Champions Trophy: ఆరంభ మ్యాచ్‌లోనే పాకిస్తాన్ ఓటమి.. మూగబోయిన కరాచీ స్టేడియం

Champions Trophy: ఆరంభ మ్యాచ్‌లోనే పాకిస్తాన్ ఓటమి.. మూగబోయిన కరాచీ స్టేడియం

డిఫెండింగ్ ఛాంపియన్, ఆతిథ్య పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ(2025) తొలి మ్యాచ్‌లోనే ఓటమి పాలైంది. బుధవారం(ఫిబ్రవరి 19) కరాచీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో పాక్ 60 పరుగుల తేడాతో చిత్తయ్యింది. మొదట బ్యాటింగ్ కివీస్ 320 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో పాకిస్థాన్ 260 పరుగులకే కుప్పకూలింది. ఆతిథ్య జట్టు ఓటమి పాలవ్వడంతో కరాచీ స్టేడియంలో చడీ చప్పుడు లేకుండా పోయింది. సొంత అభిమానులందరూ నిరాశతో ఇంటి బాట పట్టారు.

నష్టపరిచిన ఐసీసీ రూల్.. 

నిజానికి భారీ ఛేదనలో పాకిస్థాన్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. గాయం కారణంగా ఫకర్‌ జమాన్ ఆట ప్రారంభమైన రెండో బంతికే మైదానాన్ని వీడటంతో.. అతన్ని ఓపెనింగ్ చేయడానికి అంపైర్లు అనుమతించలేదు. ఈ నిర్ణయం పాక్‌ను బాగా నష్ట పరిచింది. ఓపెనర్‌గా వచ్చిన సౌద్ షకీల్ 6 పరుగులకే వెనుదిరిగాడు. ఆపై కొద్దిసేపటికే రిజ్వాన్(3), ఫఖర్ జమాన్(24)లు  ఔట్ అవ్వడంతో.. ఆతిథ్య జట్టుకు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి.   
 
69 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లోపు ఆడిన పాక్‌ను బాబర్ అజాం(64)- సల్మాన్ ఆఘా(42) ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 58 పరుగులు జోడించారు. దాంతో, పాక్ ట్రాక్‌లోకి వచ్చినట్టే కనిపించింది. ఆ సమయంలో నాథన్ స్మిత్ దెబ్బకొట్టాడు. నిలకడగా ఆడుతోన్న ఆఘాను పెవిలియన్ చేర్చాడు. అక్కడి నుంచి వరుస విరామాల్లో పాక్ వికెట్లు కోల్పోతూనే వచ్చింది. చివరలో ఖుష్దిల్ షా(69) కాసేపు పోరాడినా.. అతనికి మరో ఎండ్ నుంచి సహకారం లేకపోవడం జట్టును ఓటమికి చేర్చింది. చివరలో హారిస్ రౌఫ్, నసీమ్ షా ఇద్దరు నాలుగు సిక్సర్లు బాది సొంత అభిమానుల్లో కాసింత చిరునవ్వు తెప్పించారు. 

Also Read : తెలంగాణలో క్రికెట్ అభివృద్ధికి.. SRH సహకారం

కివీస్ బౌలర్లలో సాంట్నర్, ఓరూర్క్ మూడేసి వికెట్లు తీసుకోగా.. మాట్ హెన్రీ 2, బ్రేస్‌వెల్, నాథన్ స్మిత్ చెరో వికెట్ పడగొట్టారు.

ఇద్దరు శతకాలు

అంతకుముందు న్యూజిలాండ్‌ భారీ స్కోరు చేసింది. డేవాన్‌ కాన్వే (10), కేన్‌ విలియమ్సన్‌ (1), డారిల్‌ మిచేల్‌ (10) త్వరగా ఔటైనా.. విల్ యంగ్(107), టామ్ లాథమ్(118*) సెంచరీలు చేశారు. వీరికి తోడు చివరలో గ్లెన్ ఫిలిప్స్(39 బంతుల్లో 61; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు అర్ధ శతకం బాదాడు. దాంతో, కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 320 పరుగుల భారీ స్కోర్ చేసింది.

గురువారం (ఫిబ్రవరి 20) దుబాయ్ వేదికగా భారత్‌, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి.