ఇవాళ( మార్చి 2) న్యూజిలాండ్‌‌‌‌తో ఇండియా చివరి లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌

ఇవాళ( మార్చి 2) న్యూజిలాండ్‌‌‌‌తో ఇండియా చివరి లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌
  • నేడు న్యూజిలాండ్‌‌‌‌తో ఇండియా చివరి లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌
  • స్పిన్నర్లను మెరుగ్గా ఎదుర్కోవడంపై బ్యాటర్ల దృష్టి
  • మ. 2.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌‌‌‌, స్పోర్ట్స్‌‌‌‌-18,  జియో హాట్‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌లో లైవ్‌‌‌‌

దుబాయ్‌‌‌‌: వరుసగా రెండు విజయాలతో ఇప్పటికే  సెమీఫైనల్ చేరుకున్న టీమిండియా, న్యూజిలాండ్ ఆఖరి లీగ్‌‌‌‌ పోరుకు సిద్ధమయ్యాయి. ఆదివారం జరిగే గ్రూప్‌‌‌‌–ఎ చివరి మ్యాచ్‌‌‌‌లో గెలిచి టాప్ ప్లేస్ దక్కించుకోవాలని చూస్తున్నాయి. బంగ్లాదేశ్‌‌‌‌, పాకిస్తాన్‌‌‌‌ను చిత్తుగా ఓడించిన ఇండియా అదే జోరుతో కివీస్ పని పట్టాలన్న కృత నిశ్చయంతో బరిలోకి దిగనుంది. అదే సమయంలో నాకౌట్‌‌‌‌కు ముందు స్పిన్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ను ఎదుర్కొనే విషయంలో మరింత మెరుగవ్వాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది. కివీస్‌‌పై నెగ్గితే గ్రూప్ టాపర్‌‌‌‌‌‌‌‌గా నిలిచే ఇండియా  సెమీస్‌‌లో ఆస్ట్రేలియాను ఎదుర్కొనుంది. ఓడితే  సౌతాఫ్రికాతో తలపడనుంది. ఈ రెండు జట్లలోనూ నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నాయి. ఇంకోవైపు కొంతకాలంగా ఇండియా బ్యాటర్లు స్పిన్ బౌలింగ్‌‌‌‌లో అంత మెరుగ్గా ఆడలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కివీస్‌‌‌‌తో ఆఖరి పోరులో ఈ బలహీనతను సరిదిద్దుకొని సెమీస్‌‌‌‌కు పూర్తి బలంతో సన్నద్ధం కావాలని రోహిత్‌‌‌‌సేన భావిస్తోంది. బలమైన న్యూజిలాండ్‌‌‌‌ కూడా వరుసగా మూడో విజయంపై కన్నేసింది. 

రోహిత్‌‌‌‌, కుల్దీప్‌‌, షమీకి రెస్ట్‌‌‌‌!

ఒకప్పుడు స్పిన్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ను ఇరగదీసే టీమిండియా బ్యాటర్లు క్రమంగా టర్నింగ్‌‌‌‌ బాల్స్‌‌‌‌కు తడబడుతున్నారు. ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌‌‌‌ల్లో బంగ్లా, పాక్‌‌‌‌ స్పిన్నర్లతో మనోళ్లు జాగ్రత్తగా ఆడారు. తాజా పోరులో  న్యూజిలాండ్ స్పిన్నర్లు మిచెల్ శాంట్నర్‌‌‌‌‌‌‌‌, బ్రేస్‌‌‌‌వెల్‌‌‌‌ రూపంలో ఇండియా బ్యాటర్లకు అసలైన స్పిన్ పరీక్ష ఎదురవనుంది. పైగా దుబాయ్ వికెట్లు స్పిన్నర్లకు అనుకూలిస్తున్నాయి. గత రెండు మ్యాచ్‌‌‌‌ల్లో స్పిన్నర్ల బౌలింగ్‌‌‌‌లో సింగిల్స్‌‌‌‌, డబుల్స్‌‌‌‌కే పరిమితం అయిన మన బ్యాటర్లు.. పెద్ద షాట్లను పేసర్లపైనే ఉపయోగిస్తూ వచ్చారు. ఇప్పుడు శాంట్నర్‌‌‌‌‌‌‌‌, బ్రేస్‌‌‌‌వెల్‌‌‌‌ వేసే 20 ఓవర్లతో పాటు పార్ట్‌‌‌‌టైమ్ ఆఫ్​ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ గ్లెన్‌‌‌‌ ఫిలిప్స్‌‌‌‌ నుంచి కూడా సవాల్ తప్పదు. గతేడాది చివర్లో సొంతగడ్డపై టెస్టు సిరీస్‌‌‌‌లో 0–3తో వైట్‌‌‌‌వాష్​ అయిన ఇండియా శాంట్నర్‌‌‌‌‌‌‌‌, ఫిలిప్స్‌‌‌‌ను ఎదుర్కోలేక ఇక్కట్లు పడింది. ఇప్పుడు స్‌‌‌‌వెల్‌‌‌‌ కూడా వీళ్లకు తోడవ్వడంతో ఇండియాపై కివీస్‌‌‌‌ ముప్పేట దాడి
చేయనుంది.  

ఈ నేపథ్యంలో వన్డే నంబర్ వన్ బ్యాటర్ గిల్‌‌‌‌, పాకిస్తాన్‌‌‌‌పై సెంచరీ కొట్టిన కోహ్లీతో పాటు మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌లో శ్రేయస్ అయ్యర్‌‌‌‌‌‌‌‌, రాహుల్‌‌‌‌ ఆట ఇండియాకు కీలకం కానుంది. అదే సమయంలో ఇండియా స్పిన్నర్లు కూడా  దుబాయ్‌‌‌‌లో అదరగొడుతున్నారు.  జడేజా, అక్షర్‌‌‌‌‌‌‌‌, కుల్దీప్‌‌‌‌ ప్రత్యర్థి బ్యాటర్లను అద్భుతంగా నిలువరిస్తున్నారు. ఇక, పాకిస్తాన్‌‌‌‌ మ్యాచ్ సందర్భంగా కండరాల నొప్పితో ఇబ్బంది పడ్డ కెప్టెన్ రోహిత్‌‌‌‌ శర్మ, పేసర్ మహ్మద్ షమీకి మేనేజ్‌‌‌‌మెంట్ విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు గిల్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకోనుండగా.. రోహిత్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో పంత్‌‌‌‌, షమీ స్థానంలో అర్ష్‌‌‌‌దీప్ సింగ్ తుది జట్టులోకి రానున్నారు. గాయం నుంచి కోలుకొని వచ్చిన నేపథ్యంలో కుల్దీప్ స్థానంలో వరుణ్ చక్రవర్తిని ట్రై చేసే చాన్స్‌‌‌‌ కూడా ఉంది.

శాంట్నర్‌‌‌‌ సేనతో సవాలే

బంగ్లా, పాక్‌‌‌‌తో పోలిస్తే న్యూజిలాండ్‌‌‌‌ చాలా బలమైన జట్టు .  బ్యాటింగ్‌‌‌‌, బౌలింగ్‌‌‌‌లో పదునుగా ఉన్న ఈ టీమ్ నుంచి టీమిండియాకు అతి పెద్ద సవాల్‌‌‌‌ ఎదురవనుంది. ఇండియా స్పిన్నర్లు జోరు మీదున్నా..  టర్నింగ్ బాల్స్‌‌‌‌ను మెరుగ్గా ఆడే  కేన్ విలియమ్సన్‌‌‌‌, విల్ యంగ్‌‌‌‌, డెవాన్‌‌‌‌ కాన్వే, రచిన్ రవీంద్ర కివీస్ సొంతం. వీళ్లను నిలువరిస్తేనే ఇండియా విజయం సాధించే అవకాశం ఉంటుంది. గాయం నుంచి కోలుకొని వచ్చిన రచిన్‌‌‌‌ బంగ్లాపై సెంచరీతో జోరుమీదున్నాడు. కివీస్ స్పిన్ విభాగం టోర్నీలోనే అత్యంత బలంగా ఉండగా..  పేసర్లు హెన్రీ, జెమీసన్, ఒరూర్క్‌‌‌‌ను ఎదుర్కోవడం కూడా అంత ఈజీ కాబోదు. ఈ మ్యాచ్‌‌‌‌లో ఓడితే సెమీస్‌‌‌‌కు ముందు ఆత్మవిశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉండటంతో ఇండియా ఏ మాత్రం అలసత్వం చూపెట్టకుండా ఆడాల్సిన అవసరం ఉంది. 

తుది జట్లు (అంచనా)

ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్)/రిషబ్ పంత్‌‌‌‌, శుభ్‌‌‌‌మన్ గిల్, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్, జడేజా, హర్షిత్ రాణా, అర్ష్‌‌‌‌దీప్/షమీ,
 కుల్దీప్‌‌‌‌/వరుణ్ చక్రవర్తి.

న్యూజిలాండ్‌‌‌‌: విల్ యంగ్,  కాన్వే, విలియమ్సన్, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్ (కీపర్), గ్లెన్ ఫిలిప్స్,   బ్రేస్‌‌‌‌వెల్, శాంట్నర్ (కెప్టెన్‌‌‌‌), మాట్ హెన్రీ, కైల్ జెమీసన్, విలియం ఒరూర్క్‌‌‌‌.