అలర్ట్: చలికాలంలో కరోనా కేసులు పెరిగే ఛాన్స్

అలర్ట్: చలికాలంలో కరోనా కేసులు పెరిగే ఛాన్స్

రాష్ట్రంలో చలి కాలం ప్రారంభకావడంతో చలితో కరోనా  కేసులు పెరిగే అవకాశం ఉంటుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్‌ శ్రీనివాసరావు సూచించారు.రాష్ట్ర వ్యాప్తంగా 1200 ర్యాపిడ్‌ సెంటర్లతో పాటు 310 మొబైల్‌ టెస్టింగ్‌ సెంటర్ల ద్వారా కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రజలు తీసకుంటున్న జాగ్రత్తలతో ప్రస్తుతం కరోనా  తీవ్రత తగ్గిందన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందే ప్రజల దగ్గరకు వెళ్లి పరీక్షలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అయితే దీపావళితో పాటు, చలి కూడా పెరిగిందని  ఈ క్రమంలో చలి పెరిగితే వైరస్‌ ప్రభలే అవకాశం ఉంటుందన్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం, చలి వలన వైరస్‌ కేసులు పెరగడంతోపాటు మృతుల సంఖ్య పెరుగుతున్నాయని అక్కడి డాక్టర్లు చెబుతున్నారని తెలిపారు. దీపావళి సందర్భంగా బాణాసంచాలను బ్యాన్‌ చేశారని.. అయితే వ్యాపారులకు ఇది ఇబ్బందికర సమస్య అయినప్పటికీ ప్రజల ప్రాణాలు అంతకన్నా ముఖ్య మన్నారు. ప్రతి ఏడాది దీపావళి తర్వాత శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయన్నారు. కరోనా క్రమంలో ప్రజలు క్రాకర్స్‌ లేకుండా ఈ ఏడాది దీపావళి జరుపుకో వాలని కోరారు. పండుగల సమయంలో షాపింగ్‌కు ఎక్కువగా వెళ్తున్నారని ఆయా సమయాల్లో తప్పక కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు.ఇప్పటి వరకు ఏ వ్యాక్సిన్‌ కూడా ఏడాదిలోపు అందుబాటులోకి రాలేదని గుర్తుచేశారు. ప్రజలు వ్యాక్సిన్‌ కోసం చూడకుండా తగుజాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.