Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో గందరగోళం.. దుబాయికి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో గందరగోళం.. దుబాయికి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు

ఛాంపియన్స్ ట్రోఫీలో గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయి. సెమీ ఫైనల్లో భారత ప్రత్యర్థి ఎవరనే దానిపై స్పష్టత రాకమునుపే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు దుబాయి చేరుకోనున్నాయి. ఇదే గందరగోళానికి దారి తీస్తోంది. నిజానికి ఈ రెండు జట్లలో ఒక జట్టు మాత్రమే భారత ప్రత్యర్థి. మరో జట్టు తమ సెమీ ఫైనల్ మ్యాచ్‌ను పాకిస్తాన్ గడ్డపైనే ఆడాల్సి ఉంది. అటువంటిది ఇరు జట్లను ఐసీసీ అధికారులు మొదట.. దుబాయి పంపుతున్నారు. ఎందుకిలా అనేది తెలుసుకుందాం.. 

భారత జట్టు సెమీ ఫైనల్ ప్రత్యర్థి ఎవరనేది ఆదివారం(మార్చి 2) స్పష్టత రానుంది. ఆదివారం గ్రూప్‌ ఏ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్, భారత్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారిదే అగ్ర స్థానం. అప్పుడు భారత్ Vs ఆస్ట్రేలియానా..? లేదా భారత్ Vs దక్షిణాఫ్రికానా అన్నది తెలుస్తుంది. దీనిపై స్పష్టత రాకముందే ఇరు జట్లు దుబాయి చేరుకోనున్నాయి. 

ALSO READ : Champions Trophy 2025: ఇంగ్లాండ్‌తో మ్యాచ్.. తుది జట్టులో బవుమాకు నో ఛాన్స్.. కారణం ఇదే!

క్రిక్ ఇన్ఫో నివేదిక ప్రకారం, ఆస్ట్రేలియా ఇప్పటికే దుబాయి బయలుదేరగా.. శనివారం(మార్చి 1) ఇంగ్లాండ్‌తో జరిగే చివరి గ్రూప్ మ్యాచ్ ముగిశాక ప్రోటీస్ జట్టు దుబాయ్‌ బయలుదేరనుంది.

రెండు జట్లు దుబాయి ఎందుకు..?

నిజానికి లీగ్ మ్యాచ్‌లకు.. సెమీస్ పోరుకు ఎక్కువ సమయం లేదు. ఆదివారం లీగ్ దశ ముగియనుండగా.. మంగళవారం(మార్చి 4) తొలి సెమీ ఫైనల్ జరగనుంది. ఇదే గందరగోళానికి ప్రధాన కారణం. భారత్- న్యూజిలాండ్ మ్యాచ్ ఫలితం తేలేదాక వేచిచూసే సమయం లేదు. మార్చి 4న భారత్‌తో జరిగే సెమీఫైనల్‌కు సిద్ధం కావడానికి తగినంత సమయం లభించేలా రెండు జట్లను గల్ఫ్ దేశానికి పంపాలని ఐసీసీ నిర్ణయించింది. రేపటి మ్యాచ్‌లో ఫలితం తేలిన తరువాత ఒక జట్టు తిరిగి పాకిస్తాన్ పయనం కానుంది. మార్చి 5న లాహోర్(పాకిస్తాన్) వారికి రెండవ సెమీఫైనల్ మ్యాచ్ ఉంది.

భారత్ ఫైనల్ చేరితే..

ఫైనల్ విషయంలోనూ దాదాపు ఇవే పరిస్థితులు. భారత జట్టు సెమీఫైనల్లో గెలిచి, ఫైనల్‌కు అర్హత సాధించింది అనుకుంటే.. టైటిల్ పోరు దుబాయి గడ్డపైనే. ఫైనల్‌కు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమిస్తుంది. అంటే, ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికాలో తిరిగి పాకిస్తాన్ చేరుకునే జట్టు సెమీఫైనల్లో గెలుస్తే.. మళ్లీ దుబాయికి పయనం కావాల్సి ఉంటుంది. ఇలా తిరుగుడే.. తిరుగుడు. 

  • మొదటి సెమీ ఫైనల్: దుబాయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం(దుబాయి)
  • రెండవ సెమీ ఫైనల్: గడాఫీ స్టేడియం(లాహోర్) 
  • ఫైనల్: దుబాయి/ పాకిస్తాన్ (భారత్ గెలిస్తే దుబాయిలో..)