వీడియో: వీరనారి క్రికెట్ విధ్వంసం.. 80 బంతుల్లో 140

వీడియో: వీరనారి క్రికెట్ విధ్వంసం.. 80 బంతుల్లో 140

'29 ఓవర్లలో 196 టార్గెట్..' పురుష క్రికెటర్లకు ఇది పెద్ద టార్గెట్ కాకపోయినప్పటికీ.. మహిళా క్రికెటర్లకు మాత్రం ఇది భారీ లక్ష్యమే. అందునా శ్రీలంక మహిళా క్రికెట్ జట్టు లాంటి చిన్న జట్లకైతే కొండంత లక్ష్యం. దాదాపు ఓటమి ఖాయమైనట్లే. కానీ, ఓ క్రికెటర్ విధ్వంసం ముందు అంత పెద్ద లక్ష్యం కూడా చిన్నబోయింది. 

గాలే వేదికగా సోమవారం న్యూజిలాండ్, శ్రీలంక మహిళా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన కివీస్.. బ్యాటింగ్ ఎంచుకోగా ఇన్నింగ్స్.. 31 ఓవర్ల(127-2) వద్ద మ్యాచుకు వర్షం అంతరాయం కలిగించింది. ఆపై వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో.. అంపైర్లు న్యూజిలాండ్ ఇన్నింగ్స్ అంతటితో ముగిసినట్లు ప్రకటించారు. అనంతరం ఆట తిరిగి ప్రారంభం కాగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం అంపైర్లు.. శ్రీలంక ముంగిట 29 ఓవర్లలో 196 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించారు. 

197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన లంకేయులకు ఆదిలోనే షాక్ తగిలింది. 6 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఇక లాభం లేదనుకున్న శ్రీలంక మహిళా జట్టు కెప్టెన్ 'చమరి ఆటపట్టు' కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది.  మైదానం నలువైపులా బౌండరీలు బాదుతూ.. 80 బంతుల్లోనే 140 పరుగులు చేసింది. ఇందులో 13 ఫోర్లు, 9 సిక్సులు ఉన్నాయి. ఆటపట్టు ధాటికి శ్రీలంక మరో 13 బంతులు మిగిలివుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ ఇన్నింగ్స్‌తో ఆటపట్టు.. ఐసీసీ వన్డే ర్యాకింగ్స్‌లో నెంబర్.1 స్థానానికి చేరుకోవడం గమనార్హం. ఈ ఘనత అందుకున్న తొలి  లంక మహిళా క్రికెటర్ కాగా, ఓవరాల్‌గా రెండో క్రికెటర్. ఇంతకుముందు సనత్ జయసూర్య ఈ ఘనత అందుకున్నాడు.