హైదరాబాద్, వెలుగు: లిక్కర్ స్కామ్‌లో కవిత అప్రూవర్‌గా మారే అవకాశముందని, అందుకే హరీశ్‌రావు, కేటీఆర్ వెళ్లి ఆమెను బతిమాలుతున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం సీఎల్పీ ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఫామ్‌హౌస్‌కు రమ్మని కేసీఆర్ పిలుస్తుంటే వాళ్లు మాత్రం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌లో జాయిన్ అవుతున్నారన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ లో చేరుతారని, వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ సెషన్ వరకు కేటీఆర్, హరీశ్‌రావు తప్ప ఆ పార్టీలో ఎవరూ ఉండరని జోస్యం చెప్పారు. విద్యుత్, కాళేశ్వరంపై జ్యుడీషియల్ ఎంక్వైరీ జరిపించాలని కేసీఆరే డిమాండ్ చేశారని, ఇప్పుడు కమిషన్ ఏర్పాటుచేస్తే దానికి అర్హత లేదంటూ కోర్టుకు వెళ్లారని విమర్శించారు.
జేఎంఎం ముడుపుల కేసులో చిన్న అభియోగంపై మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విచారణకు అటెండ్ అయ్యారని, ఆయన కంటే కేసీఆర్ గొప్ప కాదని యెన్నం అన్నారు. 10 ఏండ్ల పాలనలో కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ప్రతిపక్ష నేతగా సలహాలు, సూచనలు ఇస్తూ మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. కేసీఆర్ చేసిన అప్పులకు అసలు, వడ్డీలు కడుతూ ఉద్యోగులకు ప్రతి నెల 5వ తేదీలోపే సర్కారు జీతాలు ఇస్తున్నదని చెప్పారు. అర్హత లేని 42 లక్షల ఎకరాలకు రైతు బంధు ఇచ్చి నిధులు దుబారా చేశారని కేసీఆర్‌పై ఫైరయ్యారు. ధరణిని అడ్డుపెట్టుకొని వేల కోట్ల విలువైన భూములను కేసీఆర్ కుటుంబం కబ్జా చేసిందన్నారు.