ENG vs AUS: ఇంగ్లిస్‌ మెరుపు శతకం.. రికార్డు లక్ష్యాన్ని చేధించిన ఆస్ట్రేలియా

ENG vs AUS: ఇంగ్లిస్‌ మెరుపు శతకం.. రికార్డు లక్ష్యాన్ని చేధించిన ఆస్ట్రేలియా

ఐసీసీ టోర్నీలంటే చెలరేగిపోయే ఆస్ట్రేలియన్లు మరోసారి అన్నంత పని చేశారు. ఇంగ్లాండ్ నిర్ధేశించిన 352 పరుగుల భారీ లక్ష్యాన్ని అలవోకగా చేధించారు. ఎక్కడా తడబడింది లేదు, మ్యాచ్ ఉత్కంఠ రేపింది లేదు. మొదటి 40 ఓవర్లూ అడపాదడపా బౌండరీలు సాధిస్తూ వచ్చిన కంగారూలు.. ఆఖరిలో రెచ్చిపోయారు. టీ20లకు అలవాటు పడ్డ శరీరాలు కదా.. బౌండరీల మోత మోగించారు. ఛేదనలో ఆసీస్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్(86 బంతుల్లో 120 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు శతకం బాదాడు.   

రాణించిన షార్ట్ 

ఆరంభంలో ట్రావిస్ హెడ్(6), స్టీవెన్ స్మిత్ (5)ను అవుట్ చేశామన్నా ఆనందం తప్ప ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఆటగాళ్లను సంతోషపెట్టిన విషయం ఒక్కటీ లేదు. 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును మాథ్యూ షార్ట్(63), మార్నస్ లబుచానే(47)లు గట్టెక్కించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 95 పరుగులు జోడించారు.

ALSO READ | ENG vs AUS: బెన్ డకెట్ 165.. ఆస్ట్రేలియా ఎదుట భారీ టార్గెట్

అనంతరం14 పరుగుల వ్యవధిలో వీరిద్దరూ వెనుదిరిగినా.. క్రీజులోకి వచ్చిన జోష్ ఇంగ్లిస్(120 నాటౌట్), అలెక్స్ కారీ(69) ఇంగ్లీష్ జట్టు ఆశలపై నీళ్లు చల్లారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 146 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. అక్కడే మ్యాచ్ ఇంగ్లాండ్ చేతుల్లోంచి జారిపోయింది. చివరలో క్యారీ ఔటైనా.. మ్యాక్స్‌వెల్(15 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటికి ఇంగ్లీష్ బౌలర్లు మిన్నకుండి పోయారు. ఓవర్‌కు రెండేసి.. మూడేసి సిక్సర్లు బాదారు. పాపం ఇంగ్లాండ్ బౌలర్ల కష్టాలు చూసి స్టేడియంలోని ప్రేక్షకులు చలించిపోయారు. మరో 15 బంతులు మిగిలివుండగానే లక్ష్యాన్ని చేరుకున్నారు.

బెన్ డకెట్.. 165

అంతకుముందు ఇంగ్లాండ్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇంగ్లీష్ ఓపెనర్ బెన్ డకెట్ (165; 143 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ శతకంతో విరుచుకుపడ్డాడు. జో రూట్ (68; 78 బంతుల్లో 4 ఫోర్లు) రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ద్వార్షుయిస్ 3, లబుచానే 2, జంపా 2, మ్యాక్స్ వెల్ ఒక వికెట్ పడగొట్టారు.