- బీజేపీపై టీఆర్ఎస్ వైఖరి మారకుంటేనే కలిసి పని చేస్తం
- అందరూ కలిసివస్తే నెలలోపు పోడు సమస్య పరిష్కరిస్తం
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
హనుమకొండ, వెలుగు: కేంద్ర ఎన్నికల కమిషనర్ నియామకంలో కేంద్రం అత్యుత్సాహం చూపిందని, ఎలక్షన్ కమిషన్ ఏర్పాటుకు కూడా కొలీజియం లాంటి వ్యవస్థ ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. కేంద్రం తమ మాట వినని రాష్ట్రాలపై గవర్నర్ వ్యవస్థ ద్వారా పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తోందని, గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలనే డిమాండ్‌తో డిసెంబర్ 7న 'ఛలో రాజ్ భవన్' కార్యక్రమానికి పిలుపునిస్తున్నట్లు చెప్పారు.
హనుమకొండ బాల సముద్రంలోని సీపీఐ జిల్లా ఆఫీస్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ నియామకాన్ని స్వయంగా సుప్రీం కోర్టే తప్పు పట్టిందని, బీజేపీ అధికారంలోకి వచ్చిన 8 ఏండ్లలో 8 మంది కమిషనర్లను మార్చిందన్నారు. అందుకే ఈసీకి కూడా కొలీజియం వ్యవస్థ ఉండాలన్నారు.
భవిష్యత్తులోనూ టీఆర్ఎస్తోనే..
సీపీఐ భవిష్యత్‌లోనూ టీఆర్ఎస్‌తో కలిసి పని చేస్తుందని, కానీ ఆ అంశం టీఆర్ఎస్ చేతిలోనే ఉందని కూనంనేని స్పష్టం చేశారు. బీజేపీపై టీఆర్ఎస్ ఇలా పోరాటం చేస్తేనే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల ఎరకేసులో అమిత్ షాను రప్పిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని అభిప్రాయపడ్డారు. అమిత్ షాకు సిట్ ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాస్ రావు హత్యను తాము ఖండిస్తున్నామన్నారు. పోడు భూముల సమస్యకు హత్యలు పరిష్కారం కాదని, ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశా రు. రాష్ట్రంలో వివిధ పార్టీలు, సంఘాలు కలిసి వస్తే నెల రోజుల్లో పోడు సమస్యను పరిష్కరిస్తామన్నారు.
ఇండ్ల స్థలాలు, విభజన హామీల కోసం పోరాటం
వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వేలాది మంది పేదలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని బతుకుతున్నారని, వారందరికీ వంద గజాల ఇంటి స్థలం ఇచ్చి పట్టాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర విభజన హామీలైన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ములుగు ట్రైబల్ వర్శిటీ, మెగా టెక్స్ టైల్ పార్క్ సాధన కోసం సీపీఐ పోరాడుతుందన్నారు.
పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, నాయకులు టి. వెంకట్రాములు, నేదునూరి జ్యోతి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కార్యదర్శులు కర్రె భిక్షపతి, మేకల రవి, నాయకులు తోట భిక్షపతి, షేక్ బాషామియా, ఆదరి శ్రీనివాస్, ఎల్లేష్, సదాలక్ష్మి, లక్ష్మణ్, రాములు, లక్ష్మణ్, రవి,వెంకటరమణ, సంతోష్, ప్రసన్న, శరత్ పాల్గొన్నారు.