IND vs AUS: బౌలింగ్ లేదు, బ్యాటింగే ఆసీస్ బలం.. హెడ్‌తో పాటు ఆ ఇద్దరిని ఔట్ చేస్తేనే!

IND vs AUS: బౌలింగ్ లేదు, బ్యాటింగే ఆసీస్ బలం.. హెడ్‌తో పాటు ఆ ఇద్దరిని ఔట్ చేస్తేనే!

ఆస్ట్రేలియా జట్టు మనకు కొరకరాని కొయ్యలా తయారయ్యింది. ప్రతి టోర్నీలోనూ అడ్డుతగులుతూ సై అంటే సై అంటోంది. బలమైన జట్టుతో ఆడితేనే కదా.. మన సత్తా తెలిసేది అన్న డైలాగులు చెప్పుకోవడానికి బాగానే ఉన్నా.. రికార్డులు మనకు అనుకూలంగా లేవు. గత రెండేళ్లలో రెండు ఐసీసీ ట్రోఫీలను మన చేతుల్లోంచి ఎగరేసుకుపోయారు. దాంతో, వారిని అంత తేలిగ్గా అంచనా వేయలేని పరిస్థితి. ఈ క్రమంలో ఆసీస్ బలాబలాలు, వారి ఫామ్‌పై ఓ లుక్కేద్దాం.

గ్రూప్‌ స్టేజ్‌లో టీమిండియా హ్యాట్రిక్ విజయాలు సాధించి జోరు మీదుంది. అందునా ఆడిన మూడు మ్యాచ్‌లు.. దుబాయి గడ్డపైనే. ఇది మనకు అనుకూలించే అంశం. మరోవైపు, ఆసీస్ ఆడిన మూడింటిలో ఒకదానిలో మాత్రమే విజయం సాధించింది. మరో రెండు మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దయ్యాయి.     

బ్యాటర్లే ఆసీస్ బలం

ఈ జట్టుతో ఆసీస్ గ్రూప్‌ స్టేజ్‌ కూడా దాటడం కష్టమే.. ఇదీ టోర్నీ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా స్క్వాడ్‌ను విశ్లేషకుల మాట. మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్‌ త్రయం లేకపోవడంతో ఆ జట్టును అందరూ తక్కువ అంచనా వేశారు. అయినప్పటికీ, ఆసీస్ తలవంచింది లేదు. జట్టులో స్పెషలిస్ట్ బౌలర్లు లేకున్నా.. ఒకే ఒక స్పిన్నర్(ఆడం జంపా) ఉన్నా వారితోనే నెట్టుకొస్తున్నారు.   

Also Read :- రెస్ట్ లేకుండానే టీమిండియా ప్రాక్టీస్

స్పెన్సర్ జాన్స్, నాథన్ ఎల్లిస్, డ్వారిషూస్.. ఈ ముగ్గురే ఆసీస్ పేసర్లు. వీరి పేస్(135- 140kmph) అంతంత మాత్రమే. వీరికి అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవమూ తక్కువే. గ్రూప్‌ స్టేజ్‌లో ఇంగ్లండ్‌ బ్యాటర్లు 350+ పరుగులు రాబట్టారంటే వీరు బౌలింగ్‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు అఫ్గానిస్థాన్‌ బ్యాటర్లు 270+ పరుగులు చేశారు. ఈ రెండు మ్యాచ్‌ల స్కోర్లను బట్టి ఆసీస్ పేస్.. భారత్‌తో పోలిస్తే బలహీనమని చెప్పుకోవచ్చు. 

హెడ్, ****,  ****..

ఈ టోర్నీలో ఆస్ట్రేలియా ప్రధానం బలం.. బ్యాటింగ్‌. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ మనకు అతిపెద్ద తలనొప్పి. భారత్ అంటేనే చెలరేగిపోయే ఈ ఆసీస్ హిట్టర్.. అఫ్గాన్‌పై హాఫ్ సెంచరీ సాధించి ఫామ్‌లోకి వచ్చాడు. ఇతగాడిని ఎంత త్వరగా ఔట్ చేస్తే టీమిండియాకు అంత మంచిది. మరో ఓపెనర్ మాథ్యూ షార్ట్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఇదీ మనకు మరీ మంచిది. ఆ దేవుడు కూడా మన పక్షానే ఉన్నారు. 

ఆసీస్ జట్టులో హెడ్‌తో పాటు మరో ఇద్దరు జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కేరీ అంత్యంత ప్రమాదకరం. వీరిద్దరూ హెడ్‌ మాదిరి దూకుడుగా ఆడే బ్యాటర్లు. వీరిని వీలైనంత త్వరగా పెవిలియన్ పంపితే ఆస్ట్రేలియాను ఒత్తిడిలోకి నెట్టొచ్చు. మరోవైపు స్టీవ్ స్మిత్. ప్రస్తుతానికి ఈ ఆసీస్ కెప్టెన్ ఫామ్‌‌లో లేకపోయినా..ఇతగాడు మంచి క్లాస్ ఆటగాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పరుగులు రాబట్టగలిగే సమర్థుడు. ఇతడిపైనా ఓ కన్ను వేయాల్సిందే.

సెమీఫైనల్‌కు ఆస్ట్రేలియా జట్టు(అంచనా): జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్.