
- ఉన్నతాధికారులు అలర్ట్‌గా లేకుంటే బఫర్ జోన్ ప్లాట్లకూ క్లియరెన్స్
- 2020లోనే 25.67 లక్షల దరఖాస్తులు.. 9 లక్షలకు పైగా అర్హత లేనివేనని అనుమానం
- సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో పెట్టినా.. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌కు చాన్స్
హైదరాబాద్, వెలుగు: ల్యాండ్ రె గ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)లో ఉన్నతాధికారులు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అక్రమాలు జరిగే చాన్స్ కనిపిస్తున్నది. వారు అలర్ట్‌గా లేకుంటే బఫర్‌జోన్ ప్లాట్లకూ క్లియరెన్స్లభించే ప్రమాదం పొంచి ఉన్నది. గతంలో వచ్చిన దరఖాస్తుల్లో 35 శాతానికి పైగా అప్లికేషన్లు చెరువు , ప్రభుత్వ, అసైన్డ్ భూములకు సంబంధించినవేనని అనుమానాలు రావడం.. ఎల్ఆర్ఎస్ కీలక బాధ్యతలను ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్లకు అప్పగించడంతో ఇందులో గోల్మాల్ జరిగే అవకాశం ఉన్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఇటీవల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగులు ఏసీబీకి చిక్కుతుండడం అనుమానాలకు బలం చేకూరుస్తున్నది. పట్టా భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా వేసిన వెంచర్లలో కొన్న ప్లాట్లను రెగ్యులరైజేషన్ చేసేందుకు గత బీఆర్ఎస్ సర్కారు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)ను తీసుకొచ్చింది. రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్కింద స్థలాల క్రమబద్ధీకరణకు 2020లోనే ఉత్తర్వులు వెలువడగా.. మొత్తం 25.67 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఓపెన్స్పేస్చార్జీల కింద14 శాతం ఫీజు కట్టించుకొని ఆయా ప్లాట్లను రెగ్యులరైజ్ చేయాల్సి ఉంది. దీనిపై ఈ నెల 31 దాకా సర్కారు 25 శాతం రాయితీ కూడా ఇచ్చింది.
కాగా, చెరువు శిఖాల్లో, ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో వెంచర్లు వేసిన అక్రమార్కులే స్వయంగా సర్కారు ఇచ్చిన అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు రంగంలోకి దిగి, పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు పెట్టించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే గతంలో వచ్చిన దరఖాస్తుల్లో 9 లక్షలకు పైగా అప్లికేషన్లు చెరువు, ప్రభుత్వ, అసైన్డ్ భూములకు సంబంధించినవే ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ లెక్కన ఉన్నతాధికారులు ఏమరపాటుగా ఉన్నా అసలుకే ఎసరువచ్చే ప్రమాదముందని ఎక్స్ పర్ట్స్అంటున్నారు.
సర్కారుకు వచ్చే ఆదాయం సంగతేమోగానీ అంతకు మించి విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతాయని హెచ్చరిస్తున్నారు. ఎలాంటి ఎంక్వైరీ లేకుండా సబ్ రిజిస్ట్రార్లు ఎల్ఆర్ఎస్ ఫీజును వసూలు చేసి.. రెగ్యులరైజ్చేసే అవకాశం ఇస్తున్నందున కొత్త అక్రమాలకు తెరతీసినట్టు అవుతుందని చెప్తున్నారు. ప్రభుత్వ, శిఖం భూములతోపాటు చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న ప్లాట్లకు, లే అవుట్స్‌కు సైతం ఎల్ఆర్ఎస్ కింద క్లియరెన్స్ ఇస్తే లేని పంచాయితీలు తలెత్తుతాయని స్పష్టం చేస్తున్నారు.
నిషేధిత జాబితాలో ఉన్నా ఉత్తిదే
ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ కోసం అమలు చేస్తున్న విధానంలో చెరువులు, బఫర్ జోన్, ప్రభుత్వ, శిఖం, సీలింగ్ ల్యాండ్స్ పరిధిలో ఉన్న లే అవుట్లు, ప్లాట్ల నుంచి రెగ్యులరైజేషన్‌కు ఫీజు వసూలు చేస్తున్నారు. తర్వాత వాటిని ఫీల్డ్‌లో ఎంక్వైరీ చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వనున్నట్టు ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం రిలీజ్ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనికి అనుగుణంగా అధికారులు నిషేధిత భూముల జాబితాను కూడా రెడీ చేశారు. సర్వే నెంబర్ల వారీగా ఎక్కడెక్కడ ప్రభుత్వానికి భూములు ఉన్నాయి? ఏ సర్వే నంబర్లలో చెరువులు, వాటి శిఖం భూములున్నాయి? అనే వివరాలతో సన్నద్ధంగా ఉన్నట్లు చెప్తున్నారు.
కానీ.. ఈ సర్వే నెంబర్లు ఆటోమేటిక్‌గా బ్లాక్ చేయడం లేదు. నిషేధిత లే అవుట్స్‌లోని ప్లాట్లను రెగ్యులరైజ్ చేసే టైంలో రెడ్ సింబల్ చూపిస్తుందని చెప్తున్నారు. కానీ సర్వే నెంబర్ మార్చి చేస్తే ఎలాంటి అభ్యంతరం రాదని, దీంతో అలా కూడా రెగ్యులైజేషన్, తద్వారా అక్రమాలకు అవకాశముందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కేవలం నిషేధిత జాబితాలో చూపించిన మాత్రాన ఆన్లైన్లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ఆగిపోకుండా ఉండదని, పైగా ఒక్కసారి ప్రభుత్వానికి ఫీజు చెల్లించి, నిర్మాణాలు పూర్తి చేసి.. ఆ తర్వాత ఆ ఆధారాలతో కోర్టులకు వెళ్తే అక్రమార్కులకు ఇదో వరంలా మారుతుందనే చర్చ నడుస్తున్నది.
గతంలో ఉన్న నిబంధనల ప్రకారం మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అప్లికేషన్లు పరిశీలించి.. అన్నీ సక్రమంగా ఉంటేనే ఎల్‌ఆర్‌ఎస్ కింద 14 శాతం ఓపెన్ స్పేస్ చార్జీలు కట్టాలని నోటీసు ఇవ్వాలి. ఆ తర్వాత దరఖాస్తుదారుడు నిర్ణీత మొత్తం చెల్లించాక స్థానిక సంస్థల నుంచి ఎల్ఆర్‌ఎస్ ప్రొసీడింగ్ జారీ చేయాల్సి ఉన్నా.. ఇప్పుడు ఈ కండీషన్లు ఎత్తేయడంతో అవినీతి అధికారులకు ఊతమిచ్చినట్టయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
35 శాతం పైన అనర్హమైనవే
రాష్ట్రంలో స్థలాల క్రమబద్ధీకరణకు 2020లోనే ఉత్తర్వులు వెలువడగా 25.67 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు సుమారు 9 లక్షల దరఖాస్తులను పరిశీలించగా.. ఇందులో 2 లక్షలోపు పరిష్కరించారు. ఎల్ఆర్ఎస్ కింద వచ్చిన అప్లికేషన్లలో 35 శాతం పైన ప్రభుత్వ, శిఖం, బఫర్ జోన్లలో ఉన్నవే అని తెలిసింది. అంటే దాదాపు 9 లక్షల ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు రెగ్యులరైజేషన్‌కు ఎలిజిబుల్కాదని అర్థమవుతున్నది. ఇవి కాకుండా ఇంకా కొత్తగా ఎన్ని వస్తాయో తెలియదు. ఇంతకు ముందు మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు కలిసి సమన్వయంతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించి, క్లియర్ చేసే విధానం ఉంది.
ఇప్పుడు ఎల్ఆర్ఎస్కు సంబంధించి ఫీజుల వసూలతోపాటు ఇతర కీలక బాధ్యతలను ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్లకు అప్పగించింది. అయితే, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల సబ్రిజిస్ట్రార్లతో పాటు కార్యాలయ ఉద్యోగులు తరుచూ ఏసీబీకి చిక్కుతున్నారు. సబ్రిజిస్ట్రార్ఆఫీసుల్లో అక్రమ రిజిస్ట్రేషన్లకు తెరలేచే ప్రమాదముందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
కాగా, అనధికారిక లేఅవుట్లలోని కనీసం 10% ప్లాట్లను 2020 ఆగస్టు 26 నాటికి రిజిస్టర్డ్ సేల్ డీడ్ చేసుకొని ఉంటే మిగిలిన ప్లాట్లకు కొత్తగా ఎల్‌ఆర్‌ఎస్ కింద రెగ్యులరైజ్ చేయాల్సి ఉంటుంది. మార్చి 31లోపు కడితే 25% రాయితీ ఇవ్వనున్నారు. దీంతో ప్రభుత్వానికి ఈ నెలఖారులోగా రూ.3 వేల కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.
సర్వే నంబర్లు మార్చి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం!
గతంలో మాదిరిగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ఎల్ 1, ఎల్2, ఎల్3 మూడు దశల్లో పరిశీలించి, ధ్రువీకరించుకున్న తర్వాత ప్రొసీడింగ్స్ ఇచ్చే పద్ధతిని ఇప్పుడు ఎత్తేశారు. అంతేకాకుండా ప్రభుత్వ భూములు, బఫర్ జోన్స్ పరిధిలో ఉన్న లే అవుట్లు, ప్లాట్లకు కూడా ముందుగా ఫీజు చెల్లించే అవకాశం కల్పించి, తర్వాత ప్రొసీడింగ్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలో సర్వే నంబర్లను తారుమారు చేసి రెగ్యులరైజేషన్ చేసుకునే వీలుంది.
ఒక్కసారి ఫీజు కట్టేశాక ప్రొసీడింగ్స్ కోసం ఆయా శాఖల అధికారులను మభ్య పెట్టి కూడా రిజిస్ట్రేషన్లు చేయించు కునే అవకాశం ఉంది. కొంతమంది ఇప్పటికే అక్రమ లే అవుట్లు, ప్లాట్లలో పర్మిషన్లు లేకుండా నిర్మాణలు కూడా చేపట్టారు. ఇందులో ప్రభుత్వ భూములు కూడా ఉండడంతో ఈ ఎల్ఆర్ఎస్ ఎటు దారితీస్తుందోననే చర్చ అటు రెవెన్యూ, మున్సిపల్, ఇటు ఇరిగేషన్అధికారుల్లో జోరుగా నడుస్తున్నది.
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 947 శెట్టికుంట ఎఫ్టీఎల్లో అక్రమంగా లే అవుట్ వేసి నిర్మించిన ఇండ్లు ఇవి. ఇందులో కృష్ణ బృందావన్ కాలనీ, చక్రపురి కాలనీలు వెలిశాయి. 2015లో ఫిర్యాదులు అందడంతో అప్పటి సంగారెడ్డి ఆర్డీవో మధుసూదన్ రెడ్డి సుమారు 200 మంది సిబ్బందితో వెళ్లి వందలాది ఇండ్లను నేలమట్టం చేశారు. కానీ 10 ఏండ్ల తర్వాత అదే సర్వే నంబర్ 947లోని అదే వెంచర్లో స్థానిక నేతలు, అధికారుల సపోర్ట్‌తో మళ్లీ వందల నిర్మాణాలు కొనసాగిస్తున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేసిన వందల మంది.. ఇప్పుడు రెగ్యులరైజ్ చేసుకునే పనిలో పడ్డారు. కొందరైతే పక్కనే ఉన్న డీటీసీపీ లేఅవుట్‌ను చూపి ఎల్ఆర్ఎస్కు సైతం దరఖాస్తు చేసుకోకుండానే ఇండ్లు నిర్మిస్తుండగా, ఇంకొందరు ఏకంగా ఆ ఇంటి నంబర్లపైనే పర్మిషన్లు తీసుకుని కట్టేస్తున్నారు.
వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంట, నల్ల చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఆక్రమించి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేసి.. ప్లాట్లు చేసి అమ్మారు. రెండుచోట్లా కట్టిన ఇండ్లలో కొన్ని ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోకి వచ్చినట్లు ఇరిగేషన్ ఆఫీసర్లు గుర్తించగా.. వాటిని తొలగించాలని మున్సిపాలిటీ అధికారులు నోటీసులు ఇచ్చారు.
కానీ గత ప్రభుత్వ హయాంలో నాడు బీఆర్ఎస్ తో అంటకాగిన కొందరు రియల్ఎస్టేట్ వ్యాపారులు అధికారులతో లోపాయికారి ఒప్పందం చేసుకొని.. ఇండ్లను తొలగించకుండా చూశారు. కాగా, ఇండ్లు కట్టకుండా మిగిలిపోయిన ఓపెన్ప్లాట్లను రెగ్యులరైజ్చేసుకునేందుకు అప్పట్లోనే వీరు ఎల్ఆర్ఎస్ కింద అప్లికేషన్లు పెట్టుకున్నట్టు సమాచారం.