
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ.. భారత జట్టు మ్యాచ్‌లు దుబాయి గడ్డపై జరుగుతున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్‌లో ఆడేందుకు బీసీసీఐ నిరాకరించడంతో.. ఐసీసీ ఈ ఏర్పాట్లు చేసింది. టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో జరిగేలా పాకిస్థాన్‌ను ఒప్పించి.. దుబాయ్ స్టేడియంలో టీమిండియా మ్యాచ్‌లు నిర్వహిస్తోంది. ఈ నిర్ణయం కొన్ని జట్లకు రుచించడం లేదు. ఒకే వేదికగా మ్యాచ్‌లు ఉండటం.. భారత్‌కు అడ్వాంటేజ్‌గా మారిందని వాపోతున్నారు.
ఈ వాదనను మొదట ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మొదలు పెట్టాడు. ఒకే వేదికలో మ్యాచ్‌లు ఆడటం ద్వారా భారత జట్టుకు అదనపు ప్రయోజనం కలుగుతోందని వ్యాఖ్యానించాడు. ఇక ఆఫ్గనిస్తాన్ చేతిలో ఇంగ్లాండ్ ఓటమి పాలవ్వడంతో ఆ దేశ మాజీ క్రికెటర్లు మైఖేల్ అథర్టన్, వాన్ వంటి పలువురు దీన్ని పదే పదే వివాదాస్పదం చేస్తున్నారు. దుబాయి వేదిక విషయంలో బీసీసీఐ తెలివి తేటలు అద్భుతంగా పనిచేస్తున్నాయని సెటైర్లు విసురుతున్నారు.
తాజాగా, ఈ విషయంపై స్పందించిన హెర్షల్ గిబ్స్.. అడ్వాంటేజ్ అన్న వాదనను తప్పుబట్టాడు. ఇటువంటి విమర్శలు రావడం సహజం అన్నాడు. ఆటగాళ్లు ఇవేమి పట్టించుకోకుండా ఆటపై ఫోకస్ పెట్టాలని సూచించాడు.
"దుబాయ్‌లో మ్యాచ్‌లు భారత జట్టుకు అడ్వాంటేజ్ అన్న వ్యాఖ్యలు నేనూ విన్నాను. పెద్ద పెద్ద టోర్నీల్లో ఇటువంటివి సహజం. టీమిండియా మ్యాచ్‌లు తటస్థ(దుబాయి) వేదికపై జరుగుతాయనే విషయం టోర్నీకి ముందు అన్ని జట్లకు తెలుసు. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. కొన్ని సందర్భాల్లో ఐసీసీ ఈవెంట్లకు రెండు, మూడు దేశాలు ఆతిథ్యమిస్తాయి. అప్పుడు ఇటువంటివి ఎందుకు రాలేదు. ఏర్పాట్లకు తగ్గట్లు ఆడటంపై ఫోకస్ పెట్టాలి. ఒకే వేదికగా మ్యాచ్‌లు జరిగినంత మాత్రానే విజయాలు ఊరికే దక్కవు. ఏ జట్టైనా మెరుగైన ప్రదర్శన చేస్తేనే గెలుస్తుంది. ఇరు జట్లు ఒకే వేదికపై ఆడినప్పుడు.. ఒకరికే అడ్వాంటేజ్ ఎలా లభిస్తుంది.." అని హెర్షల్ గిబ్స్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML) సందర్భంగా అన్నాడు.