పథకాలు మాకు.. పదవులు మీకా

పథకాలు మాకు.. పదవులు మీకా

డాక్టర్ బీఆర్​ అంబేద్కర్ చెప్పినట్లు రాజ్యాధికారంలోకి రాలేని కులాలు మనుగడ సాగించలేవు. ఉనికి కోసం, హక్కుల కోసం పోరాటం ఎవరు చేస్తున్నా.. పదవులు, అధికారం మాత్రం అగ్రవర్ణాల చేతుల్లోనే ఉంటున్నయి. దళిత, బహుజనుల ప్రభుత్వాలు.. కంటితుడుపు చర్యగా పథకాలు ప్రకటిస్తున్నాయి. ఈ పథకాలు, నిధుల కేటాయింపు ద్వారా కంటే కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించటం ద్వారానే వారి ఆత్మగౌరవం నిలబడుతుంది. అందుకే మున్ముందు తెలంగాణలో ఆత్మగౌరవ నినాదం మరింత బలపడి పథకాల కోసం కాకుండా రాజ్యాధికారం కోసం దళిత బహుజన వర్గాలు గొంతెత్తబోతున్నాయి. ఆత్మగౌరవం ఒక నినాదంగా కాకుండా సామాజిక న్యాయ ఎజెండాగా మారి ప్రతి నియోజకవర్గంలో చైతన్యం రానుంది.

తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రాంతంలోని 92 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మెనార్టీలు సామాజిక తెలంగాణ కోసం పట్టుబట్టింది. అయితే నాటి ఉద్యమ నాయకత్వం ముందైతే బౌగోళిక తెలంగాణ రాష్ట్రం రానివ్వండి తరువాత అట్టడుగు వర్గాలకి, బడుగు, బలహీన వర్గాలకి న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి దళితుడే తొలి ముఖ్యమంత్రి అనే ప్రకటన తెర మీదకు వచ్చింది. తెలంగాణ ఉద్యమాన్ని తమ బతుకులు మార్చే పోరాటంగా భావించి సబ్బండ వర్గాలు ఉద్యమకారులై కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు. రాష్ట్రమైతే వచ్చింది గానీ.. సామాజికంగా హక్కులు దక్కలేదు. రాజ్యాధికారం పెద్ద కులాల చేతిలోనే పెట్టుకున్నారు. స్వార్థ రాజకీయాలతో సామాజిక తెలంగాణ భావనకు తూట్లు పొడిచారు. 
ఓట్లు మావి.. సీట్లు మీవా?
1984లో కాన్షీరాం బహుజన సమాజ్ పార్టీని స్థాపిస్తూ.. ‘ఓట్లు మావి ..- సీట్లు మీవా’ అనే నినాదంతో బహుజనులను రాజ్యాధికారం సాధన దిశగా ప్రోత్సహించారు. అదే స్ఫూర్తితో దళిత, బహుజనులు సబ్బండవర్గాల ప్రజలు పోరుబాట పట్టారు. పోరాటాల ద్వారా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ‘అట్టడుగు వర్గాలకు పథకాలు.. అగ్రవర్ణాలకి పదవులు’ అనే ప్రక్రియ కొనసాగటం ఈ ప్రాంత ప్రజల ఉద్యమ ఆకాంక్షలకు, పోరాట స్ఫూర్తికి, త్యాగాలకు విరుద్ధం అనే విషయం పాలకులు గుర్తించాలి. 2004లోనే ఉద్యమనేతలు సామాజిక న్యాయానికి తూట్లు పొడిచారు. వైఎస్సార్​ సీఎంగా  ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా టీఆర్ఎస్ ​అధికారం పంచుకుంది. అయితే టీఆర్ఎస్ కు ఇచ్చిన నాలుగు మంత్రి పదవులు కూడా పెద్దకులాలకే కేటాయించారనే విషయం మర్చిపోకూడదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్, దాని అధినేత సీఎం కేసీఆర్​ తన మంత్రి వర్గంలో పెద్దకులాలకే అగ్రతాంబూలం వేశారు. అట్టడుగు వర్గాలకు పెద్దగా ఏమీ దక్కలేదు. మొదటిసారి మంత్రి వర్గ కూర్పులోనే సామాజిక సమతుల్యత దెబ్బతిన్నదంటే రెండోసారీ అలాగే కొనసాగింది. రెండవ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అగ్రవర్ణాలకే సింహభాగం పదవులు దక్కాయి. రాష్ట్రంలో 15 శాతానికి పైగా ఉ న్న మాదిగ కులానికి మంత్రి వర్గంలో ప్రాతినిథ్యమే లేదు. కోయ సామాజిక వర్గానికి అవకాశమే దక్కలేదు. రెండు పర్యాయాలు తన మంత్రి వర్గంలో 52 శాతం ఉన్న బహుజన వర్గాలకు 7 మంత్రి పదవులనే కేటాయించడం గమనార్హం. 
మంత్రి పదవుల్లో అగ్రవర్ణాలకే చాన్స్..
ఫస్ట్​టర్మ్(2014–18) ​టీఆర్ఎస్​ మంత్రివర్గంలో ఓసీల నుంచి 10 మందికి చోటు దక్కింది. అందులో  రెడ్డిలు ఆరుగురు, ముగ్గురు వెలమ, ఒకరు కమ్మ కులాలు నుంచి ఉన్నారు. బీసీలకు 4 మాత్రమే(మున్నూరుకాపు, ముదిరాజ్, యాదవ, గౌడ) దక్కాయి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం దక్కగా ఒక్కరు కూడా మహిళా మంత్రి లేకుండా పోయారు. రెండో టర్మ్(2018) కేబినెట్​ కూర్పులోనూ ఓసీల నుంచి10 మందికి పదవులు దక్కాయి. వారిలో రెడ్డిలు ఆరుగురు, ముగ్గురు వెలమ, ఒకరు కమ్మ కులం నుంచి ఉన్నారు. రెండో టర్మ్​లోనూ బీసీలకు 4 మాత్రమే(మున్నూరుకాపు, ముదిరాజ్, యాదవ, గౌడ) పదవులు దక్కాయి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల నుంచి ఒక్కో పదవి దక్కింది. ఈసారి ఇద్దరు(ఒకరు రెడ్డి, మరొకరు ఎస్టీ సామాజిక వర్గాల)మహిళలకు పదవులు దక్కాయి. 
సామాజిక న్యాయం ఇట్లనే ఉంటదా?
రాష్ట్ర ప్రభుత్వం అట్టడుగు వర్గాలకు కంటితుడుపు చర్యగా పథకాలు ప్రకటిస్తోంది. రాజ్యాధికారానికి అవకాశం ఇవ్వకుండా సాధికారతను సాధిస్తామని చెప్పడం హాస్యాస్పదం. దళితులకు దళిత బంధు, మైనార్టీలకి షాదీముబారక్, యాదవులకు గొర్రెల పంపణీ, ముదిరాజ్ లకు చేప పిల్లలు, రజకులకు దోబీగాట్ల ఆధునికీకరణ, నాయి బ్రాహ్మణులకు ఆధునిక సెలూన్లు, లాండ్రీ షాపులకు, సెలూన్లకు ఉచిత విద్యుత్ లాంటి పథకాలన్నీ పేరుకు బాగానే ఉన్నా.. ఆయా వర్గాలపై ప్రభుత్వం చేస్తున్న బడ్జెట్​మాత్రం తక్కువే. కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేయకపోవడం, జనాభా దామాషా ప్రకారం రావాల్సిన రిజర్వేషన్లను కల్పించకపోవడం ఒక ఎత్తు అయితే పెద్ద కులాలకు పదవులతో పాటు రాష్ట్రంలోని వనరులపై ఆధిపత్యాన్ని కల్పించడం, కాంట్రాక్టులు, ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఐటీ పరిశ్రమలు అన్ని వాళ్ల చేతుల్లో పెడుతుండటాన్ని బహుజన వర్గాల ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి. ఒడ్డించే వాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా మన వాటా మనకు దక్కుతుందంటారు. కానీ ఇక్కడ ఒడ్డించేవాడు(అధికారంలో ఉన్నవాడు) ఎవరనేదే అసలు సమస్య. 

                                                                                                                                                           - డా. తిరుణహరి శేషు అసిస్టెంట్ ​ప్రొఫెసర్, కాకతీయ యూనివర్సిటీ