
- వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి ప్రతీకారంపై రోహిత్‌సేన గురి
- మ. 2.30 నుంచి స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్–18, జియో హాట్‌స్టార్‌లో లైవ్
దుబాయ్: సరిగ్గా 17 నెలల కిందట స్వదేశంలో వరుసగా తొమ్మిది విజయాలు సాధించి వన్డే వరల్డ్ కప్ అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచిన టీమిండియాను ఆఖరాటలో ఆస్ట్రేలియా దెబ్బకొట్టింది. అదే ఏడాది వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్, 2015 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లోనూ కంగారూ టీమ్ చేతిలో ఎదురుదెబ్బలే. ఇప్పుడు వీటికి ప్రతీకారం తీర్చుకునేందుకు టీమిండియా సిద్ధమైంది. గత చరిత్ర ప్రతికూలంగా ఉన్నా.. తమ అమ్ములపొదిలోని స్పిన్ అస్త్రాన్ని ప్రయోగించి మంగళవారం జరిగే చాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో కంగారూ టీమ్‌ను కంగారెత్తించాలని ఫిక్స్ అయింది. ఐసీసీ టోర్నీల నాకౌట్ మ్యాచ్‌ల్లో ఆ టీమ్ చేతిలో వరుస పరాజయాలకు చెక్ పెడుతూ మెగా టోర్నీలో ఫైనల్ చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, అది అనుకున్నంత సులువు కాబోదు. మెగా ఈవెంట్లలో మెరుగైన రికార్డు ఉన్న ఆసీస్ ఈసారి కమిన్స్, హేజిల్‌వుడ్, స్టార్క్, స్టోయినిస్ లాంటి సూపర్ స్టార్లు లేకుండానే టోర్నీలో సెమీస్ చేరుకుంది. తమ తొలిపోరులోనే ఇంగ్లండ్ ఇచ్చిన 352 రన్స్ టార్గెట్‌ను ఛేజ్ చేసి ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపించింది. అయితే, గత రెండు మ్యాచ్‌ల్లో ఒకటి వర్షంతో రద్దవగా.. మరోదాంట్లో ఫలితం తేలలేదు. దాంతో సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండానే సెమీస్‌లో బరిలోకి దిగుతోంది. ఇంకోవైపు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ హ్యాట్రిక్ విజయాలు సాధించిన ఇండియా ఫుల్ జోష్‌లో ఉంది. అదే జోరును ఆసీస్‌పైనా కొనసాగిస్తే రోహిత్‌సేనను ఫైనల్లో చూడొచ్చు.
స్పిన్‌తో కొట్టేయాలని..
ఇండియా చివరగా 2011 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్లో కంగారూ టీమ్ గెలిచింది. 14 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ టోర్నీ నాకౌట్ స్టేజ్‌లో ఆ టీమ్‌ను ఓడించేందుకు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇందుకు ప్రధాన కారణం స్పిన్నర్లే. ఈ టోర్నీకి ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడంపై విమర్శలు వచ్చినా నెమ్మదైన దుబాయ్ పిచ్‌లపై ఇది మాస్టర్‌స్ట్రోక్‌గా మారింది. అలాగే, తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతూ ఇక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఏర్పరుచుకోవడం ఇండియాకు ప్లస్ పాయింట్ అయింది. దాంటో పాటు పిచ్‌లకు అనుగుణంగా ఆటగాళ్లు తమ నైపుణ్యాన్ని మార్చుకోవడం వల్లే విజయాలు వస్తున్నాయి. ఇక్కడి స్లో వికెట్లపై పెద్దగా టర్న్ లభించకపోవడంతో ఇండియా స్పిన్నర్లు ఓపికతో బౌలింగ్ చేస్తూ ఫలితం రాబడుతున్నారు.
స్పిన్ త్రయం కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌కు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తోడవ్వడంతో ఇండియా బౌలింగ్ మరింత బలోపేతం అయింది. ఈ నలుగురూ ఆదివారం న్యూజిలాండ్‌పై తొమ్మిది వికెట్లు పడగొట్టారు. 37.3 ఓవర్లు బౌలింగ్ చేసిన స్పిన్నర్లు 128 డాట్ బాల్స్ వేయడంతో కివీస్ బ్యాటర్లు ఉక్కిరిబిక్కిరయ్యారు. కివీస్‌పై ఆడిన తుది జట్టునే కొనసాగిస్తూ కంగారూలపైనా నలుగురు స్పిన్నర్లతో ఇండియా దాడి చేయాలని చూస్తోంది. మన స్పిన్నర్లు ఇదే జోరును కొనసాగిస్తే ఆసీస్‌ను బ్యాటర్లను అడ్డుకోవచ్చు. అయితే, కివీస్‌తో మ్యాచ్‌లో మూకుమ్మడిగా నిరాశపరిచిన టాప్3 బ్యాటర్లు రోహిత్, గిల్, కోహ్లీ కంగారూలపై సత్తా చాటాల్సిన అవసరం ఉంది. శ్రేయస్‌తో పాటు ఆల్‌రౌండర్లు అక్షర్, హార్దిక్ ఫామ్‌లో ఉండటం సానుకూలాంశం. కేఎల్ రాహుల్ కూడా బ్యాట్ ఝుళిపించి.. పేసర్ షమీ సైతం మెప్పిస్తే జట్టుకు తిరుగుండదు.
బ్యాటింగ్‌లో బలంగా ఆసీస్
కీలక ప్లేయర్లు లేకపోయినా.. ఐసీసీ ఈవెంట్లలో ముఖ్యంగా ఇండియాపై ఆస్ట్రేలియా రెచ్చిపోయి ఆడుతుంది. డబ్ల్యూటీసీ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీతో ఇండియాకు చేదు జ్ఞాపకాలు మిగిల్చిన ఆ టీమ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను ముందుగా కట్టడి చేయాల్సి ఉంటుంది. స్పిన్ బౌలింగ్‌ను మెరుగ్గా ఎదుర్కొనే మ్యాక్స్‌వెల్‌తో కూడా రోహిత్‌సేనకు ముప్పు ఉంది. ఇండియాపై స్టీవ్ స్మిత్‌కు మంచి రికార్డుంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఆకట్టుకున్న ఓపెనర్ మాథ్యూ షార్ట్ గాయంతో దూరం అవ్వడంతో ఆ టీమ్‌కు ఇబ్బంది అయినా అతని ప్లేస్‌లో తుది జట్టులోకి వచ్చే ఫ్రేజర్ మెక్‌గర్క్ మంచి హిట్టర్. అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్ కూడా నాణ్యమైన బ్యాటర్లే కాబట్టి ఇండియా బౌలర్లు క్రమశిక్షణతో బంతులు వేయాల్సి ఉంటుంది. అయితే, బౌలింగ్‌లో ఆసీస్ వీక్‌గా ఉంది. ఆడమ్ జంపా రూపంలో ఒక్కడే ప్రధాన స్పిన్నర్ ఉన్నాడు. పార్ట్‌టైమ్ స్పిన్నర్లుగా హెడ్, మ్యాక్స్‌వెల్ అతనికి సాయం చేయనున్నారు. ఆసీస్ మిగతా బౌలర్లు ఏ మేరకు
రాణిస్తారో చూడాలి.
పిచ్/వాతావరణం
పాకిస్తాన్‌తో ఇండియా ఆడిన వికెట్‌ను ఈ మ్యాచ్ కోసం ఉపయోగిస్తారు. ఆట సాగుతున్న కొద్దీ ఇక్కడి పిచ్‌లు నెమ్మదిస్తున్నాయి కాబట్టి స్పిన్నర్ల పాత్ర కీలకం కానుంది. మంచు ప్రభావం లేనందున టాస్ నెగ్గిన జట్టు బ్యాటింగ్‌కు మొగ్గు చూపొచ్చు. మంగళవారం వాతావరణం కాస్త వేడిగా ఉండనుంది. వర్ష సూచన లేదు.
తుది జట్లు (అంచనా)
ఇండియా: రోహిత్ (కెప్టెన్),గిల్, కోహ్లీ, శ్రేయస్, అక్షర్, రాహుల్ (కీపర్), హార్దిక్ , జడేజా, కుల్దీప్, షమీ, చక్రవర్తి.
ఆస్ట్రేలియా: హెడ్, ఇంగ్లిస్ (కీపర్), స్మిత్ (కెప్టెన్), లబుషేన్, మెక్‌గర్క్/కూపర్, క్యారీ, మాక్స్‌వెల్, డ్వారిషస్, నేథన్ ఎలీస్, జంపా, స్పెన్సర్ జాన్సన్.