Team India: మనోళ్లు బొమ్మా, బొరుసు ఆడలేదా ఏంటి?.. వరుసగా 11 టాసుల్లో ఓటమి

Team India: మనోళ్లు బొమ్మా, బొరుసు ఆడలేదా ఏంటి?.. వరుసగా 11 టాసుల్లో ఓటమి

భారత కెప్టెన్లు టాసుల్లో ఓడుతున్న తీరు చూస్తుంటే.. వీరికి బొమ్మ, బొరుసు ఆటపై బొత్తిగా అవగాహన లేదని తెలుస్తోంది. ఒకటి.. రెండా.. ఏకంగా వరుసగా 11 టాసుల్లో ఓడటమేంటండి. ఈ విషయంలో మన తెలుగోళ్లే గొప్ప. బొమ్మ, బొరుసు ఆటలో ఇరగదీస్తారంటే నమ్మాలి. ఈకాలం పిల్లలకు ఈ  ఆట తెలియకపోవచ్చు కానీ ఓ ఇరవైయేళ్లు వెనక్కి వెళ్తే.. శివరాత్రి రోజు గల్లీల్లో బొమ్మ, బొరుసు ఆటాడే బరులు కనిపించేవి. ఆ రోజులే వేరు.

పదకొండో ఓటమి.. రోహిత్ నవ్వులు

2023 ఐసీసీ ప్రపంచ కప్ ఫైనల్లో ప్రారంభమైన టీమిండియా టాసుల ఓటమి పరంపర.. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కొనసాగుతోంది. గురువారం(ఫిబ్రవరి 20) దుబాయ్‌ వేదికగా భారత్, బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతోన్న మ్యాచ్‌లో టాస్ గెలిచి రోహిత్ దానికి ముగింపు పలుకుతాడనుకుంటే.. అంతా రివర్స్ అయ్యింది. మన కెప్టెన్ ‘హెడ్స్’ అనగానే.. పడే కాయిన్ కూడా రివర్స్‌లో పడింది. అదీ మన అదృష్టం. 

Also Read :- అక్షర్ హ్యాట్రిక్ మిస్.. సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్

మధ్యలో దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లాండ్‌ జట్లతో వన్డే సిరీసులలోనూ టాసుల్లో ఓటములే. అప్పుడప్పుడు కెప్టెన్లు మారుతున్నా.. ఫలితం మాత్రం ఒక్కటే. ‘టాస్ ఓడిన టీమిండియా’.. ఇదే తంతు. 

నెదర్లాండ్స్ రికార్డు సమం

టాస్ కరెక్ట్‌గా గెస్ చేయటంలో  మనకంటే మేధావులు మరొకరు ఉన్నారు. ఆ వీరులు నెదర్లాండ్స్ కెప్టెన్లు. ఆ రికార్డును మనోళ్లు ఇప్పుడు సమం చేశారు. క్రిక్‌బజ్ కథనం ప్రకారం, వన్డేల్లో భారత్ వరుసగా 11 టాస్‌లు ఓడిపోవడం.. నెదర్లాండ్స్‌తో సమం అయ్యింది. డచ్ జట్టు.. మార్చి 2011 నుండి ఆగస్టు 2013 మధ్య11 టాసుల్లో ఓడిపోయింది.