
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి అతిథ్యమిస్తోన్న పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. దారుణమైన ఆటతో లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టిన దాయాది దేశానికి.. తాజాగా మరో షాక్ తగిలింది. ఆస్ట్రేలియా, భారత్ మధ్య 2025, మార్చి 4న జరిగిన సెమీస్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. కీలకమైన సెమీ ఫైనల్ పోరులో బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించిన రోహిత్ సేన.. కంగారులను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది. చాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఫైనల్‌కు చేరుకోవడంతో పాకిస్థాన్లో ఫైనల్ మ్యాచ్ నిర్వహించే అవకాశాన్ని దాయాది దేశం చేజార్చుకుంది.
ఎందుకంటే.. భద్రతా కారణాల దృష్ట్యా చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడే మ్యాచులు మొత్తం దుబాయ్‌లోనే నిర్వహిస్తు్న్నారు. ఇప్పుడు భారత్ ఫైనల్‌కు చేరుకోవడంతో చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ పోరు కూడా దుబాయ్ వేదికగానే జరగనుంది. ఈ సమీకరణాల నేపథ్యంలో.. ఎన్నో ఏండ్ల తర్వాత ఒక ఐసీసీ టోర్నీకి అతిథ్యం ఇచ్చిన పాకిస్థాన్‌కు భారత్ దెబ్బతో కీలకమైన ఫైనల్ మ్యాచ్ నిర్వహించే ఛాన్స్ లేకుండా పోయింది. దీంతో పాక్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తమ దేశ ఆటగాళ్ల తీరుతో లీగ్‌లోనే ఇంటిబాట పట్టిన మాకు.. భారత్ దెబ్బతో కనీసం సొంతగడ్డపై ఫైనల్ మ్యాచ్ చూసే అవకాశం లేకుండాపోయిందంటూ కుమిలిపోతున్నారు. ఇక, 2025, మార్చి 5వ తేదీన సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీ ఫైనల్ 2 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు 2025, మార్చి 9న దుబాయ్ వేదికగా భారత్‌తో ఫైనల్లో తలపడనుంది. సెమీస్ 2 పాకిస్థాన్‌లోనే జరగనుండగా.. ఈ మ్యాచులో గెలిచిన జట్టు వెంటనే దుబాయ్‌కి పయనం కావాల్సి ఉంటుంది.