ఇలా అయితే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కష్టం.. పాకిస్థాన్కు షాకివ్వనున్న ICC

ఇలా అయితే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కష్టం.. పాకిస్థాన్కు షాకివ్వనున్న ICC

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB )కు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణను పాకిస్థాన్ నుంచి షిఫ్ట్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ట్రోఫీ నిర్వహణకు పీసీబీ ఇంకా పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేదని నివేదికల ద్వారా తెలుస్తోంది. సమయం దగ్గర పడుతున్నా.. ఇప్పటికీ ఏర్పాట్లు పూర్తి చేయలేకపోవడంతో ఇక 2025 ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ పాకిస్థాన్ తో అయ్యేలా లేదనే నిర్ధారణకు ఐసీసీ వచ్చినట్లు స్పష్టమవుతోంది.

ICC ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుండగా, వేదికల పరిస్థితులు తీవ్ర నిరాశ కలిగిస్తున్నాయి. ఇప్పటికీ  స్టేడియాల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు.అయితే వన్డే ట్రై-సిరీస్‌ను లాహోర్, కరాచీలకు మార్చి పనులు పూర్తి చేయాలని పీసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. టోర్నమెంట్ ప్రారంభానికి కొద్దిసమయం మాత్రమే మిగిలి ఉండగా  అంతర్జాతీయ ప్రమాణలకు అనుగుణంగా లేని లాహోర్, కరాచీ, రావల్పిండి స్టేడియాలలో నిర్వహణ అంటే కష్టమేనని ఐసీసీ నిర్ధారించింది. స్టేడియాలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయని, ప్లాస్టింగ్ పనులు కూడా పూర్తికాలేదని.. ఇంకా ఫ్లడ్‌లైట్లు ఎప్పుడు అమరుస్తారు.. ప్రేక్షకులకు సీట్లు, ఇతర కనీస అవసరాలకు సంబంధించిన ఏర్పాట్లు ఎప్పుడు చేస్తారనే సందేహం మొదలైంది. 

 ICC ప్రమాణాలకు అనుగుణంగా పనులు త్వరగా పూర్తి చేయాల్సిన బాధ్యత పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై (PCB) ఉంది. కానీ వాతావరణ పరిస్థితులు కూడా పనుల వేగాన్ని అడ్డుకుంటున్నాయి. గడ్డాఫీ స్టేడియంలో డ్రెస్సింగ్ రూమ్‌లు, ఆటగాళ్ల కోసం ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లు ఇంకా పూర్తి కావడం లేదు.ఈ పరిస్థితులలో, PCB  వన్డే ట్రై-సిరీస్‌ను ముల్తాన్ నుంచి లాహోర్, కరాచీలకు మార్చింది. స్టేడియాల రినోవేషన్ పనులు వేగవంతం చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్, న్యూజీలాండ్, దక్షిణాఫ్రికా దేశాల మధ్య జరిగే ఈ ట్రై-సిరీస్‌ కు గడువులోగా పనులు పూర్తవుతాయి అనే పరిస్థితి లేదు.

వాస్తవానికి అంతర్జాతీయ మ్యాచ్ లు, సీరీస్ లు ఉన్నపుడు ఏ దేశమైనా వేదికలను ముందుగానే పూర్తి చేసి ఐసీసీకి అప్పగించాల్సి ఉంటుంది. అలా ఇచ్చినపుడు షెడ్యూల్ ప్రకారం ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా మ్యా్చ్ లు నిర్వహించడం సాధ్యమవుతుంది. కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పరిస్థితి చూస్తుంటే.. గడువు ప్రకారం ఐసీసీకి వేదికలను అప్పగించే పరిస్థితుల్లో లేదు. ఇదే జరిగితే టోర్నమెంట్ ను ఇతర దేశాలకు తరలించాల్సి ఉంటుంది.  అయితే పీసీబీ ఇప్పటికప్పుడు అందించే పరిస్థితుల్లో లేనందున.. టోర్నమెంటును పూర్తిగా దుబాయ్ కు మార్చే యోచనలో ఐసీసీ ఉన్నట్లు తెలుస్తోంది.