IND vs BAN: బంగ్లాపై ఘన విజయం.. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా బోణి

IND vs BAN: బంగ్లాపై ఘన విజయం.. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా బోణి

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా బోణి కొట్టింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. మొదట బంగ్లాదేశ్ 228 పరుగులు చేయగా.. స్వల్ప లక్ష్యాన్ని భారత్ 4 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (101 నాటౌట్; 129 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ చేశాడు.

ఆరంభంలో రోహిత్(41), గిల్(101 నాటౌట్) దూకుడు చూసి టీమిండియా 30 ఓవర్లలోపే మ్యాచ్ ముగుస్తుందని అంతా అనుకున్నారు. అటువంటిది హిట్‌మ్యాన్ ఔట్ అవ్వగానే.. తరువాత వచ్చిన వారు మ్యాచ్‌ను చప్పగా మార్చేశారు. పవర్ ప్లే తరువాత పెద్దగా బౌండరీలు వచ్చిందే లేదు. బౌండరీ లైన్ పెద్దది కావడంతో సింగిల్స్‌కే ప్రాధాన్యమిచ్చారు. మెల్లమెల్లగా ఆడుకుంటూ చివరకు 46.3 ఓవర్ల వద్ద మ్యాచ్ ముగించారు. విరాట్ కోహ్లీ(22), శ్రేయాస్ అయ్యర్(8) నిరాశ పరచగా.. రాహుల్ (41 నాటౌట్) పర్వాలేదనిపించాడు.

తౌహిద్ హృదోయ్ సెంచరీ

అంతకుముందు బంగ్లాదేశ్‌ 49.4 ఓవర్లలో 228 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆరంభంలో బంగ్లా బ్యాటర్లకు చుక్కలు చూపించిన భారత బౌలర్లు.. తరువాత అలసత్వం వహించారు. దాన్ని అవకాశంగా బంగ్లా 200 పైచిలుకు పరుగులు చేసింది. పవర్ ప్లే ముగిసేసరికి బంగ్లా స్కోర్.. 39/5. అటువంటిది 228 పరుగులు చేయగలిగారంటే.. మనోళ్లు ఎంత లైట్ తీసుకున్నారో అర్థం చేసుకోవాలి.

ALSO READ | IND vs BAN: 5 వికెట్లతో చెలరేగిన షమీ.. హృదయ్ సెంచరీతో బంగ్లాదేశ్ డీసెంట్ టోటల్

మిడిలార్డర్ బ్యాటర్‌ తౌహిద్ హృదోయ్ (100) ఏకంగా సెంచరీ బాదాడు. తొలి ఛాంపియన్స్ ట్రోఫీ అతనికిది. తౌహిద్ కు స్పిన్నర్ జకేర్ అలీ (68) మంచి సహకారం అందించాడు. వీరిద్దరూ ఆరో వికెట్ కు 154 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో షమీ 5, హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు.

భారత జట్టు తదుపరి మ్యాచ్‌లో ఆదివారం(ఫిబ్రవరి 23) పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు దుబాయి వేదిక.