
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్ కు చేరుకుంది. అంచనాలకు తగ్గట్టుగా ఆడుతూ వరుస విజయాలు సాధించి రాయల్ గా ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆదివారం (మార్చి 9) న్యూజిలాండ్ తో దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ఇద్దరు సీనియర్ ప్లేయర్లకు ఇదే చివరి ఐసీసీ టోర్నీ అనే అభిప్రాయలు వినిపిస్తున్నాయి. వారెవరో కాదు ఒకరు ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ కాగా.. మరొకరు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ లో వీరు అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే ఈ ట్రోఫీ తర్వాత వీరు మరో ఐసీసీ టోర్నీలో కనిపించకపోవచ్చు.
2027 వరకు జడేజా కష్టమే:
జడేజా ఇప్పటికే టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2024 టీ20 వరల్డ్ కప్ ను భారత్ గెలుచుకున్న తర్వాత కోహ్లీ, రోహిత్ శర్మతోపాటు జడేజా టీ20 లకు గుడ్ బై చెప్పాడు. భారత్ మరో ఐసీసీ టోర్నీ 2026 టీ20 వరల్డ్ కప్ సొంతగ్గడ్డపై ఆడనుంది. జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ టోర్నీ ఆడే అవకాశం లేదు. 2027లో సౌతాఫ్రికా వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఆ సమయానికి జడేజా అందుబాటులో ఉండకపోవచ్చు. ప్రస్తుతం జడేజా వయసు 36 సంవత్సరాలు. అక్షర్ పటేల్, వాషింగ్ టన్ సుందర్ జడేజాకు గట్టి పోటీనిస్తున్నారు. అతను క్రికెట్ లో ముందు ముందు కొనసాగడం కష్టంగానే కనిపిస్తుంది.
షమీకి ఫిట్ నెస్ సమస్యలు:
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ త్వరలో భారత క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలున్నాయి. అతని ఫిట్ నెస్ సమస్యలు అతని కెరీర్ ను వెనక్కి లాగుతున్నాయి. బహుశా షమీకి కూడా ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ చివరి ఐసీసీ టోర్నీ కావొచ్చు. 2026 టీ20 వరల్డ్ కప్ లు షమీని ఎంపిక చేసే అవకాశాలు లేవు. అర్షదీప్ సింగ్, బుమ్రా, హర్షిత్ రాణా లాంటి పేసర్లు టీ20 జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నారు. పైగా టీమిండియా యాజమాన్యం యంగ్ ప్లేయర్లపై దృష్టి పెడుతుంది. ఈ నేపథ్యంలో షమీ టీ20 వరల్డ్ కప్ కు చోటు దక్కించుకోవడం కష్టమే. 34 ఏళ్ళ షమీ 2027 లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ సమయానికి షమీ పూర్తి ఫిట్ నెస్ తో జట్టులో స్థానం సంపాదించడం దాదాపు ఆసాధ్యం.