IND vs BAN: అక్షర్ హ్యాట్రిక్ మిస్.. సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్

IND vs BAN: అక్షర్ హ్యాట్రిక్ మిస్.. సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్

దుబాయ్‌ వేదికగా భారత్, బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతోన్న మ్యాచ్ త్వరగానే ముగిసేలా కనిపిస్తోంది. మ్యాచ్‌కు ముందు పెద్ద పెద్ద స్టేట్‌మెంట్లు ఇచ్చిన బంగ్లా క్రికెటర్లు.. మైదానంలో ఆ సత్తా చూపెట్టలేకపోతున్నారు. భారత బౌలర్లను ఎదుర్కోలేక పెవిలియన్ బాట పడుతున్నారు. ఆట ప్రారంభమైన మొదటి గంటలోనే సగం మ్యాచ్ అయిపోయింది.

5 వికెట్లు.. 

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ పవర్ ప్లే ముగిసేలోపే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. బ్యాటింగ్ మొదలైన ఫ‌స్ట్‌, సెకండ్ ఓవ‌ర్లలోనే 2 వికెట్లు పడ్డాయి. ష‌మీ వేసిన తొలి ఓవ‌ర్‌లో సౌమ్యా స‌ర్కార్(0) అవుట్ కాగా, రాణా వేసిన రెండో ఓవ‌ర్‌లో న‌జ్మల్ శాంటో(0) ఔట్ అయ్యాడు. దాంతో, బంగ్లా కేవ‌లం రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో తంజిత్‌ హసన్(25), మెహిదీ హసన్(5) జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. షమీ మరోసారి దెబ్బకొట్టాడు. ఏడో ఓవర్ రెండో బంతికి గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి మెహిదీ హసన్‌ (5) ఔటయ్యాడు. దాంతో, బంగ్లా మూడో వికెట్‌ కోల్పోయింది. 

Also Read :- 2 ఓవర్లు, 2 పరుగులు, 2 వికెట్లు.. తడబడుతోన్న బంగ్లాదేశ్

అక్షర్ హ్యాట్రిక్ మిస్

26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన బంగ్లాను అక్షర్ పటేల్ మరింత కష్టాల్లోకి నెట్టాడు. 9వ ఓవర్‌లో వరుస బంతుల్లో తంజిద్‌ హసన్(25), ముష్ఫికర్‌(0)ను ఔట్ చేశాడు. ఆ మరుసటి బంతికి జాకర్ అలీ ఇచ్చిన క్యాచ్‌‌ను రోహిత్ చేజార్చాడు. లేదంటే అక్షర్‌కు హ్యాట్రిక్‌ దక్కేది. క్యాచ్ జారవిడిచినందుకు రోహిత్.. క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం బంగ్లా స్కోర్.. 10 ఓవర్లకు బంగ్లాదేశ్ స్కోరు 39/5.