Champions Trophy: సౌతాఫ్రికా- ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వర్షం అడ్డు.. రద్దయితే పరిస్థితి ఏంటి..?

Champions Trophy: సౌతాఫ్రికా- ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వర్షం అడ్డు.. రద్దయితే పరిస్థితి ఏంటి..?

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బుధవారం(ఫిబ్రవరి 25) ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా మధ్య జరుగుతోన్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. కనీసం టాస్ కూడా పడలేదు. మరో అరగంటలో టాస్ అనంగా మొదలైన వర్షం.. ఇప్పటికీ పడుతూనే ఉంది. దాంతో, ఈ మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి.

మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు భారీ నష్టమే. ప్రస్తుతానికి ఇరు జట్లు ఒక్కో మ్యాచ్‌లో గెలిచి ఉన్నాయి. ఆస్ట్రేలియా చిరకాల ప్రత్యర్థి ఇంగ్లాండ్‌ను ఓడించగా, దక్షిణాఫ్రికా.. ఆఫ్ఘనిస్తాన్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు సెమీస్‌కు చేరువవుతుంది. కావున ఇరు జట్లు ఫలితం తేలాలనే కోరుకుంటాయి. కానీ, జరుగుతున్న పరిమాణాలు చూస్తుంటే.. గుడ్ న్యూస్ ఏమీ లేదు. చినుకులు పడుతూనే ఉన్నాయి.

రాత్రి 10 వరకు వర్షమే..

రాత్రి 10 గంటల 25 నిమిషాల వరకు వర్షం అంతరాయం కలిగిస్తూనే ఉంటుందని వాతావరణ నివేదికలు చెప్తున్నాయి. సాయంత్రం 4 గంటలకు వర్షం పడే అవకాశం 46 శాతం ఉండగా.. 5 గంటల సమయంలో అది 49 శాతానికి పెరిగింది. ఇక 6 గంటల సమయంలో 54 శాతంగా..  8 గంటల సమయంలో 69 శాతంగా.. 9 గంటల సమయంలో 75 శాతంగా ఉంది. ఇలా రోజంతా వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. దాంతో, మ్యాచ్ రద్దయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.  

రద్దయితే.. అగ్రస్థానంలో దక్షిణాఫ్రికా

ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే.. ఇరు జట్లకు చెరొక పాయింట్ లభిస్తుంది. అప్పుడు రెండింటి ఖాతాలోనూ 3 పాయింట్లు ఉంటాయి. మెరుగైన నెట్ రన్‌రేట్ (+2.140)గా ఉన్న దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో.. (+0.475) నెట్ రన్‌రేట్ ఉన్న ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంటాయి. గ్రూప్ -బిలో మిగిలిన రెండు జట్లు ఇంగ్లాండ్, ఆఫ్గనిస్తాన్ ఇంకా రెండేసి మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నందున నాలుగు జట్లకు సెమీస్ చేరే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే గంటకు పైగా సమయం వృథా కావడంతో మ్యాచ్ ప్రారంభమైనా ఓవర్ల కుదింపు ఉంటుంది. 20 ఓవర్ల మ్యాచ్ జరగడానికి కటాఫ్ సమయం రాత్రి 7:32 నిముషాలు. ఆలోపు వరుణుడు శాంతిచకపోతే.. వర్షార్పణమైనట్టే.