Women's Asia Cup 2024: ఆసియా కప్‌లో రికార్డుల మోత.. విధ్వంసకర సెంచరీతో శ్రీలంక కెప్టెన్ సరికొత్త చరిత్ర

Women's Asia Cup 2024: ఆసియా కప్‌లో రికార్డుల మోత.. విధ్వంసకర సెంచరీతో శ్రీలంక కెప్టెన్ సరికొత్త చరిత్ర

మహిళల ఆసియా కప్ లో భాగంగా ఆతిధ్య శ్రీలంక జట్టు కెప్టెన్ చమరి ఆట‌ప‌ట్టు విధ్వంసకర సెంచరీతో విరుచుకుపడింది. పసికూన మలేషియా బౌలర్లకు చుక్కలు చూపించింది. 63 బంతుల్లోనే సెంచరీ చేసి మహిళల ఆసియా కప్ లో సెంచరీ చేసిన మొదటి ప్లేయర్ గా చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఆసియా కప్ చరిత్రలో మిథాలీ రాజ్ (97) అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ ఉంది. ఈ మ్యాచ్ తో ఆటపట్టు ఈ రికార్డ్ బ్రేక్ చేసింది. ఈ మ్యాచ్ మొత్తం 69 బంతుల్లో 119 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. 

సోమవారం (జూలై 22) రంగగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక కెప్టెన్ ఈ ఘనత సాధించింది. ఆట‌ప‌ట్టు ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, 7 సిక్సర్లు ఉండడం విశేషం. దీంతో మహిళల ఆసియా కప్ లో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా మరో రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది. ఇంతకు ముందు ఆసియా కప్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధికంగా షెఫాలీ వర్మ, రిచా ఘోష్,అలియా రియాజ్, స్మృతి మంధాన 3 సిక్సర్లు మాత్రమే కొట్టారు. 

ఈ మ్యాచ్ విష‌యానికొస్తే.. మలేషియాపై శ్రీలంక ఈ మ్యాచ్ లో 140 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. కెప్టెన్ ఆటపట్టు 119 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది.  అనంత‌రం చేధ‌న‌కు దిగిన మ‌లేషియా జ‌ట్టు 19.5 ఓవ‌ర్ల‌లో అన్ని వికెట్లు కోల్పోయి 40 ప‌రుగులు మాత్ర‌మే చేసింది.