- పూర్తికాని చనాఖ–కోర్టా బ్యారేజీ
- భూ సేకరణ, డిస్ట్రిబ్యూటరీ పనుల్లో జాప్యం
- వచ్చే ఏడాది సాగునీరు కష్టమే
- సీఎం, మంత్రులు పర్యటించిన మారని పరిస్థితి
ఆదిలాబాద్, వెలుగు: రాష్ట్రంలో కేసీఆర్ తలపెట్టిన ప్రధాన ప్రాజెక్టుల్లో చనాఖ-కోర్టా ఒక్కటి. లోయర్ పెన్ గంగాపై తెలంగాణ, మహారాష్ట్ర భూ భాగాన్ని కలుపుతూ చేపట్టిన ఈ బ్యారేజీ నిర్మాణం ఆరేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఏటా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు బ్యారేజీని సందర్శించి పూర్తి చేస్తామంటూ హామీలు ఇస్తున్నారు.. ఆ తర్వాత పట్టించుకోవడంలేదు. ఆదిలాబాద్, బేల, తాంసి, బీంపూర్ మండలాలకు 51 వేల సాగునీటిని అందించే లక్ష్యంతో 2015–-16 లో 23 గేట్లతో చనాఖ– -కోర్టా బ్యారేజీ పనులు ప్రారంభించారు. పంప్ హౌజ్, రిజర్వయర్, డిస్ట్రిబ్యూటరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మొదట రూ. 386 కోట్ల అంచనాతో చేపట్టారు. ఫండ్స్ సరిపోవడం లేదంటూ అంచనాలు మార్చి రూ. 1,227 కోట్లకు పెంచారు. మూడేళ్ల కిందట సీఎం కేసీఆర్ బ్యారేజీని సందర్శించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్ప్రాజెక్టును సందర్శించారు. జూన్, జులైలో సాగునీరు అందిస్తామన్నాని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో వచ్చే రబీలో సైతం నీరందరే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు వర్షాలు పడితే మళ్లీ పనులు పెండింగ్ లో పడక తప్పదు. ఇటీవల డ్రైరన్ చేపట్టిన అధికారులు మోటార్లలో సాంకేతిక లోపం కారణంగా మొరాయించాయి.
ఏయే పనులు ఎక్కడెక్కడంటే..
- చనాఖ-కోర్టా గ్రామాల మధ్య పెన్ గంగాపై రూ. 380 కోట్లతో బ్యారేజీ నిర్మాణం.
- జైనథ్ మండలంలోని హత్తిఘాట్ గ్రామం వద్ద రూ. 100 కోట్లతో పంపుహౌజ్ నిర్మాణం.
- జైనథ్, బేల పరిధిలో రూ. 207 కోట్లతో 42 కిలో మీటర్ల ప్రధాన కాల్వ పనులు నిర్మాణం.
- భీంపూర్ మండలంలోని పిప్పల్ కోటి గ్రామం వద్ద ప్రధాన కెనాల్ ద్వారా వచ్చే నీటిని నిల్వ చేసేందుకు రూ.270 కోట్లతో రిజర్వాయర్.
- 5.5 మెగవాట్లతో మూడు, 12 మెగవాట్ల సామర్థ్యం మూడు మోటర్లు ఏర్పాటు.
- జైనథ్, బేల మండలాల్లో రూ.170 కోట్లతో డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం.
గడువు మీద గడువు పెంపు..
2015–-16లో ప్రారంభమైన ప్రాజెక్టు నిర్మాణం 2018లో పూర్తి చేయాల్సి ఉంది. పనులు పూర్తికాకపోవడంతో గడువు మీద గడువు పెంచుతున్నారే తప్ప.. పనులు మాత్రం పూర్తి చేయడం లేదు. బ్యారేజీ, పంప్ హౌజ్, రిజర్వాయర్, మెయిన్ కెనాల్, డిస్ట్రిబ్యూటరీల కోసం 3,255 ఎకరాల భూ సేకరణ చేపట్టాల్సి ఉండగా, ఇప్పటి వరకు 1,730 ఎకరాలు మాత్రమే సేకరించారు. మరో 1,525 ఎకరాలు చేపట్టాల్సి ఉంది. అటు మెయిన్ కెనాల్ నుంచి గ్రామాలకు సాగునీరు అందించేందుకు డిస్ట్రిబ్యూటరీ పనులు చేపట్టారు. వీటి కోసం దాదాపు 600 ఎకరాల భూ సేకరణ చేపట్టాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో భూ సేకరణ జరగడం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటి వరకు చేసిన పనులకు సంబందించి దాదాపు రూ. 80 కోట్ల వరకు పెండింగ్ లో ఉన్నాయి. మహారాష్ట్ర వైపు బ్యారేజీ దగ్గర రెండు వైపులా రక్షణ గోడ ఇంకా పూర్తి కాలేదు. అంతే కాదు రిజర్వాయర్పనులూ నత్తనడకన సాగుతున్నాయి. అక్కడా భూసేకరణే ప్రధాన సమస్యగా మారింది. బ్యారేజీ, హత్తిఘాట్ పంప్‌హౌస్, మెయిన్ కెనాల్పనులు మాత్రమే 90 శాతం వరకు పూర్తయ్యాయి.
పనులు నడుస్తున్నాయి..
చనాఖ-కోర్టా బ్యారేజీ పనులు నడుస్తున్నాయి. ప్రస్తుతం మోటార్ల సామర్థ్యం, మరమ్మతులకు సంబంధించిన పనులు చేస్తున్నాం. భూసేకరణలో జాప్యం జరుగుతుండటంతో డిస్ట్రిబ్యూటరీ నిర్మాణాలు లేట్ అవుతోంది.
– రవీందర్, ఈఈ ఇరిగేషన్