మాట నిలబెట్టుకున్న రాజగోపాల్​రెడ్డి

నల్గొండ, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డికి ఇచ్చిన మాటను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి నిలబెట్టుకున్నారు. భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్​కుమార్​రెడ్డి గెలుపు బాధ్యతలను రేవంత్​రెడ్డి.. రాజ గోపాల్ రెడ్డిపైపెట్టారు. చామలను ఎంపీ అభ్యర్థిగా డిక్లేర్​ చేయగానే సీఎం స్వయంగా రాజగోపాల్​రెడ్డి నివాసంలోనే ఎన్నికల కార్యాచరణపై సమీక్షించారు. కిరణ్​ను ఎంపీగా గెలిపించాలని కోరారు. రాజగోపాల్​రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి భువనగిరి నుంచే రెండుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. అయితే భువనగిరిలో రాజగోపాల్​కు ఉన్న ఇమేజ్​ దృష్ట్యా సీఎం ఆయన్నే ఇన్​చార్జిగా పెట్టారు. అలాగే, కిరణ్​ నామినేషన్​ కార్యక్రమానికి సీఎం స్వయంగా వచ్చారు. 

మల్లికార్జున ఖర్గే, మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఇక్కడ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఫస్ట్​ టైం ఎమ్మెల్యేలుగా నకిరేకల్​, ఆలేరు, తుంగతుర్తి నియో జకవర్గాల్లో సైతం కాంగ్రెస్​ లీడ్​ వచ్చింది. బీఆర్ఎస్, బీజేపీలు ఇక్కడ బీసీ క్యాండేట్లను పోటీలో నిలబెట్టినా రాజగోపాల్​రెడ్డి గట్టిగానే ఫైట్​ చేశారు. ఫలితంగా 2,22,170 ఓట్ల భారీ మెజార్టీతో కిరణ్​గెలిచారు. భువనగిరిలో కాంగ్రెస్​గెలుపొందడంతో రాజగోపాల్​రెడ్డికి కేబినెట్​బెర్త్​ ఖాయమనే చర్చ కూడా మొదలైంది. ఎన్నికల టైంలో అధిష్టానం ఇచ్చిన హామీ మేరకే రాజగోపాల్​రెడ్డి భువనగిరి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా రు. 

అంచనా తప్పలేదు 

తెలంగాణలో పార్లమెంట్​ఎన్నికల ఫలితాలపై కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి అంచనా తప్పలేదు. ఆయన తన జన్మదినం సందర్భంగా శనివారం తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ఎన్నికల ఫలితాలపై మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్​, బీజేపీ సమానమైన సీట్లు గెలుచుకుంటాయని, ఈ రెండు పార్టీల మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. సరిగ్గా ఆయన చెప్పినట్టే ఫలితాలు వచ్చాయి.