్రవారం అన్నారం బ్యారేజీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం అవసరమైతే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని, తగిన సలహాలు ఇస్తామన్నారు.
‘‘ప్రగతి భవన్‌ను బాంబులతో పేల్చేస్తామని, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని గతంలో రేవంత్ అన్నారు. అలాంటి వ్యక్తి ఎంతకైనా తెగిస్తారు” అని హరీశ్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ కు మంచి పేరు వచ్చిందని, అందుకే ఆ ఆనవాళ్లు చెరిపేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. తప్పు చేసిన వారిని శిక్షించాలని.. కానీ రైతులకు ఇబ్బంది కలగనివ్వొద్దని కోరారు. వర్షాకాలం వరదలు వచ్చేలోపే మేడిగడ్డకు పునరుద్ధరణ పనులు
చేపట్టాలన్నారు.