
రాయ్‌పూర్: ఒకప్పుడు వరల్డ్ క్రికెట్‌ను ఊపేసిన క్రికెటర్లు మళ్లీ తమ దేశాల తరఫున బరిలోకి ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20 టోర్నమెంట్ (ఐఎమ్‌ఎల్) తొలి ఎడిషన్‌లో సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలోని ఇండియా మాస్టర్స్ చాంపియన్‌గా నిలిచింది. హైదరాబాదీ అంబటి రాయుడు (50 బాల్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 74) ధనాధన్ బ్యాటింగ్‌తో విజృంభించడంతో ఆదివారం (మార్చి 16) రాత్రి జరిగిన ఫైనల్లో ఇండియా 6 వికెట్ల తేడాతో బ్రియాన్ లారా కెప్టెన్సీలోని వెస్టిండీస్ మాస్టర్స్‌ను చిత్తుగా ఓడించింది.
అభిమానులతో కిక్కిరిన స్టేడియంలో తొలుత విండీస్ 20 ఓవర్లలో 148/7 స్కోరు చేసింది. లెండిల్ సిమ్మన్స్ (41 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 57), డ్వేన్ స్మిత్ (35 బాల్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 45) రాణించారు. ఇండియా బౌలర్లలో వినయ్ కుమార్ మూడు, షాబాజ్ నదీమ్ రెండు వికెట్లు తీశారు. అనంతరం రాయుడికి తోడు సచిన్ (18 బాల్స్‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 25) ఆకట్టుకోవడంతో ఇండియా మాస్టర్స్ 17.1 ఓవర్లలోనే 149/4 చేసి ఈజీగా గెలిచింది. రాయుడు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.