IND vs AUS: ఇండియా vs ఆస్ట్రేలియా హైఓల్టేజ్ మ్యాచ్.. రద్దయితే ఫైనల్లో మనమే..!

IND vs AUS: ఇండియా vs ఆస్ట్రేలియా హైఓల్టేజ్ మ్యాచ్.. రద్దయితే ఫైనల్లో మనమే..!

ప్రతిష్ఠాత్మక చాంపియన్స్‌ ట్రోఫీ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు ముగియగా.. మంగళ, బుధవారాల్లో సెమీ ఫైనల్ పోరు జరగనుంది. మంగళవారం(మార్చి 04) మొదటి సెమీఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వనున్న ఈ మ్యాచ్ మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. 

ఇప్పటికే ఈ టోర్నీలో మూడు మ్యాచ్‌లు(ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ vs బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా) వర్షార్పణం అయ్యాయి. దాంతో భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే పరిస్థితి ఏంటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రద్దయితే ఎవరికి లాభం..? రిజర్వ్ డే ఉందా, లేదా..? అనేది చూద్దాం.. 

రిజర్వ్ డే..

చాంపియన్స్‌ ట్రోఫీలో సెమీఫైనల్‌ మ్యాచ్‌లకు రిజర్వ్ డే కేటాయించారు. అందువల్ల మ్యాచ్ రోజు వర్షార్పణం అయినా.. ఆ మరుసటి రోజు మ్యాచ్ నిర్వహిస్తారు. మార్చి 4న జరిగే మొదటి సెమీఫైనల్‌కు మార్చి 5న రిజర్వ్ డే ఉంది. అలాగే, మార్చి 5న జరగనున్న రెండవ సెమీఫైనల్‌కు మార్చి 6న రిజర్వ్ డే ఉంది. 

Also Read :- ప్లేయింగ్ 11లో వరుణ్,మెక్‌గుర్క్.. భారత్, ఆస్ట్రేలియా తుది జట్టు ఇదే!

5 గంటలు అదనపు టైమ్.. 

భారత్ vs ఆస్ట్రేలియా మ్యాచ్ దుబాయ్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడే అవకాశాలు దాదాపు లేవు. ఒకవేళ వర్షం అంతరాయం కలిగించినా.. అదే రోజు మ్యాచ్‌ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకు ఐదు గంటల ఆదనపు సమయం కూడా ఉంది. బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయం వేచి చూస్తారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే, రిజర్వ్ డే రోజు మ్యాచ్ ఆగిపోయిన దగ్గర నుంచి తిరిగి ప్రారంభమవుతుంది. 

రెండో జట్టు 25 ఓవర్లు ఆడితేనే ఫలితం..

నాకౌట్ మ్యాచ్‌ల్లో DLS పద్ధతి ద్వారా ఫలితం నిర్ణయించడాన్ని 20 ఓవర్ల నుండి 25 ఓవర్లకు పెంచారు. అనగా, మొదట ఒక జట్టు బ్యాటింగ్ పూర్తై.. రెండవ స్థానంలో బ్యాటింగ్ చేసే జట్టు కనీసం 25 ఓవర్లు పూర్తి చేసి ఉండాలి. అప్పుడే DLS పద్ధతిలో ఫలితం నిర్ణయిస్తారు.  

ఒకవేళ రిజర్వ్ డే రోజున కూడా మ్యాచ్ పూర్తి కాకపోతే, గ్రూప్ దశలో పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అదే జరిగితే టీమిండియా.. ఫైనల్లో అడుగు పెడుతుంది. ఇదీ ఒకందుకు మనకు మంచిదే.