
ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ ఏ సెమీ-ఫైనలిస్టులు ఎవరో తేలిపోయింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తు చేసిన న్యూజిలాండ్.. భారత్‌తో పాటు సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. దాంతో ఆతిథ్య పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు అధికారికంగా టోర్నీ నుండి నిష్క్రమించాయి.
సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కివీస్ ఆటగాళ్లు ఔరా అనిపించారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ అదరగొట్టారు. బౌలింగ్‌లో మైఖేల్ బ్రేస్‌వెల్ 4 వికెట్లు పడగొట్టి బంగ్లాను దెబ్బకొట్టగా.. ఛేదనలో యువ బ్యాటర్ రచిన్ రవీంద్ర సెంచరీ బాదాడు. 105 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 112 పరుగులు చేశాడు. ఈ ఓటమితో బంగ్లాదేశ్ పోతూ పోతూ పాకిస్తాన్‌ను వెంటబెట్టకెళ్లింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో బంగ్లా గెలిచుంటే.. అప్పుడు మూడు జట్లకు సెమీస్ అవకాశాలు ఉండేవి.
తడబడిన బంగ్లా బ్యాటర్లు
అంతకుముందు చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లోనూ బంగ్లా బ్యాటర్లు నిరాశ పరిచారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (77; 110 బంతుల్లో 9 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ఆఖర్లో జాకెర్ అలీ (45), రిషాద్ హొస్సేన్ (26) రాణించడంతో బంగ్లా ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. కివీస్ బౌలర్లలో బ్రేస్‌వెల్ 4 వికెట్లు తీయగా, విలియం ఓ రూర్క్ 2, కైల్ జేమీసన్, మ్యాట్ హెన్రీ చెరో వికెట్ పడగొట్టారు.
రఫ్ఫాడించిన రచిన్
ఛేదనలో విల్ యంగ్(0), కేన్ విలియంసన్(5)లను ఔట్ చేశామన్న ఆనందం తప్ప బంగ్లా ఆటగాళ్లకు మిగిలిందేమీ లేదు. రెండు వికెట్లు పడటంతో తొలుత జాగ్రత్తగా ఆడిన న్యూజిలాండ్ బ్యాటర్లు.. పవర్ ప్లే చివరలో బౌండరీల మోత మోగించారు. డెవాన్ కాన్వే(30), రచిన్ రవీంద్ర (112) ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలు రాబట్టారు. అయితే, 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కాన్వే ఔటయ్యాడు. ఆ సమయంలో మ్యాచ్ కాస్త మజా అనిపించింది. కానీ, ఆ ఉత్కంఠ ఎంతోసేపు నిలవలేదు. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన రచిన్.. టామ్ లాథమ్(55)తో కలిసి జట్టు స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. చివరలో రచిన్, లాథమ్ ఔటైనా.. గ్లెన్ ఫిలిప్స్(21 నాటౌట్), మైఖేల్ బ్రేస్‌వెల్(11 నాటౌట్) జోడి జాగ్రత్తగా ఆడుతూ మ్యాచ్ ముగించారు.
గ్రూప్ - ఏలో ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఫిబ్రవరి 27న పాక్- బంగ్లాదేశ్ జట్లు తలపడనుండగా.. మార్చి 02న భారత్- న్యూజిలాండ్ మ్యాచ్ జరగనుంది.