ఆదిలాబాద్,వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో 51 వేల ఎకరాలకు సాగునీరందించాలనే ఉద్దేశం ప్రారంభించిన చనాఖ కోర్టా ప్రాజెక్టు ముందుకు సాగడంలేదు. లోయర్ పెన్ గంగాపై తెలంగాణ, మహారాష్ట్ర భూభాగాన్ని కలిపి 2016లో చనాఖ కోర్టా బ్యారేజీ పనులు ప్రారంభించారు. 2018 కల్లా బ్యారేజీ పూర్తిచేయాల్సి ఉండగా ఇంతవరకు పనులు పూర్తికాలేదు. ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు గడువు మీద గడువు పెంచుతున్నారే తప్ప.. పనులు మాత్రం పూర్తి చేయించడంలేదు.
23 గేట్లతో బ్యారేజీ పనులు
ఆదిలాబాద్, బేల, తాంసి, బీంపూర్ మండలాలకు 51 వేల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో 23 గేట్లతో బ్యారేజీ పనులు ప్రారంభించారు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి తో ఒప్పందం కుదుర్చుకున్నారు. పంప్ హౌజ్, రిజర్వాయర్, డిస్ట్రిబ్యూటరీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మొదట రూ. 386 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించారు. తర్వాత ఏటా అంచనాలు పెంచారు. ప్రస్తుతం రూ. 1,227 కోట్లతో పనులు చేపడుతున్నారు. గతేడాది మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సీఎంవో ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల చనాఖ కోర్టా సందర్శించి త్వరలో సాగునీరు అందిస్తామని తెలిపారు. కానీ ఇంకా పనులు సాగుతూనే ఉన్నాయి.
భూ సేకరణకు నిధుల కొరత..
చనాఖ కోర్టా బ్యారేజీ, పంప్ హౌజ్, రిజర్వాయర్, మెయిన్ కెనాల్, డిస్ట్రిబ్యూటరీల కోసం 3,255 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు 1,730 ఎకరాలు సేకరించారు. బ్యారేజీ, పంప్‌హౌజ్, కెనాల్ కు సంబంధించి పనులు 90 శాతం పూర్తయ్యాయి. అయితే ఆయకట్టుకు సాగునీరు అందించాలంటే ప్రధానమైన డిస్టిబ్యూటరీలు నిర్మించాల్సి ఉంటుంది. కానీ.. దీనికి సంబంధించి 800 ఎకరాల భూసేకరణ ప్రక్రియ ఇప్పటి వరకు పూర్తికాలేదు. మరో వెయ్యి ఎకరాలు రిజర్వాయర్‌నిర్మాణానికి సేకరించాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రాజెక్టు పూర్తి కావడానికి మరింత కాలం పట్టే పరిస్థితి కనిపిస్తోంది.
భూ సేకరణ చేయాల్సి ఉంది
చనాఖ కోర్టా బ్యారేజీ, మెయిన్ కెనాల్, పంప్ హౌజ్ పనులు దాదాపు పూర్తయ్యాయి. భూ సేకరణ లో జాప్యం జరుగుతుండటంతో డిస్టిబ్యూటరీ నిర్మాణాలు పెండింగ్ ఉన్నాయి. ప్రభుత్వానికి ఇప్పటికే భూసేకరణకు సంబంధించిన పూర్తి నివేదిక అందజేశాం. నిధులు విడుదల అయిన వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తాం.
- రవీందర్, ఈఈ ఇరిగేషన్